పొగలు–అద్దాలు... పచ్చి అబద్ధాలు

ABN , First Publish Date - 2020-10-25T05:52:39+05:30 IST

నిప్పులేనిదే పొగ రాదు. బొమ్మ, బొమ్మపై వెలుతురు పడకుంటే అద్దంలో ప్రతిబింబం కనపడదు. నేటి రాజకీయాల్లో, వాణిజ్యాల్లో ఇవి రెండూ జరుగుతున్నాయి...

పొగలు–అద్దాలు... పచ్చి అబద్ధాలు

పరిశోధనాత్మక దృష్టితో విశ్లేషణతో పరిశీలిస్తే గాని కనపడని మోసపూరిత రాజకీయ ప్రతిపాదనలు, ప్రయోగాలను పొగలు–అద్దాలు అంటుంటారు. తీవ్రమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చి తమ ప్రభుత్వంపై పెరిగిన అసంతృప్తిని మరిపించడానికి పుల్వామా ప్రమాదాన్ని జరగనిచ్చి, బాలాకోట్ మెరుపు దాడుల్లో అబద్దాలు, అతిశయోక్తులను ప్రచారం చేయడంతో పాటు నేటి ప్రభుత్వ ప్రణాళికలు, ఉద్దీపన పథకాలు, విధానాలు అన్నీ ఈ కోవకు చెందినవే. పెద్దనోట్ల రద్దు, వస్తుసేవల పన్ను, ముస్లిం మహిళల విడాకులకు సంబంధించిన ముమ్మారు తలాక్‌ను నిషేధించే చట్టం, పౌరసత్వ సవరణ చట్టం, కరోనా కష్టకాల పథకాలు, పారిశ్రామిక చట్టాలు, కొత్త విద్యావిధాన చట్టం, వ్యవసాయ చట్టాలు పొగలు–అద్దాల చట్టాలే.


నిప్పులేనిదే పొగ రాదు. బొమ్మ, బొమ్మపై వెలుతురు పడకుంటే అద్దంలో ప్రతిబింబం కనపడదు. నేటి రాజకీయాల్లో, వాణిజ్యాల్లో ఇవి రెండూ జరుగుతున్నాయి. ‘పొగలు–అద్దాలు’ (smokes and mirrors)అంటే తేలిగ్గా అర్థం కాని మోసం. రాజకీయ గజిబిజిని, వాణిజ్య కుట్రలను వర్ణించడానికి ఈ పదబంధాన్ని వాడుతారు. ఐంద్రజాలికులు భ్రమలు, భ్రాంతుల కల్పనకు వాడే పరికరాలను ఈ పదజాలంతో సూచిస్తారు. 


పొగలు–అద్దాలు బొమ్మల రూపకం. పొగ, అద్దాల మరుగున ఎదుటివారిని భ్రమల్లో ముంచడం. 18, 19 శతాబ్దాల నుంచి అమల్లో ఉన్న అయోమయాల కనికట్టు. తెర వెనుక ఇంద్రజాల లాంతర్లతో ప్రదర్శించే భయంకర చిత్రాల నాటకం. మోసం, భ్రాంతి, అవాస్తవ వర్ణనలు, వివరాలతో, కళేబరాలు, భూతప్రేత పిశాచాల నటనలతో దట్టమైన పొగల మధ్య గోడల మీద చూపే ఇంద్రజాల ప్రదర్శన. శూన్యంలో చేతులు తిప్పి బొమ్మలు చూపిస్తారు. చిన్న వస్తువులు సృష్టిస్తారు. చైనాతో సహా తూర్పు ఆసియా దేశాల్లో ‘అద్దం పూలు–నీటి చంద్రుడు’ అన్న ఇంద్రజాల పద్ధతి అమల్లో ఉంది. ప్రతిబింబాన్ని చూడగలం, తాకలేమని దీని అర్థం. అద్దంలో పువ్వులు, కదలని నీటిలో చంద్ర ప్రతిబింబాలు దీనికి ఉదాహరణలు. పొగలు-–అద్దాల ప్రదర్శన అందంగా కనిపించే అందని కల. నీరున్నట్లు భ్రమింపజేసే ఎండమావి. ఆంగ్ల శాస్త్రజ్ఞుడు జాన్ హెన్రి పెప్పర్ (1821–-1900) పేరుతో పెప్పర్ భూత ప్రదర్శన ఎంతో పేరు పొందింది. 1862లో ఆయన ఈ ప్రదర్శనను విస్తృతంగా ప్రచారం చేశారు. ఇందులో ప్రేక్షకులకు కనిపించకుండా వేదిక కింది నుంచి ప్రకాశవంతంగా వెలుగుతున్న బొమ్మ ప్రదర్శకునికి, వీక్షకులకు మధ్యనున్న అద్దంలో కనిపిస్తుంది. వేదిక ముందర కూర్చున్నవారికి అది భూతంలా కనిపిస్తుంది. 


1975లో తన పుస్తకం ‘దోషారోపణ వేసవి’లో అమెరికా పాత్రికేయుడు జిమ్మీ బ్రెస్లిన్ పొగలు–అద్దాలు పదబంధం సృష్టించారు. తర్వాత అది విస్తృత ప్రచారంలోకి వచ్చింది. ఈ పుస్తకంలో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ (1972–-74) పాల్పడిన వాటర్‌గేట్ కుంభకోణం గురించి వివరించారు. దానిపైని వ్యాఖ్యానమంతా రాజకీయ అధికారం, భ్రమలు, భ్రాంతుల గురించే సాగుతుంది. దీనికి సంబంధించిన ప్రదర్శనలో, మొదట పలుచగా ఉండి రాను రాను దట్టంగా అందమైన నీలి రంగుకు మారి నున్నటి అద్దాల మీదుగా సాగి, వెనక్కు ముందుకు ఎగిసిపడే పురితిప్పిన గడ్డి కట్టల్లా దృశ్య పరంపర ఉంటుంది. దీన్ని ‘నీలి పొగలు–అద్దాలు’ అని పేర్కొంటుంటారు. వాడుకలో అది ‘పొగలు–అద్దాలు’ అయింది. ‘పొగలు–అద్దాలు’ ఇబ్బందికరమైన, చికాకు కలిగించే సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి, దాచిపెట్టడానికి, గందరగోళపరచడానికి అనుసరించే విచిత్ర ప్రక్రియ. నిజం కానిదాన్ని నిజమని నమ్మించడానికి, నిజాన్ని దాచిపెట్టడానికి చేపట్టే కుతంత్రాలను పొగలు–అద్దాలతో పోలుస్తారు. 


1770లో జర్మనీ నగరం లీప్జిగ్‌లో జ్ఞానవంతునిగా నటించిన ఒక లాడ్జి యజమాని జోహాన్ జార్జ్ స్క్రోఫర్ తన వినియోగదారులను ఆకర్షించి, అధిక సంపాదన కోసం శవప్రదర్శనలు, క్షుద్రవిద్యలు ప్రదర్శించేవారు. అమెరికాలో 1803లో న్యూయార్క్ మౌంట్ వర్ణాన్ గార్డెన్‌లో పొగలు -అద్దాల మోసాల ప్రదర్శనలు మొదలయాయి. ఫ్రాన్స్ లోనూ ఇవి వ్యాపించాయి. అమెరికా, ఇంగ్లండ్, చైనాలలో ప్రభుత్వ అతిశయోక్తులను వివరించడం కోసం పత్రికల్లో ఈ పదజాలాన్ని ప్రయోగించారు. 2010–-16 మధ్య బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ఒక సభలో, పేదరికంపై యుద్ధం చేస్తానన్నారు. కానీ, ఆయన ప్రభుత్వం మరో 2 లక్షల మందిని పేదరికంలోకి నెట్టింది. ఈ మాటలు పొగలు– అద్దాలేనని అప్పట్లో పత్రికలు పేర్కొన్నాయి. వాషింగ్టన్ సభామందిరాన్ని పొగలు–అద్దాల మేడ అని అవి వర్ణించాయి.


పరిశోధనాత్మక దృష్టితో, విశ్లేషణతో పరిశీలిస్తే గాని కనపడని మోసపూరిత రాజకీయ ప్రతిపాదనలు, ప్రయోగాలను పొగలు–అద్దాలు అంటుంటారు. తీవ్రమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చి తమ ప్రభుత్వంపై పెరిగిన అసంతృప్తిని మరిపించడానికి పుల్వామా ప్రమాదాన్ని జరగనిచ్చి, బాలాకోట్ మెరుపు దాడుల్లో అబద్దాలు, అతిశయోక్తులను ప్రచారం చేయడంతో పాటు నేటి ప్రభుత్వ ప్రణాళికలు, ఉద్దీపన పథకాలు, విధానాలు అన్నీ ఈ కోవకు చెందినవే. పెద్దనోట్ల రద్దు, వస్తుసేవల పన్ను, ముస్లిం మహిళల విడాకులకు సంబంధించిన ముమ్మారు తలాక్ను నిషేధించే చట్టం, పౌరసత్వ సవరణ చట్టం, కరోనా కష్టకాల పథకాలు, పారిశ్రామిక చట్టాలు, కొత్త విద్యావిధాన చట్టం, వ్యవసాయ చట్టాలు పొగలు–అద్దాల చట్టాలే. వీటన్నిటిలో బులిపించిన ప్రయోజనాలు సంబంధిత వర్గాలకు వాస్తవంగా అందవు. సామాన్య ప్రజల ఇబ్బందులు తొలగవు. భ్రమలతో మెజారిటీ మతస్థుల సమీకరణ, బుజ్జగింపులు, బెదిరింపులు, భయాలతో మైనారిటీల లొంగదీయడం, కార్పొరేట్ల లాభాలు పాలకులు సాగించే పాలనలో అంతర్లీనంగా ఇమిడి ఉన్న అంశాలు. రాజకీయ నేతల ప్రవర్తన ప్రజాప్రయోజనంతో ముడిపడి ఉండదు. ప్రత్యర్థుల శక్తిసామర్థ్యాలను తగ్గించి చూపడానికి, విశ్వసనీయతను కించపరచడానికి రాజకీయ చతురులు పొగలు–అద్దాల పద్ధతిని పాటిస్తుంటారు.


సినిమాల్లో, నమ్మలేని విషయాలను నమ్మేటట్లు అద్భుతంగా చిత్రీకరించడానికి కంప్యూటర్ చిత్రీకరణలను ఆశ్రయిస్తారు. టైటానిక్, బాహుబలి దీనికి ఉదాహరణలు. ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి ప్రపంచస్థాయి రాజధాని అమరావతి నిర్మాణంలో బాహుబలిలో చూపించిన అసాధారాణ దృశ్యాలను వాడుకోవాలనుకున్నారు. ఆ దర్శకుడిని సలహాదారునిగా నియమించుకున్నారు. మార్కెటింగ్ సంస్థలు కూడా ఈ పద్ధతిని పాటిస్తాయి. కంపెనీలు ఒక వైపు దివాళా తీస్తుంటే ఆర్థికంగా చాలా బాగున్నాయంటూ ప్రకటనలు చేస్తాయి. మునుపెన్నడూ లేని విధంగా నేడు ప్రభుత్వం, కార్పొరేట్లు కుమ్మక్కయ్యాయి. 2014 ఎన్నికల ఫలితాలు రాగానే అదానీకి రెండు విద్యుత్తు ఫ్యాక్టరీలను అప్పజెప్పారు. ఆస్ట్రేలియాలో బొగ్గుగనుల కాంట్రాక్టు ఇప్పించారు. భారత ప్రధాన విమానాశ్రయాల నిర్వహణను కట్టబెట్టారు. రాఫెల్ ఒప్పందంలో ప్రభుత్వరంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను తొలగించి ఆనాటికి ఇంకా పుట్టని అనిల్ అంబానీ సంస్థను చేర్చారు. ఇవన్నీ దేశ ప్రగతికేనని బుకాయిస్తారు. ఇతర మతస్థుల హత్యలు, దళితుల అత్యాచార హత్యలు ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలుగా జరుగుతున్నాయి. పరిశోధన, నిఘా విభాగాల దాడుల సందర్భంగా చెప్పేది వేరు, అసలు ఉద్దేశాలు వేరు. కోరేగావ్‌తో సహా జరిగిన ఉగ్రవాద నిరోధక చట్టపు అరెస్టుల్లో కూడా చెప్తున్నది ఒకటి, వాటి వెనుక ఉన్న ఉద్దేశం మరొకటి. పెట్టుబడిదారీ విధాన దోపిడీ అనేక రూపాల్లో, రకరకాల పేర్లతో ఉంటుంది. పోరాట శక్తులన్నీ కలిసి వివిధ కోణాల్లో, వివిధ రంగాల్లో ఈ దోపిడీని ఎదుర్కోవాలి. దేశాన్ని పొగలు-– అద్దాల అబద్దాల నుంచి, ఆపదల నుంచి కాపాడాలి.

సంగిరెడ్డి హనుమంత రెడ్డి

ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి

Updated Date - 2020-10-25T05:52:39+05:30 IST