సామాజిక మాధ్యమాలు.. సహాయ వేదికలు

ABN , First Publish Date - 2021-04-23T06:29:22+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి విజృంభణ వేళ సామాజిక మాధ్యమాలు బాధితులకు సహాయ వేదికలుగా మారుతున్నా యి.

సామాజిక మాధ్యమాలు.. సహాయ వేదికలు

కరోనా సమస్త వివరాలు

ఇంజక్షన్‌ నుంచి ఆక్సిజన్‌ వరకు పోస్టుల వెల్లువ 

సాయం పొందేలా ఉపయోగపడుతున్న వైనం

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ మహమ్మారి విజృంభణ వేళ సామాజిక మాధ్యమాలు బాధితులకు సహాయ వేదికలుగా మారుతున్నా యి. కొన్ని సందర్భాల్లో కష్టసాధ్యమనుకున్న సేవలూ, సమాచారం సులువుగా పొందేలా ఉపకరిస్తున్నాయి. పాజిటివ్‌ వస్తే ఉపశమన చర్యలు, ఆస్పత్రులకు వెళ్లడం.. ఆక్సిజన్‌ నుంచి ఇంజక్షన్‌.. ఐసీయూ బెడ్‌ల నుంచి వెంటిలేటర్‌ వరకు.. అవసరం ఏదైనా ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్ట్‌ చేస్తున్నారు. ఇవి మానవతా దృక్పథంతో స్పందించి సాయం చేసేందుకు దోహదపడుతున్నాయి. ఆస్పత్రుల్లో ఎక్కడ బెడ్‌లు ఖాళీగా ఉన్నాయి? ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడ వైద్య సేవలు పొందవచ్చు? అన్న విషయాన్ని పౌరులు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. కొవిడ్‌ వల్ల వ్యక్తిగతంగా తమకు జరిగిన నష్టాలు, ఎదుర్కొంటున్న సవాళ్లను వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో సమాచారం ఆధారంగా అవకాశం ఉన్నచోట సేవల కోసం ప్రయత్నించే వెసులుబాటు కలుగుతోంది. 

కలిచివేస్తూ.. కదిలిస్తూ..

ఇటీవల వైర్‌సతో ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రుల్లో.. అత్యవసర పరిస్థితుల్లో చికిత్స చేయాల్సిన కేసులు అధికమవుతున్నాయి. సాధారణంగా రెమిడెసివిర్‌ వాస్తవ ధర రూ. 4 వేలలోపు ఉండగా.. కొరత నేపథ్యంలో బ్లాక్‌లో రూ. 30 వేలకుపైగా విక్రయిస్తున్నారు. సోషల్‌ మీడియాలో రెండు, మూడు రోజులుగా రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌కు సంబంధించి నిత్యం 20 వేల నుంచి 30 వేల పోస్టులు కనిపిస్తున్నాయి. వాట్సాప్‌ గ్రూపుల్లో అర్జంట్‌గా రెమిడెసివిర్‌ కావలెను అన్న సందేశాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. అయినవారి ప్రాణాలను కాపాడుకునేందుకు కొందరు ట్విటర్‌ వేదికగా ప్రజాప్రతినిఽధులు, ప్రముఖుల సాయం కోరుతున్నారు. మానవతా దృక్పథంతో స్పందించాలని వివిధ రంగాలకు చెందిన తెలిసిన వారిని ప్రాధేయపడుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో సకాలంలో స్పందించక అంబులెన్స్‌లోనే తన తల్లి మరణించిందంటూ ఓ యువకుడి ఆవేదన కలిచి వేసింది. కింగ్‌కోఠి కొవిడ్‌ ఆస్పతిలో ఓ మృతదేహం నాలుగు రోజులపాటు స్ర్టెచర్‌పైనే ఉండడం.. అక్కడి సిబ్బంది పట్టించుకోకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్న సందేశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

ఆపత్కాలంలో అండగా..

ఆపత్కాలంలో అవసరార్థులకు అండగా నిలిచేలా సోషల్‌ మీడియా ఉపయోగపడుతోంది. కొన్ని సంస్థలు సామాజిక బాధ్యతగా స్పందిస్తూ.. అంబులెన్స్‌ సర్వీసులు, ఆస్పత్రుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాయి. కొవిడ్‌ నుంచి కోలుకున్న కొందరు అవసరమైన వారికి ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఇటీవల ఓ ఆంగ్ల దినపత్రిక పాత్రికేయుడు.. తోటి రిపోర్టర్‌కు తెలిసిన వారికి ప్లాస్మా అవసరం ఉందని వాట్సాప్‌ స్టేటస్‌ ద్వారా తెలుసుకొని స్వచ్ఛందంగా వెళ్లి ప్లాస్మా దానం చేశారు. సైబరాబాద్‌ పోలీసులు ‘డొనేట్‌ ప్లాస్మా’ పేరిట యాప్‌ రూపొందించారు. అవసరార్థులకు ప్లాస్మా అందించడంతోపాటు కొవిడ్‌ వారియర్స్‌ నుంచి ప్లాస్మా తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్మా, రెమిడెసివిర్‌ కోసం సామాజిక మాధ్యమాల్లో ఇటీవల విజ్ఞప్తులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్లాస్మా డోనర్స్‌ పేరిట కొన్ని వాట్సాప్‌ గ్రూపులు నిర్వహించడంతోపాటు.. ప్లాస్మా ఇచ్చే వారి పేర్లు, ఫోన్‌ నంబర్లూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

Updated Date - 2021-04-23T06:29:22+05:30 IST