చిన్న పరిశ్రమ చిక్కిపోయే..

ABN , First Publish Date - 2022-06-28T06:49:15+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీల (ఎంఎ్‌సఎంఈ)ను బాగానే దెబ్బతీసింది.

చిన్న పరిశ్రమ చిక్కిపోయే..

భారీగా దెబ్బకొట్టిన కొవిడ్‌: క్రిసిల్‌  

ఎంఎ్‌సఎంఈల మార్కెట్‌ వాటా  బడా కంపెనీల చేతికి 


ముంబై: కొవిడ్‌ మహమ్మారి దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీల (ఎంఎ్‌సఎంఈ)ను బాగానే దెబ్బతీసింది. ఈ సమయంలో ఈ సంస్థల ఉత్పత్తి ఖర్చులు 60 శాతం పెరిగిపోయాయి. లాభాలకూ గండి పడింది. దీంతో నాలుగో వంతు ఎంఎ్‌సఎంఈలు తమ మార్కెట్‌ వాటాలో మూడు శాతం లేదా అంతకంటే ఎక్కువ భాగాన్ని కొవిడ్‌ సమయంలో బడా కార్పొరేట్‌ కంపెనీలకు కోల్పోయాయి. దేశీయ పరపతి రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ ఒక నివేదికలో ఈ విషయం పేర్కొంది. పెద్ద ఎత్తున ఉత్పత్తి సామర్ధ్యం ఉండడం, చౌకగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ముడి పదార్ధాలు దిగుమతి చేసుకునే సామర్ధ్యం వంటి అంశా లు ఈ విషయంలో పెద్ద కంపెనీలకు కలిసొచ్చాయని క్రిసిల్‌ డైరెక్టర్‌ పుషాన్‌ శర్మ చెప్పారు.


సరఫరా అంతరాయాలు

సరఫరాల అవాంతరాలూ కొవిడ్‌ సమయంలో పురుగుమందులు, వంట నూనెల తయారీ రంగంలో ఉన్న ఎంఎ్‌సఎంఈలను బాగా దెబ్బతీశాయి. దీంతో ఈ సంస్థల లాభాలకూ ఒకటి నుంచి రెండు శాతం వరకు గండి పడింది. ఫార్మా, వ్యవసాయ రంగాలకు చెందిన ఎంఎ్‌సఎంఈలూ కొవిడ్‌ కారణంగా భారీగానే దెబ్బతిన్నట్టు క్రిసిల్‌ నివేదిక తెలిపింది. కొవిడ్‌ ముప్పు తొలగిపోవడంతో ఈ సంవత్సరం ఎంఎ్‌సఎంఈల ఆదాయాలు, లాభాలు మళ్లీ కొవిడ్‌ ముందు స్థాయికి చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. 


ఈ-కామర్స్‌తో లాభాలు

ఈ-కామర్స్‌ ద్వారా ఎంఎ్‌సఎంఈల లాభాలు మరింత పెరుగుతాయని ఎంఎ్‌సఎంఈల శాఖ సహాయ మంత్రి భాను ప్రతాప్‌ సింగ్‌ వర్మ చెప్పారు. ఈ-కామర్స్‌తో మార్కెటింగ్‌ ఖర్చులు తగ్గడంతో పాటు మరింత మంది ఖాతాదారులకు చేరువ కావచ్చన్నారు. ఉపాధి అవకాశాలతో పాటు దేశ తయారీ రంగ విస్తరణలో ఎంఎ్‌సఎంఈలది కీలక పాత్ర అన్నారు.


10 రోజుల్లో క్లెయిమ్స్‌ పరిష్కారం 

ఎంఎ్‌సఎంఈల క్లెయిమ్‌లను త్వరగా పరిష్కరించేందుకు ఐసీఐసీఐ లొంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ముందుకొచ్చింది. రూ.5 లక్షల వరకు ఉండే ఈ సంస్థల ప్రాపర్టీ, మెరైన్‌ క్లెయిమ్‌లను పది రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపింది.


పరపతి కష్టాలు  

జీడీపీలో 25 శాతం వాటా ఉన్నా.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు పొందడం ఎంఎ్‌సఎంఈలకు ఇప్పటికే కష్టంగానే ఉంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ ఎంఎ్‌సఎంఈల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి బీబీ స్వెయిన్‌ చెప్పారు. సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో ఆయన ఈ విషయం తెలిపారు. అత్యవసర పరపతి హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్‌) కింద కేటాయించిన రూ.3.47 లక్షల కోట్ల రుణాల్లో రూ.2.31 లక్షల కోట్లు ఎంఎ్‌సఎంఈలకు కేటాయించినట్టు తెలిపారు.

Updated Date - 2022-06-28T06:49:15+05:30 IST