ప్రధాన మంత్రికి హాని చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నం : స్మృతి ఇరానీ

ABN , First Publish Date - 2022-01-05T23:16:51+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా

ప్రధాన మంత్రికి హాని చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నం : స్మృతి ఇరానీ

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం వెల్లడికావడంతో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, మోదీని కాంగ్రెస్ ద్వేషిస్తుందని అందరికీ తెలుసునన్నారు. భారత దేశ ప్రధాన మంత్రికి హాని చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నించిందని ఆరోపించారు. ఇదిలావుండగా, ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్‌పీని పంజాబ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 


పంజాబ్ శాసన సభకు త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో పాల్గొనవలసిన తొలి బహిరంగ సభ రద్దయింది. ఫిరోజ్‌పూర్‌లో బుధవారం ఈ సభ జరగవలసి ఉండగా, ప్రధాన మంత్రి భద్రత విషయంలో తీవ్ర లోపం ఉందని, అందువల్లే ఈ సభ రద్దయిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. 


కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం భటిండా చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్లో హుస్సేనీవాలాలోని జాతీయ అమరవీరుల స్మారక కేంద్రానికి వెళ్ళవలసి ఉంది. వర్షం కురుస్తుండటం, దారి కనిపించకపోవడం వల్ల ఆయన దాదాపు 20 నిమిషాలపాటు వేచి చూశారు. వాతావరణం సానుకూలంగా మారకపోవడంతో, రోడ్డు మార్గంలో ప్రయాణించి, అమరవీరుల స్మారక కేంద్రానికి చేరుకోవాలని నిర్ణయించారు. రోడ్డు మార్గంలో వెళ్తే రెండు గంటలకు పైగా సమయం అవసరమవుతుంది. పంజాబ్ డీజీపీ నుంచి భద్రతా సంబంధిత ధ్రువీకరణ పొందిన తర్వాత రోడ్డు మార్గంలో ప్రయాణం ప్రారంభించారు. అయితే జాతీయ అమరవీరుల స్మారక కేంద్రానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో, ఫ్లైఓవర్ వద్దకు మోదీ కాన్వాయ్ చేరుకునేసరికి, కొందరు నిరసనకారులు ఆ రోడ్డును దిగ్బంధనం చేసినట్లు తెలిసింది. ఆ ఫ్లైఓవర్‌పై మోదీ దాదాపు 20 నిమిషాలపాటు చిక్కుకున్నారు. ఇది ప్రధాన మంత్రి భద్రత విషయంలో అత్యంత ప్రధాన లోపం. 


ఈ లోపానికి కారణం పంజాబ్ ప్రభుత్వమేనని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ప్రధాన మంత్రి పర్యటన వివరాలను ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశామని, రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయవలసి ఉందని తెలిపింది. ఈ భద్రతా లోపం కనిపించడంతో తిరిగి భటిండా విమానాశ్రయానికి వెళ్ళిపోవాలని నిర్ణయించినట్లు పేర్కొంది. రోడ్డు మార్గంలో అదనపు భద్రతను ఏర్పాటు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, కానీ ఆ విధంగా చేయలేదని పేర్కొంది. దీనికి కారణాలను, బాధ్యులను నిర్థరించడం కోసం ఓ నివేదికను సమర్పించాలని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపింది. ఇదిలావుండగా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పోస్టులనుబట్టి ఈ మార్గంలో నిరసన తెలుపుతున్నవారు రైతులు అని తెలుస్తోంది. 


ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీ విలేకర్ల సమావేశంలో బుధవారం మాట్లాడారు. ప్రధాని మోదీని కాంగ్రెస్ ద్వేషిస్తుందనే విషయం అందరికీ తెలుసునన్నారు. నేడు ఆ పార్టీ భారత దేశ ప్రధాన మంత్రికి హాని చేసే ప్రయత్నం చేసిందన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిసియుండి ప్రధాన మంత్రిని అపాయంలోనికి నెట్టే పరిస్థితిని సృష్టించిందని ఆరోపించారు. 


మోదీ ప్రయాణించే మార్గంలోకి నిరసనకారులు వచ్చిన సమయం గురించి గట్టిగా ప్రశ్నించారు. అనేక మంది ప్రజలు అక్కడికి చేరుకోవడం యాధృచ్ఛికం కాదన్నారు. ఇది స్పష్టంగా కుట్ర అని తెలిపారు. భద్రతా లోపానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. పంజాబ్ పోలీసులు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారని, భద్రతా సంబంధిత మార్గదర్శకాలను పాటించలేదని అన్నారు. 


Updated Date - 2022-01-05T23:16:51+05:30 IST