Viral Video: రద్దీ రోడ్డుపై ల్యాండై.. కాలిబూడిదైన విమానం

ABN , First Publish Date - 2022-08-13T21:49:50+05:30 IST

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా(south California)లో రద్దీ రోడ్డుపై ఓ చిన్న విమానం కుప్పకూలింది. ఆ వెంటనే

Viral Video: రద్దీ రోడ్డుపై ల్యాండై.. కాలిబూడిదైన విమానం

కాలిఫోర్నియా: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా(south California)లో రద్దీ రోడ్డుపై ఓ చిన్న విమానం కుప్పకూలింది. ఆ వెంటనే మంటలు అంటుకుని కాలిబూడిదైంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తమ ముందే విమానం కుప్పకూలడం చూసిన వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. ‘ఏబీసీ న్యూస్’ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విమానం క్రాష్ ల్యాండింగ్ వీడియోను షేర్ చేసింది. విమానం కూలుతున్న సమయంలో ముందు మూడు వాహనాలు వెళ్తుండగా వెనక మరికొన్ని ఉన్నాయి. అదృష్టవశాత్తు మధ్యలో ఉన్న స్థలంలో విమానం కూలడంతో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై విమానం పడిన వెంటనే పక్కకు దూసుకుపోయింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

 

మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో కొరోనాలోని లింక్లన్ అవెన్యూలో ఈ ఘటన జరిగింది. ఆ చిన్న విమానంలో ఉన్న ఇద్దరు సురక్షితంగా తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కొరోనా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ఇద్దరు సురక్షితంగా తప్పించుకున్నారని, మరెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అగ్నిమాపక అధికారులు ఓ ఫేస్‌బుక్ పోస్టులో తెలిపారు. 


సమీపంలోని కొరోనా మునిసిపల్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయినట్టు పైలట్ ఆండ్రూ చో తెలిపారు. తిరిగి విమానాశ్రయానికి వెళ్తున్న సమయంలో విమానంలో ఒక్కసారిగా పవర్ ఆగిపోయిందని పేర్కొన్నారు. దీంతో హైవే పై ల్యాండింగ్ కోసం వెతికానన్నారు. వాహనాలతో రోడ్డు రద్దీగా ఉండడంతో వాటిని ఎక్కడ ఢీకొడతానోనన్న భయం వేసిందని, అయితే, వాహనాలకు, వాహనాలకు మధ్య సరిపడా గ్యాప్ కనిపించడంతో వెంటనే ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించానని పైలట్ ఆండ్రూ వివరించారు. 



Updated Date - 2022-08-13T21:49:50+05:30 IST