చివరకు 'స్నాప్‌చాట్' కూడా ట్రంప్‌ను వదిలిపెట్టలేదు..

ABN , First Publish Date - 2021-01-14T20:51:14+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సోషల్ మీడియా సైట్స్, యాప్స్ ఒక్కొక్కటి షాకిస్తున్నాయి.

చివరకు 'స్నాప్‌చాట్' కూడా ట్రంప్‌ను వదిలిపెట్టలేదు..

శాన్ ఫ్రాన్సిస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సోషల్ మీడియా సైట్స్, యాప్స్ ఒక్కొక్కటి షాకిస్తున్నాయి. ఈ జాబితాలో తాజాగా స్నాప్‌చాప్ కూడా చేరింది. ట్రంప్ ఖాతాను శాశ్వతంగా బ్యాన్ చేసినట్లు బుధవారం స్నాప్‌చాప్ ప్రకటించింది. దేశ రాజధాని వాషింగ్టన్‌లోని కేపిటల్ భవనంపై దాడి ఘటన నేపథ్యంలోనే ఈ చర్యకు ఉపక్రమించినట్లు స్పష్టం చేసింది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ తన స్నాప్‌చాట్ ఖాతా ద్వారా అశాంతిని రేకెత్తించే అవకాశం ఉన్నందున ఆపరేటర్లు భయపడుతున్నారని, అందుకే ఆయన ఖాతాను శాశ్వతంగా బ్యాన్ చేసినట్లు స్నాప్‌చాట్ చెప్పుకొచ్చింది. అంతేగాక ఇప్పటికే ట్విటర్, ఫేస్‌బుక్, యూట్యూబ్ తదితర ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజాలు కూడా ట్రంప్ ఖాతాలను బ్యాన్ చేశాయి. ఇక మిగిలింది స్నాప్‌చాట్ ఖాతానే కావడంతో దీని ద్వారా ట్రంప్ పోస్టులు చేసే అవకాశం ఉందని భావించిన యాప్ నిర్వాహకులు ముందు జాగ్రత్త చర్యగా ఆయన ఖాతాను తొలగించినట్లు సమాచారం.


ఇదిలాఉంటే.. టెక్సాస్ అటార్నీ జనరల్ కెన్ ప్యాక్స్టన్ సోషల్ మీడియా సైట్స్, యాప్స్ చర్యను తప్పుబట్టారు. అమెజాన్, యాపిల్, ఫేస్‌బుక్, గూగుల్, ట్విటర్ తమ ప్లాట్‌ఫామ్‌లపై ట్రంప్‌ను ఎందుకు నిషేధించాయో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా సైట్స్ ట్రంప్‌పై కక్షపూరితంగానే ఇలా వ్యవహరించాయని దుయ్యబట్టారు. అవన్నీ కుమ్మక్కై అకారణంగా ట్రంప్‌ ఖాతాలను తొలగించాయని ఆయన ఆరోపించారు. 


కాగా, కేపిటల్ భవనంపై దాడి ఘటన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆయన అధ్యక్ష పదివి చివరి రోజుల్లో మాయనిమచ్చను తెచ్చిపెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఘటన తర్వాత ట్రంప్‌పై వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. జనవరి 6న జో బైడెన్ విజయాన్ని ధృవీకరిస్తూ కేపిటల్ భవనంలో భేటీ అయిన యూఎస్ కాంగ్రెస్ సభలోకి దూసుకెళ్లిన ట్రంప్ మద్దతుదారులు బీభత్సం సృష్టించారు. ఈ ఘర్షణల్లో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘర్షణలకు పరోక్షంగా అధ్యక్షుడు ట్రంపే కారణమని డెమొక్రాట్లు ఆరోపించారు. అటు సొంతపార్టీ రిపబ్లికన్లలో కూడా కొంతమంది ట్రంప్ చర్యను తప్పుబట్టారు. ఈ క్రమంలో ట్రంప్ వెంటనే అధ్యక్షపీఠం నుంచి దిగిపోవాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో ట్రంప్ రెండోసారి అభిశంసనను ఎదుర్కొవాల్సి వచ్చింది. బుధవారం యూఎస్ ప్రతినిధుల సభ ట్రంప్ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ జరపగా 232-197 తేడాతో ఈ తీర్మానం ఆమోదం పొందింది. దీంతో అమెరికా చరిత్రలోనే రెండోసారి అభిశంసనం ఎదుర్కొన్న అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. ఈ తీర్మానాన్ని సెనేట్‌కు పంపిస్తారు. అక్కడ కూడా ఆమోదం పొందితే ట్రంప్ అధ్యక్షుడిగా దిగిపోవాల్సి ఉంటుంది. అయితే, సెనేట్‌ ఈ నెల 19 వరకు వాయిదా పడింది. కనుక బైడెన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం దీనిపై చర్చ జరగనుంది. ఏదేమైనప్పటికీ మొదటి నుంచి ట్రంపరితనంతో వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ట్రంప్.. కేపిటల్ భవనం దాడి ఘటనతో రెండోసారి అభిశంసనపాలై మరో అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. 


Updated Date - 2021-01-14T20:51:14+05:30 IST