ఆపత్కాలంలో అండగా...

ABN , First Publish Date - 2021-05-13T05:30:00+05:30 IST

ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూడలేదు. అంతా ప్రభుత్వ బాధ్యతేననీ కూర్చోలేదు. సమాజ శ్రేయస్సు కోసం ఆ ఎవరో తామే ఎందుకు కాకూడదనుకున్నారు బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త బిను వర్మ. పేద విద్యార్థులకు విద్య, వసతులు కల్పించేందుకు

ఆపత్కాలంలో అండగా...

ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూడలేదు. అంతా ప్రభుత్వ బాధ్యతేననీ కూర్చోలేదు.

 సమాజ శ్రేయస్సు కోసం ఆ ఎవరో తామే ఎందుకు కాకూడదనుకున్నారు బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త బిను వర్మ. పేద విద్యార్థులకు విద్య, వసతులు కల్పించేందుకు 

భర్త రమేశ్‌ బాలసుందరమ్‌తో కలిసి ‘బాల ఉత్సవ్‌’ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పిన ఆమె... 

కరోనా విజృంభిస్తున్న సమయంలో వేల కుటుంబాల ఆకలి తీరుస్తున్నారు. 


‘‘బాల ఉత్సవ్‌’... ఇది మా మానస పుత్రిక. నేను, మా వారు రమేశ్‌ ప్రేమలో ఉన్నప్పుడే దీనికి బీజం పడింది. అనుకున్నట్టుగానే పెళ్లి తరువాత ‘బాల ఉత్సవ్‌’ స్వచ్ఛంద సంస్థకు రూపం ఇచ్చాం. బాల్యం ఎంతో అపురూపమైనది. ప్రతి పిల్లవాడూ ఆ దశను ఒక ఉత్సవంలా భావించాలన్నదే మా అభిలాష. అలాగని ఏదో అద్భుతాలు చేసేద్దామని దీన్ని స్థాపించలేదు. ఉన్న వనరులను సరైన రీతిలో ఉపయోగించుకొంటూ మా లక్ష్యం దిశగా మెరుగైన ఫలితాలు సాధించాలన్నదే ప్రధాన ఉద్దేశం. అలాగే విపత్తులు సంభవించినప్పుడు స్పందించేందుకు ‘ఆపరేషన్‌ దయిత్వ’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొంటూ ఆపదలో ఉన్నవారికి సాయం చేసే కార్యక్రమం ఇది. దీని ద్వారా నేపాల్‌ భూకంపం సంభవించినప్పుడు, చెన్నై, కడలూర్‌, కేరళల్లో వరదలప్పుడు సహకారం అందించాం. 


30 వేల కుటుంబాలకు... 

గత ఏడాది మార్చిలో కేంద్రం ఎప్పుడైతే లాక్‌డౌన్‌ ప్రకటించిందో... అప్పటి నుంచి కరోనా బాధితుల కోసం మా సంస్థ పని చేయడం ప్రారంభించింది. ఉపాధి కోల్పోయిన తోపుడు బండ్లవారు, చిరు వ్యాపారులు, రోజు కూలీల కుటుంబాలకు నిత్యావసరాలు, శానిటరీ కిట్స్‌, తాగు నీరు అందించాం. వీటితోపాటు ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు పీపీఈ కిట్లు, మహిళలకు శానిటరీ నేప్కిన్స్‌, చిన్న పిల్లలకు రీహైడ్రేషన్‌ సొల్యూషన్స్‌ ఇచ్చాం. అనేక బస్తీలు, కాలనీల్లో రెండు పూటలా భోజనాలు వడ్డించాం. మొత్తం ఇప్పటి వరకు దాదాపు 30 వేల కుటుంబాలకు సాయం చేశాం. మానవాళి చరిత్రలోనే ఇది అత్యంత క్లిష్టమైన సమయం. ఈ విపత్తును ఆపడం మన చేతుల్లో లేకపోవచ్చు... కానీ దానివల్ల దెబ్బతిన్నవారి బాధనైతే కచ్చితంగా తగ్గించగలం కదా! 


మరింత విస్తరించి... 

ఇప్పుడు మళ్లీ కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. కళ్లముందు ఎంతో మంది ఊపిరి అందక ప్రాణాలు వదులుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి లెక్కకు మించి బాధితులు అత్యవసర సేవలు అందక అల్లాడుతున్నారు. ఇవన్నీ చూశాక మా సేవలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని గ్రహించాం. అందులో భాగంగానే నిత్యావసరాలు, భోజనాలే కాకుండా మెడికల్‌ కిట్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు కూడా అందుబాటులో ఉంచుతున్నాం. దేశంలో కరోనా మొదలైన నాటి నుంచి నేటి వరకు 1.4 కోట్ల భోజనాలు, 11 లక్షల శానిటరీ ప్యాడ్స్‌, 78 వేలకు పైగా హైజీనిక్‌ కిట్స్‌, 30 వేల లీటర్లు తాగు నీరు, నిత్యావసర కిట్లు పంపిణీ చేశాం. 


రెండు మూడు గంటలే నిద్ర... 

కరోనా విలయం మొదలైనప్పటి నుంచి నాకు, మావారికి కంటి నిండా నిద్ర కూడా లేదు. వాలంటీర్ల సమన్వయం, నిధుల సేకరణ, కిట్ల పంపిణీ... క్షణం తీరిక ఉండడంలేదు. కొన్ని సార్లు రాత్రిళ్లు రెండు మూడు గంటలే పడుకొనేవాళ్లం. ఆ రోజు పరిస్థితులను బట్టి మా నిద్రపోయే సమయం ఆధారపడి ఉంటుంది. కానీ సమయానికి ఆపదలో ఉన్నవారికి సాయం అందిస్తే అందులో ఉండే సంతృప్తి మరెందులోనూ దొరకదు. మా ఈ ప్రయత్నం వల్ల ఒక్కరి ప్రాణం నిలబడినా... మా జన్మ ధన్యమైనట్టే కదా! ఇది కష్ట సమయం. ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించి తోచిన సాయం చేస్తేనే ఈ ఆపత్కాలం నుంచి గట్టెక్కగలం. 


 దేశంలో కరోనా మొదలైన నాటి నుంచి నేటి వరకు 1.4 కోట్ల భోజనాలు, 11 లక్షల శానిటరీ ప్యాడ్స్‌, 78 వేలకు పైగా హైజీనిక్‌ కిట్స్‌, 30 వేల లీటర్లు తాగు నీరు, నిత్యావసర కిట్లు పంపిణీ చేశాం. 


‘భారత్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌’...  

ఇప్పుడు ఎక్కడ చూసినా ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఆక్సిజన్‌ వంటి అత్యవసర సేవలు అందక ఎంతోమంది ఊపిరి ఆగిపోతోంది. ఈ పరిస్థితుల్లో కొంతైనా మార్పు తెచ్చేందుకు ‘భారత్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌’ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. సమీపంలోని ఆసుపత్రులకు అనుబంధంగా ఆటస్థలాలు, భారీ పార్కింగ్‌ ప్రాంతాలు, ఆడిటోరియాలు, స్కూల్స్‌, కమ్యూనిటీ సెంటర్లలో వీటిని ఏర్పాటు చేయాలనేది మా ఆలోచన. వీటిల్లో ఐసీయూ బెడ్స్‌, ఆక్సిజన్‌, టెలీమెడిసిన్‌కు అవసరమైన వసతులు ఉంటాయి. 


భారం కాదు... బాధ్యత... 

ప్రస్తుత తరుణంలో ఎవరికి తోచిన సాయం వారు అందించాలి. మేం తలపెట్టింది ఒక యజ్ఞం. బరువుగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నాం. ఇంత పెద్దఎత్తున సహాయక కార్యక్రమం నిర్వహించాలంటే భారీగా ఖర్చవుతుంది. జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలు, వ్యక్తుల నుంచి నిధులు సేకరిస్తున్నాం. ప్రత్యేకించి కరోనా కాలంలో తలపెట్టిన ఈ మంచి పనికి నిధుల సేకరణ క్యాంపెయిన్‌ చేపట్టాం. ఎంతో మంది స్పందించారు. కానీ మరింతమందికి సేవలు విస్తరించాలంటే ఏ ప్రాంతంలోని వారు ఆ ప్రాంతంలో స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు రావాలి. ఎవరికి వారు ఒక్కరమే కదా అని కూర్చోవద్దు. తొలి అడుగు ఎప్పుడూ ఒంటరేనన్నది గుర్తుపెట్టుకోవాలి. ఆ అడుగు మనమే అయితే తరువాత మరెన్నో అడుగులు మన వెంట వస్తాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నవారికెవరికైనా సరే... మేం సహకారం అందిస్తాం. 

Updated Date - 2021-05-13T05:30:00+05:30 IST