స్మార్ట్ ఫోన్స్... వీడియో గేమ్స్... బాల్యం... భవిత బలి!

ABN , First Publish Date - 2022-07-08T21:22:41+05:30 IST

మారుతున్న కాలంలో పెరిగిన మొబైల్ వాడకం పెద్దవారితో పాటు పిల్లలపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. వారి భవిత మొబైల్ పంజారాల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది.

స్మార్ట్ ఫోన్స్... వీడియో గేమ్స్...   బాల్యం... భవిత బలి!

మారుతున్న కాలంలో పెరిగిన మొబైల్ వాడకం పెద్దవారితో పాటు పిల్లలపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. వారి భవిత మొబైల్ పంజారాల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. స్మార్ట్ ఫోన్ అనగానే అందులో రకరకాల వీడియో గేమ్స్ ఆడేందుకు పిల్లలు ఇష్టపడతారు. ఒకరకంగా వారికి ఈ అలవాటును పెద్దలే చేస్తున్నారు. అన్నం తినకుండా మారాం చేసే పసిపిల్లకు చందమామను చూపించే తల్లి స్మార్ట్ ఫోన్ లో వీడియోలను చూపించే అన్నం పెడుతుంది. స్కూలు నుంచి రాగానే టీవీ చూసే చిన్నారి ఇప్పుడు మొబైల్ ఫోనులో వీడియో గేమ్స్ ఆడుకోవడానికే ఇష్టపడుతున్నాడు. 


పిల్లలపై వీటి ప్రభావం...

మొబైల్ వాడకం పెరిగాకా పిల్లల ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తున్నాయి.  చేయాల్సిన పనిపై దృష్టి పెట్టలేకపోవడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలతో పాటు.., నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గే పరిస్థితులుంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ తెర నుంచి వచ్చే బ్లూ కలర్ లైట్ పిల్లల కంటిచూపుపై ప్రభావం చూపుతుంది. తలనొప్పి, నడుం నొప్పి వంటి సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. కొందరు చిన్నతనంలోనే కంటి సమస్యల బారిన పడుతున్నారు. దీంతోపాటు వినికిడి లోపం కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయంటున్నారు వైద్యులు.

 

ప్రాణాలు తీస్తున్న బ్లూవేల్ లాంటి గేమ్స్..

అత్యంత ప్రమాదకరమైన బ్లూవేల్‌ గేమ్‌ కు అలవాటుపడి అమాయక పిల్లల ప్రాణాలు ప్రమాదం బారిన పడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ గేమ్ లో చాలెంజ్ లు చేయాలనే ఉత్సాహంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నవారూ ఉన్నారు. ఈ బ్లూవేల్ చాలెంజ్ గేమ్ విదేశాలలోనే కాకుండా మన భారతదేశంలోనూ పిల్లలకు అలవాటుగా మారింది. బ్లూవేల్‌ గేమ్‌ కారణంగా రష్యాలో 130 మంది, అమెరికాలో ఇద్దరు చనిపోయారు. ఈ పిచ్చిలోనే మహారాష్ట్రలో ఓ విద్యార్థి మరణించాడు. మరో విద్యార్థి ఇంట్లోంచి వెళిపోయాడు. 


తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త..

రోజుకో వీడియో గేమ్ పుట్టుకొచ్చి పిల్లల మెదళ్లను పాడుచేస్తుందంటూ బ్లూవేల్ నిషేదంపై ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఎంత శ్రద్ధ తీసుకున్నా ఇలాంటి ఎన్నో డెత్‌ గేమ్స్‌ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నాయి. పిల్లల భవిష్యత్ ను పాడు చేసే ఇలాంటి ఆన్‌లైన్‌ గేమ్స్ పై పెద్దలు అప్రమత్తంగా ఉండాలి. 


వీడియో గేమ్స్ వల్ల కలిగే అనర్థాలను వాళ్ళకు అర్థం అయ్యే విధంగా చెప్పాలి. అవసరం అయితేనే తప్ప సాధ్యమైనంత వరకు మొబైల్ లో డేటాను వేయకపోవడమే మంచిది. శరీరకంగా శ్రమతో కూడిన ఆటలపై పిల్లల్ని ప్రోత్సహించాలి. చిన్నారులతో సమయం గడుపుతూ.. వారి అభిప్రాయాలను, ఇష్టాలను తెలుసుకోవాలి. అలాగైతేనే పిల్లలతో తల్లిదండ్రుల బంధం బలంగా ఉంటుంది. మొబైల్ తో ఒక గంటకన్నా ఎక్కువ సమయం గడపకుండా పెద్దలే చూడాలి. గేమ్స్ ఆడడం, పాటలు వినడం, సినిమాలు చూస్తున్నప్పుడు పెద్దలు గమనించడం మంచిది. మూడు సంవత్సరాల వయసు కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి సెల్ ఫోన్స్ ని దూరంగా ఉంచడం చాలా వరకు మంచి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2022-07-08T21:22:41+05:30 IST