‘సంకల్ప’ బలంతో స్నేహయాత్ర

ABN , First Publish Date - 2022-07-05T06:57:10+05:30 IST

విజయ సంకల్ప సభ ఇచ్చిన స్ఫూర్తితో బీజేపీ స్నేహయాత్రకు నడుం బిగిస్తోంది.

‘సంకల్ప’ బలంతో స్నేహయాత్ర

- బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం

- ప్రభావిత వర్గాలపై దృష్టి

- ఉద్యమకారులతో మమేకం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

విజయ సంకల్ప సభ ఇచ్చిన స్ఫూర్తితో బీజేపీ స్నేహయాత్రకు నడుం బిగిస్తోంది. ఊహించినదానికంటే సభ విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో, నాయకుల్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తుతూ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ఆశలు పెంచుతున్నది. వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని కలలుకంటున్న ఆ పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు స్నేహయాత్రను నిర్వహించాలని భావిస్తున్నది. 

13 నియోజకవర్గాలపై దృష్టి

ఉమ్మడి జిల్లా పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముక్కోణపు పోటీ జరిగినా మూడో వంతుకు మించి స్థానాలను కైవసం చేసుకుంటాం అని చెబుతున్న ఆ పార్టీ నేతలు ఇప్పుడు మరిన్ని నియోజకవర్గాలపై దృష్టి సారించాలని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని హుజూరాబాద్‌ నియోజకవర్గానికి బీజేపీకి చెందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు మిగతా స్థానాల్లో మూడు ఎస్సీ స్థానాలు తమవే అన్న ధీమాతో బీజేపీ నాయకత్వం ఉన్నది. వివిధ పార్టీలకు చెందిన నాయకులను బీజేపీలో చేర్చుకోవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలు, సాధిస్తున్న ఫలితాలను వివరిస్తూ, భావజాలవ్యాప్తిని చేయాలని జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయించారు. తటస్థులు, తెలంగాణ ఉద్యమకారులు, సామాజిక ఉద్యమకారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఇతర వర్గాల వారిని కలిసి పార్టీపై సానుకూలతను పెంచడంతోపాటు పార్టీలో చేర్చుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని అగ్రనాయకత్వం నిర్ణయించింది. 

బూత్‌ స్థాయి నుంచి బలపడేందుకు ప్రణాళికలు

హైదరాబాద్‌లో జరిగిన విజయ సంకల్ప సభకు ఉమ్మడి జిల్లా పరిధి నుంచి 25 వేల మంది తరలివెళ్లారు. రెండు రైళ్లు, ఆయా జిల్లాల పరిధిలోని అన్ని పాఠశాలల బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో పార్టీ, అనుబంధ సంస్థలు, బీజేపీ భావజాలాన్ని సమర్థిస్తూ హిందుత్వ నినాదంతో పనిచేస్తున్న వివిధ సంస్థల ప్రతినిధులు విజయ సంకల్ప సభకు తరలివెళ్లారు. సంకల్ప సభ ద్వారా పొందిన స్ఫూర్తితో వారిప్పుడు నియోజకవర్గాలకు వచ్చి బూత్‌స్థాయిల్లో స్నేహయాత్రలను నిర్వహించి పార్టీ బలం, బలగాన్ని పెంచడానికి కృషి చేసేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు.  జూన్‌ 30 నుంచి జూలై 2వ తేదీ వరకు కరీంనగర్‌ నియోజకవర్గంలో ఉత్తరప్రదేశ్‌ జలశక్తి మంత్రి, ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిన స్వతంత్రదేవ్‌సింగ్‌, చొప్పదండిలో కేంద్ర సోషల్‌ జస్టిస్‌ ఎంపవర్‌మెంట్‌ మినిస్టర్‌ వీరేంద్రకుమార్‌ ఖాతిక్‌, హుజూరాబాద్‌లో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే, మానకొండూర్‌లో జయంత్‌కుమార్‌రాయ్‌ (జల్ఫాయ్‌గురి ఎంపీ), హుస్నాబాద్‌లో దేవశ్రీ చౌదరి (రాయ్‌గుంజ్‌ ఎంపీ) పర్యటించారు. బూత్‌స్థాయిల్లోని కమిటీలతో  మండల, నియోజకవర్గ స్థాయి కమిటీలతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, పార్టీని పటిష్టపర్చడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ బలం, బలహీనతలు, కేంద్ర పథకాల ప్రచారతీరు ఎలా ఉంది అన్న వివరాలు అడిగి తెలుసుకొని క్షేత్రస్థాయి నాయకులను ఆయా అంశాలపై చైతన్యవంతులను చేశారు.  వారందరిని విజయ సంకల్ప సభకు హాజరయ్యేలా ప్రేరణ కల్పించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ రాష్ట్ర శాఖల అధ్యక్షులు పర్యటించి అంతటా పార్టీ శ్రేణులకు స్ఫూర్తి కలిగించారు. రెండు రోజులపాటు నియోజకవర్గంలోనే ఉంటూ వారు చేపట్టిన చర్యలు కూడా పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున విజయ సంకల్ప సభకు వెళ్లేందుకు దోహదపడ్డాయి. విజయ సంకల్ప సభకు వెళ్లిన పార్టీ శ్రేణులు, నాయకులందరు కొత్త ఉత్సాహంతో తమ తమ ప్రాంతాలకు తిరిగివచ్చి రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెబుతూ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు వీరంతా స్నేహయాత్రకు సన్నద్ధమవుతున్నారు. పార్టీ నాయకత్వం స్నేహయాత్రకు సంబంధించిన కార్యాచరణను ప్రకటించగానే వారు గ్రామాల్లో దానిని అమలు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, దాని సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభ ఆ పార్టీకి జిల్లాలో సానుకూల వాతావరణాన్నే కలిగించింది. 

Updated Date - 2022-07-05T06:57:10+05:30 IST