వైరస్‌తో చిన్న కంపెనీలు విలవిల

ABN , First Publish Date - 2021-04-23T06:48:35+05:30 IST

కొవిడ్‌ దెబ్బతో చిన్న కంపెనీలు కుదేలవుతున్నాయి. గత ఏడాది కాలంగా ఈ మహమ్మారి దెబ్బకు దేశంలోని 82 శాతం చిన్న కంపెనీల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయని...

వైరస్‌తో చిన్న కంపెనీలు విలవిల

  • తలకిందులైన ఆర్థిక పరిస్థితులు


ముంబై: కొవిడ్‌ దెబ్బతో చిన్న కంపెనీలు కుదేలవుతున్నాయి. గత ఏడాది కాలంగా ఈ మహమ్మారి దెబ్బకు దేశంలోని 82 శాతం చిన్న కంపెనీల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయని డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ సర్వే వెల్లడించింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఏటా రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల మధ్య టర్నోవర్‌ ఉన్న తయారీ, సేవల రంగాలకు చెందిన 250కి పైగా కంపెనీల ఆర్థిక స్థితిగతులను పరిశీలించి ఈ సర్వేను రూపొందించింది. కొవిడ్‌ మళ్లీ కోరలు చాస్తుండటం ఈ కంపెనీలను మరింత భయపెడుతోంది. ఇపుడిప్పుడే కోలుకుంటున్న డిమాండ్‌ ఈ దెబ్బతో మళ్లీ  కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఒకవేళ పరిస్థితులు కుదుటపడినా డిమాండ్‌ మళ్లీ కొవిడ్‌ ముందు స్థాయికి చేరేందుకు ఎంత లేదన్నా ఏడాది సమయం పడుతుందని సర్వేలో పాల్గొన్న 70 శాతం కంపెనీల ప్రధాన అధికారులు చెప్పారు. ప్రభుత్వ సాయంతో పాటు మరిన్ని చర్యలు తీసుకుంటే తప్ప కొవిడ్‌ గండం నుంచి గట్టెక్కలేమని 60 శాతం కంపెనీల పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేశారు. 


తగ్గిన సమస్యలు: లాక్‌డౌన్‌ కారణంగా గత ఏడాది ఏప్రిల్‌లో  95 శాతం చిన్న కంపెనీల కార్యకలాపాలు ఆగిపోయా యి. అయితే ఆగస్టు నాటికి ఇది 70 శాతానికి  తగ్గింది. ఈ ఏడాది ఫిబ్రవరికి వచ్చేసరికి పరిస్థితులు మరింత కుదుటపడి 60 శాతం కంపెనీల పరిస్థితులు సాధారణ స్థాయికి చేరాయి. అయినా ఇప్పటికీ అనేక చిన్న కంపెనీలు నిధుల లేమి, తమ ఉత్పత్తులకు సరైన మార్కెట్‌ లేక ఉత్పాదక సామర్ధ్యం పెంచుకోలేకపోతున్నట్టు డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌  తెలిపింది. 

Updated Date - 2021-04-23T06:48:35+05:30 IST