చిన్నారులకు ముప్పు

ABN , First Publish Date - 2021-01-13T06:08:12+05:30 IST

వెంకటరమణ కాలనీకి చెందిన రమణ, జయంతి దంపతుల పాపకు ఆరేళ్ళు.

చిన్నారులకు ముప్పు

  1. చిన్నారుల భవితకు స్మార్ట్‌ ముప్పు
  2. వ్యసనంగా మారిన మొబైల్స్‌ గేమ్స్‌
  3. ఫోన్‌ ఇస్తేగానే అన్నం తినడం లేదు
  4. ఎక్కువగా చూస్తే కంటి జబ్బులు
  5. బుద్ధి మాంద్యం.. విపరీత పోకడలు
  6. తల్లిదండ్రులను హెచ్చరిస్తున్న నిపుణులు



కర్నూలు, జనవరి 7(ఆంధ్రజ్యోతి): 

 వెంకటరమణ కాలనీకి చెందిన రమణ, జయంతి దంపతుల పాపకు ఆరేళ్ళు.  మధ్య తరగతి కుటుంబం కావడంతో ఇద్దరూ పనికి వెళ్లక తప్పని పరిస్థితి. పాపను ఇంట్లో వదిలేసి వెళ్ళాల్సి రావడంతో పాపకు ఫోన్‌లో గేములు ఆడటం అలవాటు చేశారు. అలవాటు చేసేముందు వారికి తెలియరాలేదు.. ముందు ముందు ఇది వారిని ఇబ్బందుల పాల్జేస్తుందని. ఆన్‌లైన్‌ గేములు ఆడటం అలవాటైన పాప ఇపుడు ఎవరెన్ని చెప్పినా ఫోన్‌ను వదలడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


  నగరానికి చెందిన కిషోర్‌, విద్య దంపతులు ఇద్దరూ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. పిల్లలకు కార్టూన్లు అంటే ఇష్టమని వారి బాబుకు ఫోన్‌లో అలాంటి వీడియోలు చూపెట్టడం మొదలు పెట్టారు. అల్లరి చేయకుండా పొద్దస్తమానం ఫోన్‌కి అంకితమై పోవడం వల్ల తల్లిదండ్రులకు బాగానే అనిపించింది. కొంత కాలానికి పిల్లాడికి దృష్టి లోపం ఉందేమోనన్న అనుమానం వచ్చి వైద్యుడిని సంప్రదించారు. ఎక్కువ సేపు ఫోన్‌ చూస్తే నరాలు దెబ్బతిని కంటి చూపు పోయే ప్రమాదముందని, అదృష్టం కొద్దీ ఇంకా అలా జరగలేదని వైద్యుడు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. 


చాలా ఇళ్లలో ఇలాంటి సంఘటనలు జరుగున్నాయి. కరోనా సమయంలో చిన్న పిల్లలు మొదలుకొని, పీజీ విద్యార్థుల వరకు ఆన్‌లైన్‌ తరగతులకు అటెండ్‌ అయ్యారు. ఈ కారణంగా అప్పటి వరకూ సెల్‌ఫోన్లకు దూరంగా ఉన్న పిల్లలు సైతం స్మార్ట్‌ ఫోన్లకు అలవాటు పడ్డారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా వారి చేతికి ఫోన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్‌లైన్‌ తరగతులు పూర్తి అయిన తర్వాత కూడా పిల్లలు సెల్‌ఫోన్లను వదలడం లేదు. రకాల ఆన్‌లైన్‌ ఆటలు ఆడుతూ అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రధానంగా కంటి సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. ఆన్‌లైన ఆటలు ఆడుతూ సక్రమంగా తిండి తినడం లేదు. కొందరు అధికంగా తింటున్నారు. ఈ కారణంగా కొందరిలో పోషక సమస్యలు, మరికొందరిలో అధిక బరువు సమస్య తలెత్తుతోంది. ఆటల మోజులో పడి మూత్ర విసర్జన సరిగా చేయడంలేదు. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది ఇలా కొనసాగితే చిన్నారుల భవిష్యత్తుకు ప్రమాదమని, ఆదిలోనే సెల్‌ఫోన్‌ వ్యసనం నుంచి పిల్లలను బయటపడేసే మార్గాన్ని తల్లిదండ్రులు వెతకాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.


అన్నం తినాలంటే..

ఒకపుడు పిల్లలకు అన్నం తినిపించాలంటే తల్లిదండ్రులు ఆరబయటకు తీసుకువెళ్ళడం,  చందమామను చూపించడం వంటివి చేసేవారు. కానీ కాలం మారింది. ఆరుబయళ్ళు లేవు. ఆకాశాన్ని చూపించే తీరికా లేదు. ఇది పిల్లల పెంపకం మీద  ప్రత్యక్షంగా ప్రభావం చూపుతోంది. పిల్లలు మారాం చేస్తుంటే ఓపికగా తినిపించే సమయం ఎవరికీ లేదు. తింటే చాలు అనుకుని తల్లిదండ్రులు పిల్లల చేతిలో సెల్‌ఫోన్‌ పెడుతున్నారు. వాటికి అలవాటైన పసి పిల్లలు బొమ్మలు చూపితే గానీ అన్నం తినము అనే స్థాయికి చేరుకున్నారు. 



పట్టించుకోకపోతే అంతే..

కరోనా విపత్తు కారణంగా ఈ ఏడాది విద్యార్థులు బడికి వెళ్లే అవకాశం లేకుండా చేసింది.  విద్యా సంవత్సరంలో ఎక్కువశాతం ఆన్‌లైన్‌ తరగతులతోనే గడిచిపోతోంది. పలు ప్రైవేటు పాఠశాలలు చిన్నారులకు ఆన్‌లైన్‌ పాఠాలు చెబుతున్నాయి. తరగతులు ముగియగానే స్మార్ట్‌ ఫోన్‌ను పక్కన పడేయడం లేదు. గేమ్స్‌, వీడియోస్‌లోకి వెళుతున్నారు. తల్లిదండ్రులకు గమనించే తీరిక ఉండటం లేదు. దీంతో చిన్నారులు ఎక్కువ సమయం సెల్‌ఫోన్లలో గడిపేస్తున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా పిల్లలతో ఎక్కువ సమయం గడపడం లేదు. ఈ కారణంగా పిల్లలు ఎదుగదల దెబ్బతినే ప్రమాదముందని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


వ్యసనంలా మారింది..

కరోనా సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో సరదాకు ఫోన్‌లో ఏదో ఒకటి చూపించే వాళ్ళం. ఆ సరదా ఇప్పుడు వ్యసనంలా మారింది. ఇపుడు ఫోన్‌ వదలమన్నా పిల్లలు వదలడం లేదు. కొన్ని సార్లు సెల్‌ఫోన్‌లో చూసిన వీడియోల్లో చేసిన విధంగా చేస్తున్నారు. దీంతో ఏం చూసి ఏం చేస్తారోనన్న ఆందోళన ఎక్కువవుతోంది. సెల్‌ఫోన్‌ ఇవ్వకపోతే అన్నం కూడా తినడం లేదు. సెల్‌ఫోన్‌ అలవాటు ఎలా మాన్పించాలో అర్థం కావడం లేదు.

- సురేంద్ర, కర్నూలు  



ఆన్‌లైన్‌ క్లాసులకే ఇవ్వండి..

పిల్లలు ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట పొద్దస్తమానం సెల్‌ఫోన్‌ పట్టుకుంటుంటే తల్లిదండ్రులు వారిని ఓ కంట కనిపెట్టాలి. ఎక్కువ సమయం ఆన్‌లైన్‌ క్లాసులు చెప్పడం లేదు. ఆన్‌లైన్‌ క్లాసులు ఉన్నపుడే పిల్లలకు ఫోన్‌ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్‌ఫోన్‌కు అలవాటు పడితే పాఠశాలలు తెరిచిన తరువాత పాఠాలపై శ్రద్ధ పెట్టలేరు. తల్లిదండ్రులు కొంచెం ముందు చూపుతో వ్యవహరిస్తే మంచిది.

- దాస్‌, ఉపాధ్యాయుడు, షరీన్‌ నగర్‌ 



పిల్లలతో ఆటలాడండి..

ఇదివరలో పిల్లలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం కలిగే ఆటలు ఎన్నో ఆడేవారు. ఇపుడు పిల్లలకు సెల్‌ఫోన్‌తోనే లోకం. అది ఉంటే చాలు లోకాన్ని మరిచిపోతున్నారు. బిజీ జీవితంలో తల్లిదండ్రులు కూడా పిల్లలు అల్లరి కూడా చేయకుండా ఉంటే చాలని వారి చేతిలో సెల్‌ఫోన్‌, ట్యాబ్‌లను పెడుతున్నారు. సెల్‌ఫోన్‌కు అలావాటు పడిన పిల్లల్లో బుద్ధి మాంద్యం, మానసిక ఒత్తిడి, విపరీత ప్రవర్తనలు వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనికి విరుగుడు ఒక్కటే. తల్లిదండ్రులు వీలైనంత ఎక్కువగా పిల్లలతో సమయం గడపాలి. వారిలో బుద్ధిబలం, శారీరక దారుఢ్యం కలిగించే ఆటలు ఆడించాలి. తద్వారా సెల్‌ఫోన్‌ అలవాటును నెమ్మదిగా మాన్పించవచ్చు.

-  పి లక్ష్మన్న, మానసిక వైద్య నిపుణులు  


Updated Date - 2021-01-13T06:08:12+05:30 IST