ఎన్నాళ్లీ కష్టాలు!

ABN , First Publish Date - 2022-08-18T04:35:52+05:30 IST

పెద్దేముల్‌ మండలంలో బురదరోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. తమకు ఈ కష్టాలు ఇంకా ఎన్నాళ్ళని ఆవేదన చెందుతున్నారు.

ఎన్నాళ్లీ కష్టాలు!
ఆత్కూర్‌, ఆత్కూర్‌ తండా మద్యలో బురదరోడ్డుపై దిగబడిన లారీ, బస్సు

  •  అధ్వానంగా రహదారులు
  • ఆత్కూర్‌ - ఆత్కూర్‌తండా మధ్యలో దిగబడిన వాహనాలు

పెద్దేముల్‌, ఆగస్టు17 : పెద్దేముల్‌ మండలంలో బురదరోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. తమకు ఈ కష్టాలు ఇంకా ఎన్నాళ్ళని ఆవేదన చెందుతున్నారు. బురదరోడ్డుపై ప్రయాణం చేయలేక ఏళ్ల తరబడి కష్టాలు అనుభవిస్తున్నారు. అయినా అధికారులు పాలకులకు చీమకుట్టినట్లు కూడా అనిపించడం లేదు. పెద్దేముల్‌ మండలంలో ఆత్కూర్‌ నుంచి తట్టెపల్లి, తట్టెపల్లి నుంచి ఆడ్కిచర్లకు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారాయి. కొత్తగా రోడ్డు వేసేందుకు నిధులుమంజూరైనా  పనులు జరగడం లేదు. అన్ని ఉన్నా అల్లుడినోట్లో శని అన్నచందంగా తయారైంది దరిగడ్డ ప్రజల పరిస్థితి. కందనెల్లితండా సమీపం నుంచి తుర్మామిడి వరకు రోడ్డువేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఆత్కూర్‌ వరకు రోడ్డునిర్మాణం జరిగింది. అక్కడి నుంచి రోడ్డు పనులు జరగడం లేదు. రోడ్డువేసేందుకు ఉన్నరోడ్డును తవ్వేసి ఎర్రమట్టి పోశారు. ఏళ్ళు గడుస్తున్నా పనులు ముందుకు సాగడం లేదు. ఎర్రమట్టి వేసి వదిలేయడం వల్ల చిన్నపాటి వర్షాలు వచ్చినా రోడ్డు బురదగా మారి వాహనాల రాకపోకలు సాగడం లేదు. బురదరోడ్డులో వాహనాలు దిగబడిపోతున్నాయి. ద్విచక్ర వాహనదారులైతే అదుపుతప్పి పడిపోతున్నారు.  కొద్ది రోజులుగా కురుసిన వానలతో  రోడ్డుపై వేసిన ఎర్రమట్టి మొత్తం బురదగా మారింది. ఆటోలు, బైకులు అసలు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్కూర్‌, ఆత్కూర్‌తండా మధ్యలో బురదరోడ్డుపై లారీ దిగబడిపోవడంతో ఆటో వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అదే దారిలో వచ్చిన ఒక బస్సు కూడా జారుకుంటూ వెళ్లి రోడ్డుదిగి ఆగిపోయింది. లారీ, బస్సు ఒకేచోట దిగబడడంతో అటుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆత్కూర్‌, ఆత్కూర్‌తండా ప్రజలకు వాహనసౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలు పడ్డ రోడ్లపై ప్రయానం నరకంగా మారింది. 

అవస్థలు పడుతున్న కాలనీవాసులు

కీసరరూరల్‌ : మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా నాగారం మున్సిపల్‌ పరిధిలోని పలు కాలనీల్లో రోడ్లు అధ్వానంగా మారాయి. స్థానిక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వర్షాల కారణంగా కాలనీల్లోని అంతర్గత రోడ్లు గుంతలమయంగా మారాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. వరద ధాటికి రోడ్డు కోసుకుపోయి పలు చోట్ల గుంతల మయంగా మారింది.  ధ్వంసమైన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాల్సిన సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఇటు వైపు కన్నెత్తైనా చూడటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు పలుమార్లు వినతి చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు ధ్వంసమైన రోడ్లపై దృష్టి సారించి, మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేనిపక్షంలో మున్సిపల్‌ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

 రోడ్డు బాగు చేయాలి:  రాజ్‌కుమార్‌ యూత్‌కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు

 ఆత్కూర్‌ నుంచి తట్టెపల్లి, తట్టెపల్లి నుంచి ఆడ్కిచర్ల వరకు  కొత్తగా రోడ్డు వేసేందుకు  తవ్వేశారు. కాంట్రాక్టర్‌ ఎర్రమట్టి పోసి వదిలేశారు. వానలు కురవడంతో బురదరోడ్డులో ప్రయాణం చేయడం నరకంగా మారింది. వెంటనే అధికారులు, పాలకులు స్పందించి  రోడ్డు పనులు పూర్తి చేయాలి.  లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం.

 కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు  : కిష్టన్నగారి లింగం, స్థానికుడు

నాగారం మన్సిపల్‌ పరిధిలోని పలు కాలనీల్లో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. రోడ్డు సక్రమంగా లేకపోవటంతో స్థానిక కాలనీల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వాహనదారులు గాయాలపాలవుతున్నారు. రోడ్లు బాగు చేయటంలో అధికారులు, పాలకులు అలసత్వం వహిస్తున్నారు. ప్రమాదకరంగా మారిన రోడ్లను వెంటనే బాగుచేయాలి.





Updated Date - 2022-08-18T04:35:52+05:30 IST