గోరంత సాయం.. కొండంత ప్రచారం!

ABN , First Publish Date - 2021-06-04T04:54:10+05:30 IST

వైసీపీ ప్రభుత్వం గొప్పలకుపోతోంది. రెండేళ్ల పాలనలో ఎంతో చేశామని ఊదరగొడుతోంది. ఎంతోమంది ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందారంటూ సీఎం సంతకాలతో కూడిన కరపత్రాలను పంచుతోంది. ఈ అత్యుత్సాహం ఓ మహిళకు తలనొప్పి తెచ్చిపెట్టింది. గోరంత సాయం చేసి కొండత చేసినట్లు ప్రభుత్వం చెప్పడమే దీనికి కారణం. మీకు రూ.లక్షల్లో సాయం అందిందా? అంటూ గ్రామస్థులు గుచ్చిగుచ్చి అడుగుతుండడంతో ఆ మహిళ తీవ్ర ఆవేదన చెందుతోంది.

గోరంత సాయం.. కొండంత ప్రచారం!

 ప్రభుత్వం ద్వారా ఓ మహిళకు రూ.11 లక్షలు అందించామంటూ కరపత్రం

 అంత లబ్ధి చేకూరలేదన్న బాధితురాలు

 అధికారుల తీరుపై విమర్శలు

(జి.సిగడాం)

వైసీపీ ప్రభుత్వం గొప్పలకుపోతోంది. రెండేళ్ల పాలనలో ఎంతో చేశామని ఊదరగొడుతోంది. ఎంతోమంది ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందారంటూ సీఎం సంతకాలతో కూడిన కరపత్రాలను పంచుతోంది. ఈ అత్యుత్సాహం ఓ మహిళకు తలనొప్పి తెచ్చిపెట్టింది. గోరంత సాయం చేసి కొండత చేసినట్లు ప్రభుత్వం చెప్పడమే దీనికి కారణం. మీకు రూ.లక్షల్లో సాయం అందిందా? అంటూ గ్రామస్థులు గుచ్చిగుచ్చి అడుగుతుండడంతో ఆ మహిళ తీవ్ర ఆవేదన చెందుతోంది. వివరాల్లోకి వెళ్తే.. వైసీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా జి.సిగడాం మండలం వాండ్రంగి గ్రామానికి చెందిన కంది ఆదిలక్ష్మి అనే మహిళకు సీఎం సంతకం చేసిన ఓ కరపత్రాన్ని అధికారులు అందించారు. మీరు ప్రభుత్వం నుంచి మొత్తం 11,01,426 రూపాయలు లబ్ధిపొందారంటూ ఆ కరపత్రంలో ముద్రించి ఆమెకు అభినందనలు తెలిపారు. ‘వైఎస్‌ఆర్‌ ఆసరా ద్వారా రూ.9,198, రైతు భరోసా ద్వారా రూ.34,500, సున్నావడ్డీ పంట రుణాలు రూ.1,407, పింఛన్‌కానుక రూ53,750, డ్వాక్రా సున్నా వడ్డీ రూ.1,394, వైఎస్‌ఆర్‌ ఆసరా రూ.1,177, ఇంటి స్థలం, కాలనీలోని మౌలిక వసతులతో పాటు పూర్తయిన ఇంటి విలువ దాదాపు రూ.10లక్షలు... మొత్తం రూ.11,01,426 లక్షలు లబ్ధిపొందారు’ అని ఆ కరపత్రం ద్వారా వెల్లడించారు. దీంతో గ్రామస్థులు ప్రభుత్వ సాయంపై ఆదిలక్ష్మిని పదేపదే ప్రశ్నిస్తున్నారు. అసలు తనకు అంత సాయం అందలేదన్నా చుట్టుపక్కల వారు నమ్మకపోవడం ఆమెను కలచివేస్తోంది. తప్పుడు కరపత్రాలు అందించిన అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


 రూ.11లక్షలు అందిన మాట అవాస్తవం

మాది సామాన్య కుటుంబం. నాకు ఇద్దరు కుమారులు. కూలి చేసుకొని జీవనం సాగిస్తున్నాం. మా కుటుంబానికి రూ.11 లక్షలు అందిన మాట అవాస్తవం. నవంబరులో రూ.19వేలు మాత్రమే బ్యాంకు ఖాతాలో పడ్డాయి. జనవరి ఒకటో తేదీన విత్‌డ్రా చేశాను. అంతే తప్ప.. ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందలేదు. పూర్వీకులు ఇచ్చిన జిరాయితీ స్థలంలో ఇద్దరు కుమారుల రెక్కల కష్టంతో పాటు అప్పుచేసి ఇంటిని సొంతంగా నిర్మించుకుంటున్నాం. చేయని సాయాన్ని కూడా చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం తగదు.

- కంది ఆదిలక్ష్మి, బాధితురాలు, వాండ్రంగి గ్రామం

 

అంతా పుకారే..

మా కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.11 లక్షలు వచ్చాయని గ్రామస్థులు గుచ్చిగుచ్చి అడుగుతున్నారు. అదంతా పుకారే. అంత పెద్ద మొత్తంలో వస్తే మా కుటుంబ కష్టాలు గట్టేక్కేవి.  కూలి చేసి  సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటున్నాం. సచివాలయ సిబ్బంది తప్పుడు సమాచారంతో  ఇలా జరిగి ఉంటుంది. 

-కంది రాంబాబు(ఆదిలక్ష్మి కుమారుడు)


ఇంటి స్థలం ఇచ్చాం

ప్రభుత్వం ద్వారా ఆదిలక్ష్మికి ఒక సెంటు పావు ఇంటి స్థలం ఇచ్చాం. మేమే ఇల్లు నిర్మిస్తామంటే వారు వద్దని కట్టుకుంటామని చెప్పారు. ఇంటి విలువ రూ.5 లక్షలు. దీని నిర్మాణానికి మూడు విడతలుగా నగదు చెల్లిస్తాం. ఆదిలక్ష్మికి ఏఏ లబ్ధి చేకూరిందో ఆ వివరాలన్నీ పంచాయతీ కార్యాలయంలో ఉంటాయి.

-ఐ.రమణమూర్తి, ఎంపీడీవో, జి.సిగడాం

Updated Date - 2021-06-04T04:54:10+05:30 IST