అలా.. గెలిచేశారు..!

Sep 20 2021 @ 01:06AM

  1. అధికార పార్టీ బెదిరింపులు, దాడులు
  2. నామినేషన్ల బలవంతపు విత డ్రాలు
  3. ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ
  4. అయినా తిరగబడి సత్తా చాటిన తమ్ముళ్లు


కర్నూలు, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): బలమైన ప్రత్యర్థి ఉంటేనే పోటీ రసవత్తరంగా ఉంటుంది. ప్రత్యర్థి లేకుండా గెలిచినా.. దానిని ఓటమి కిందే పరిగణిస్తారు. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఇలాగే ఉంది. ఎన్నికలను ప్రజాబలంతో కాకుండా అధికార బలంతో గెలవాలనుకునే మనస్తత్వం ఉన్న వైసీపీ ఎన్నికల్లో దాడులకు తెగబడింది. నామినేషన వేయకుండా ప్రతిపక్ష పార్టీ ఆశావహులను అడ్డుకుంది. అయినా నామినేషన వేసిన వారిని బెదిరించి బలవంతంగా విత డ్రాలు చేయించింది. వైసీపీ తీరును నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. పరిషత ఎన్నికలను బహిష్కరించింది. కానీ పూర్తిగా బరిలో నిలబడకపోతే వైసీపీ అరాచకాలకు అడ్డే ఉండదన్న ఉద్దేశంతో కొంతమంది బరిలో నిలిచి సత్తా చాటారు. జిల్లా వ్యాప్తంగా వందకు పైగా ఎంపీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. ఎన్నికలను టీడీపీ సీరియస్‌గా తీసుకుని ఉంటే వైసీపీకి ముచ్చెమటలు పట్టించేదన్న వ్యాఖ్యలు వినిపించడం గమనార్హం. ఎన్నికలు జరిగిన తీరుపై కూడా ప్రజలు నిరసన భావం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ఇలా ఏకపక్షంగా ఎన్నికల్లో గెలవడం కంటే, అసలు ఎన్నికలు జరపకుండా ఉంటేనే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


ఎదురు నిలిచి..

గత సంవత్సరం మార్చిలో ఎన్నికల నోటిఫికేషన విడుదల కాగానే వైసీపీ అరాచకాలు మొదలుపెట్టింది. నోటిఫికేషన వెలువడగానే వైసీపీ నాయకులు ప్రతిపక్షాలను బెదిరించి, దాడులకు తెగబడి ఎన్నికల ఏకపక్షంగా జరుపాలనుకుంది. తమకు వ్యతిరేకంగా నామినేషన వేసిన వారిపై అధికార పార్టీ నాయకులు దాడులు చేశారు. కొన్నిచోట్ల బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌ నాయకులను ఏకంగా కిడ్నాప్‌ చేశారు. అన్నింటికీ తెగించి నామినేషన వేసిన వారిని జడ్పీ సీఈవో ఎదుటే బలవంతంగా వితడ్రా చేయించారు. జిల్లా వ్యాప్తంగా 53 జడ్పీటీసీ, 807 ఎంపీటీసీ స్థానాలు ఉంటే 16 జడ్పీటీసీ, 266 ఎంపీటీసీల స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. డోన నియోజకవర్గ పరిధిలో 54 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఏకంగా 53 ఎంపీటీసీలను వైసీపీ ఏకగ్రీవం చేసుకోవడం అధికార పార్టీ బెదిరింపుల పర్వానికి పరాకాష్ట. ఈ పరిణామాలను పరిశీలించిన ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీతో పాటు జనసేన కూడా ఎన్నికలను బహిష్కరించింది. అయితే స్థానిక టీడీపీ నాయకులు  కొందరు వైసీపీ బెదిరింపులకు భయపడేది లేదంటూ నామినేషన్లు వేశారు. అధికార పార్టీ బలం, బలగానికి ఎదురు తిరిగి సత్తా చాటారు. జిల్లా వ్యాప్తంగా 43 ఎంపీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవడమే కాకుండా, 62 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ ఎన్నికలను బహిష్కరించడంతోనే వైసీపీకి అనుకున్న స్థాయిలో స్థానాలు దక్కాయని, ఒకవేళ టీడీపీ బరిలో ఉండి ఉంటే వైసీపీకి దీటుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు దక్కించుకునేదని అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు పేర్కొనడం గమనార్హం. 


అధికార బలంతో..

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను వైసీపీ మార్కు రాజకీయానికి, రాజ్యాంగ బద్ధ సంస్థ అయిన ఎన్నికల కమిషనకు మధ్య జరిగిన మినీ యుద్ధంగా చూడవచ్చు. గత సంవత్సరం మొదటి సారిగా మార్చి 7న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎన్నికల కమిషన నోటిఫికేషన విడుదల చేసింది. నోటిఫికేషన ప్రకారం మార్చి 21న ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కరోనా విజృంభణ కారణంగా ఎన్నికలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అప్పటి ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ కుమార్‌ మార్చి 14న ప్రకటించారు. అయినా లెక్కచేయకుండా ఎన్నికలు జరపాలని వైసీపీ మంకుపట్టు పట్టింది. ఎన్నికలు జరపడానికి ఎన్నికల కమిషనర్‌ను తొలగించడానికి కూడా వెనుకాడలేదు. అయితే కోర్టు తీర్పుతో ప్రభుత్వం తలవంచక తప్పలేదు. నిమ్మగడ్డ రమేశ పదవీ కాలం పూర్తయ్యాక, రాష్ట్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండే నీలం సాహ్నిని ఎన్నికల కమిషనర్‌గా నియమించింది. ఆమె ఈ సంవత్సరం ఏప్రిల్‌ 1న ఎన్నికలను నోటఫికేషన జారీ చేసింది. పోలింగ్‌ ఏప్రిల్‌ 8న, కౌంటింగ్‌, ఫలితాల ప్రకటన ఏప్రిల్‌ 10న ఉంటాయని నోటిఫికేషనలో పేర్కొన్నారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా నాలుగు వారాల ప్రవర్తనా నియమావళిని పరిగణలోకి తీసుకోలేదని హై కోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రమే అనుమతించిన కోర్టు, కౌంటింగ్‌పై స్టే విధించింది. పలు విచారణల అనంతరం ఏప్రిల్‌ 8న జరిగిన పోలింగ్‌ను రద్దు చేస్తూ మే 21న హై కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును డివిజన బెంచలో  ఎస్‌ఈసీ సవాల్‌ చేసింది. విచారణ జరిపిన హై కోర్టు ఈ నెల 16న కౌంటింగ్‌కు అనుమతినిచ్చింది. 


కోడుమూరు లో టీడీపీ హవా

19 ఎంపీటీసీలు గెలుపొందిన టీడీపీ

కర్నూలు(న్యూసిటీ), సెప్టెంబరు 19: కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హవా నడిచింది. ఎన్నికలను బహిష్కరించినా, టీడీపీపై అభిమానంతో ఓటర్లు ఎంపీటీసీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు విజయం అందించారు. నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాలైన కోడుమూరు, సి బెళగల్‌, గూడూరు, కర్నూలు రూరల్‌ కలిసి మొత్తం 67 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో టీడీపీ ఏకంగా 19 స్థానాలకు కైవసం చేసుకుంది. కర్నూలు రూరల్‌ పరిధిలో 11 స్థానాలను గెలుచుకున్న టీడీపీ అభ్యర్థులు, సత్తాను చాటి వైసీపీ అభ్యర్థులకు చెమటలు పట్టించారు. సి బెళగల్‌ మండల పరిధిలో 5 స్థానాలను దక్కించుకోగా కోడుమూరు-2, గూడూరు-1 స్థానాలకు టీడీపీ దక్కించుకుంది. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.