మురికివాడలపై పట్టింపేది..?

ABN , First Publish Date - 2021-02-24T04:40:31+05:30 IST

మురికివాడలపై పట్టింపేది..?

మురికివాడలపై పట్టింపేది..?

డ్రెయినేజీలు లేక నిలుస్తున్న వర్షపునీరు

చిన్న వర్షానికే ఇళ్లలోకి వరద నీరు

కానరాని మౌలిక సదుపాయాలు

పట్టించకోని బల్దియా అధికారులు


 హన్మకొండ, ఫిబ్రవరి 23, (ఆంధ్రజ్యోతి) : వరంగ ల్‌ మహానగరంలో మురికివాడల అభివృద్ధిపై జీడబ్ల్యూఎంసీ శీతకన్ను వేసింది. కార్పొరేషన్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు కనీసం వాటివైపు చూడడం లేదు. ఎన్నికలప్పుడే వీరికి మురికివాడలు గుర్తుకొస్తాయి. ఓ ట్ల కోసం వాగ్దానాలు కురిపించి ఆ తర్వాత పట్టించుకోవడమే మానేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొత్త లో సీఎం కేసీఆర్‌ అనూహ్యంగా నగరంలోని మురికివాడల్లో పర్యటించి వాటిని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కానీ అది ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. వరంగల్‌ పేరుకే స్మార్ట్‌ సిటీ.. లోపల అంతా డొ ల్లతనమే. భారీ వర్షాలు కురిసినప్పుడు నగరం నీటమునగడానికి కారణం.. మురికివాడలు అభివృద్ధి చెం దకపోవడమే. పలు స్లమ్‌ ఏరియాల్లో డ్రెయిజీలు, రోడ్ల లేవు. దీంతో  నగరంలో ఏ కొద్దిపాటి వర్షం పడి నా ముంపునకు గురయ్యేది ఎక్కువగా ఈ ప్రాంతాలే..


లోతట్టు ప్రాంతాల్లో ఆవాసాలు

మురికివాడలన్నీ లోతట్టు ప్రాంతాల్లో, ప్రధానంగా చెరువు శిఖం భూముల్లో వెలిశాయి. నిరుపేదలు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డవారు గూడు కోసం వామపక్ష పార్టీల ప్రోద్బలంతో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నారు. చెరువుకట్టల పక్కన, లోతట్టు ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పరుచుకున్నారు. దీంతో వర్షాలు కురిసినప్పుడు ఇవన్నీ నీటమునిగిపోతున్నాయి. మురికివాడల్లో సరైన సౌకర్యాలు లేక మురికి కూపాలుగా మారుతున్నాయి. ఏ మురికివాడలోనూ డ్రెయినేజీ వ్యవస్థే కనబడదు. గుడిసెల మధ్య నుంచే మురుగునీరు పారుతూ ఉంటుంది. చెరువు కట్టలపైన, తూములకు, కరకట్టలు, చెక్‌డ్యాంలకు అడ్డంగా మురికివాడలు ఏర్పాటు కావడంతో అవన్నీ మూసుకుపోయి వరద నీరు బయటకు వెళ్లే దారి లేకుండా పోయింది. వరంగల్‌ ప్రాంతంలో ఎస్‌ఆర్‌నగర్‌, చాకలి అయిలమ్మ నగర్‌, ఎంహెచ్‌నగర్‌, సుందరయ్యనగర్‌ హన్మకొండ ప్రాంతంలో దీనదయాళ్‌ నగర్‌ కాలనీలు ఇందుకు ఉదాహరణ.


183 మురికివాడలు..

వరంగల్‌, హన్మకొండ, కాజీపేట పట్టణాల్లో 183 మురికివాడలు ఉన్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినవి 91. గుర్తించనివి 92. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో 103, వరంగల్‌ పశ్చిమలో 80 మురికివాడలున్నాయి. నగరం మొత్తం జనాభాలో ఒకటింట మూడో వంతు జనాభా ఈ ప్రాంతాల్లోనే ఉంది. తాజా గణాంకాల ప్రకారం 3,26,293 మంది ఇక్కడ నివసిస్తున్నారు. చెరువు శిఖం భూముల్లో గుడిసెలు వేసుకొని ఉంటున్నవారు సుమారు లక్ష మంది ఉంటారు. పేదల బస్తీల్లో కనీస వసతులు లేక ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. మురుగునీరంతా ఇళ్ల మధ్యనే పారుతుంది. వర్షాలు కురిస్తే వరదనీరు వెళ్లే దారి లేక గుడిసెల మధ్యనే వారాలు, నెలల తరబడి నిలిచిపోతుంది. భారీ వర్షాలు కురిస్తే మురికివాడలు ముంపునకు గురవుతాయి. నగరంలో కుండపోత వర్షాలకు ఎక్కువగా జలమయమయ్యేవి మురికివాడలే. వడ్డెపెల్లి, గోపాల్‌పూర్‌, దేశాయిపేట, శాకరాసికుంట, భద్రకాళి చెరువు బండ్‌ తదితర లోతట్టు ప్రాంతాల్లోని మురికివాడల్లో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. కాలక్రమేణా పక్కా ఇళ్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలతో కొన్ని మురికివాడల   స్వరూపం మారిపోయింది. కార్పొరేషన్‌ అధికారులు పట్టించుకోకపోవడం, ముడుపులు తీసుకొని ఎడాపెడా అనుమతులు ఇవ్వడంతో చెరువులు, కుంటల నుంచి వచ్చే వరద ప్రవాహాలకు  అడ్డంగా నిర్మాణాలు జరిగాయి. దీని ప్రవాహం రూటు మారి ఇళ్లలోకి ప్రవేశిస్తోంది.  


అటకెక్కిన డీపీఆర్‌

రాష్ట్రంలో అత్యధికంగా మురికివాడలున్న నగరాల్లో వరంగల్‌ ఒకటి. వీటి అభివృద్ధి కోసం స్లమ్‌ ఫ్రీ సిటీ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌)ను 2016లోనే రూపొందించారు. రూ.2,338 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు తయారుచేశారు. కానీ ఇది కాగితాలకే పరిమితమైంది. కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రధాన నగరా ల్లో మురికివాడలను అభివృద్ధి చేసేందుకు పలు కొత్త పథకాలను తీసుకువచ్చింది. వీటిలో ఏ ఒక్కటైనా వరంగల్‌కు మంజూరయ్యేట్టు వరంగల్‌ ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ఉంటే నగరంలో ఈ పాటికి మురికివాడల స్వరూ పం మారిపోయేది. వాటిల్లో ఆధునిక డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటై ముంపు సమస్యలు తప్పేవి. 


నిధుల ఖర్చేది?

ఏడేళ్ల కిత్రం రాజీవ్‌ ఆవాస యోజన పథకం (ఆర్‌ఏవై) కింద వరంగల్‌ నగరం ఎంపికైంది. మురికివాడల అభివృద్ధి కోసం అప్పటి యూపీఏ ప్రభుత్వం నుంచి రూ.45కోట్లు   మంజూరయ్యాయి. కానీ అవి ఖర్చు కాలేదు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ పథకం పేరు మార్చింది. పట్టణాల అభివృద్ధికి కేంద్రం కొత్త పథకాలను ప్రవేశపెడుతోంది. కానీ నగరంలోని మురికివాడలు మాత్రం అభివృద్ధి చెందడం లేదు. వరంగల్‌ను స్మార్ట్‌సిటీగా ప్రకటించినా ఈ పథకం ఫలాలు గుడిసెవాసుల దరిచేరలేదు. లోతట్టు ప్రాంతాల్లో కొత్తకాలనీలు వెలుస్తున్నాయి. దీనివల్ల మురికివాడల సంఖ్య పెరుగుతోంది. వీటిలో కార్మికులు, దినసరి కూలీలు, మధ్యతరగతి ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం మహానగర పాలక సంస్థ మురికివాడల అభివృద్ధి కోసం జనరల్‌ ఫండ్స్‌ నుంచి 40 శాతం నిధులను ఖర్చుచేస్తున్నట్టు చూపిస్తున్నా వాస్తవానికి ఇది ఆచరణలో కనిపిం చడం లేదు.

Updated Date - 2021-02-24T04:40:31+05:30 IST