నిఘా, ఫోన్ ట్యాపింగ్ గురించి పట్టించుకోనక్కర్లేదు : కుమార స్వామి

ABN , First Publish Date - 2021-07-21T17:34:39+05:30 IST

పెగాసస్ నిఘా వంటి సంఘటనలు కొత్తవేమీ కాదని,

నిఘా, ఫోన్ ట్యాపింగ్ గురించి పట్టించుకోనక్కర్లేదు : కుమార స్వామి

బెంగళూరు : పెగాసస్ నిఘా వంటి సంఘటనలు కొత్తవేమీ కాదని, 10-15 ఏళ్ళ నుంచి ఇటువంటివి జరుగుతున్నాయని జనతా దళ్ (సెక్యులర్) సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమార స్వామి అన్నారు. ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పూర్వం కూడా గూఢచర్యం, ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు తెలిపారు. గతంలో చాలా ప్రభుత్వాలు, ఆదాయపు పన్ను శాఖ సైతం, ప్రజల ఫోన్లను ట్యాప్ చేస్తాయని తనకు తెలుసునని చెప్పారు. 


జాతీయ మీడియా కథనాల ప్రకారం, పెగాసస్ నిఘా ఆరోపణలపై కుమార స్వామి స్పందిస్తూ, ఇటువంటివి కొత్త విషయాలేమీ కాదని, వీటిని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదని అన్నారు. దేశ భద్రత విషయంలో కానీ, కర్ణాటక విషయంలో కానీ తానేమీ తప్పు చేయలేదన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తన వ్యక్తిగత కార్యదర్శి ఫోన్ ట్యాపింగ్ గురించి తాను కలత చెందానన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వీటిని అంత తీవ్రంగా పట్టించుకోనక్కర్లేదన్నారు. 


అధికారం కోసం బీజేపీ ఏ స్థాయికైనా దిగజారుతుందని మండిపడ్డారు. కోవిడ్-19 మహమ్మారి వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు అనుభవిస్తున్నారని, అందువల్ల సామాన్యులపై దృష్టి పెట్టి, వారికి ఉపశమనం కల్పించాలని తాను అందరు నేతలను వ్యక్తిగతంగా కోరుతున్నానని చెప్పారు. 


కుమార స్వామి ఓ జాతీయ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ, ‘‘ఈ దేశంలో, చాలా సంవత్సరాలుగా, ప్రభుత్వాన్ని ఎవరు నడిపినా, ఏ పార్టీవారైనా, అందరూ సమాచార సేకరణ కోసం, లేదంటే, తమ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం, తమ పదవులను దుర్వినియోగం చేస్తున్నారు. ఇది కొనసాగుతోంది. నాకు ఈ విషయాల పట్ల ఆసక్తి లేదు’’ అని చెప్పారు. 


2019లో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం చివరి ఘడియల్లో ఉన్నపుడు పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించి కుమార స్వామి వ్యక్తిగత కార్యదర్శికి చెందిన ఫోన్‌ను హ్యాక్  చేయడానికి ఉద్దేశించిన ఫోన్ నంబర్ల జాబితాలో పెట్టినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా 2019లో కుమార స్వామిపై కూడా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చాయి. అనర్హతకు గురైన జేడీఎస్ ఎమ్మెల్యే ఏహెచ్ విశ్వనాథ్ ఈ ఆరోపణలు చేశారు. తనతోపాటు సుమారు 300 మంది నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారన్నారు. అయితే ఈ ఆరోపణలను కుమార స్వామి ఖండించారు. ఈ ఆరోపణలు సత్య దూరమని చెప్పారు. తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఫోన్లను ట్యాప్ చేయవలసిన అవసరం తనకు లేదన్నారు. ముఖ్యమంత్రి పదవి ఎల్లకాలం ఉండబోదని తాను పదే పదే చెప్తున్నానని గుర్తు చేశారు.


Updated Date - 2021-07-21T17:34:39+05:30 IST