సోషల్‌ రంగస్థలం

ABN , First Publish Date - 2021-01-24T04:41:21+05:30 IST

సోషల్‌ మీడియా... ప్రస్తుతం ప్రపంచం మొత్తం దీనిపై ఆధారపడి ఉంది. సామాజిక మాధ్యమాలను వాడుకునేందుకు ప్రస్తుతం రాజకీయ పార్టీలు, కొందరు నాయకులు అమితోత్సాహం చూపుతున్నారు.

సోషల్‌ రంగస్థలం

సామాజిక మాధ్యమాలపై రాజకీయ నాయకుల ఆసక్తి

నెట్టింట మీడియా సైన్యాన్ని మోహరించిన నేతలు

‘ఆన్‌లైన్‌’ ప్రచారంపై ఆసక్తి చూపుతున్న ఖమ్మం జిల్లా నాయకులు

సత్తుపల్లి, జనవరి 23: సోషల్‌ మీడియా... ప్రస్తుతం ప్రపంచం మొత్తం దీనిపై ఆధారపడి ఉంది. సామాజిక మాధ్యమాలను వాడుకునేందుకు ప్రస్తుతం రాజకీయ పార్టీలు, కొందరు నాయకులు అమితోత్సాహం చూపుతున్నారు. రాజకీయ పార్టీలు, నాయకులు, నాయకుల అనుచరులు సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు వెల్లువెత్తిస్తున్నారు. ఇటీవల ఈ సంస్కృతి బాగా వేళ్లూనుకుంటోంది. అమకు అనుకూలమైన అంశాలను, కలిసి వచ్చే పోస్టులను వైరల్‌ చేయటంలో రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. తద్వారా రాజకీయంగా మైలేజి పొందాలని భావిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీ సోషల్‌ మీడియాను విపరీతంగా వాడుకొని లబ్ధి పొందిందని ప్రత్యర్థి పార్టీ ఏకంగా తమ పార్టీ కేడర్‌కు సోషల్‌ మీడియా వాడుకోవాలని సూచించింది. దీనిని బట్టి సోషల్‌ మీడియా ప్రభావం రాజకీయ పార్టీలపై తీవ్రంగా కనిపిస్తోంది.

సోషల్‌ మీడియా కథ ఇదీ

నేటి ప్రపంచంలో సోషల్‌ మీడియా సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌తో పాటు వాట్స్‌ యాప్‌లు వేల సంఖ్యలో ప్రజలను ఏక కాలంలో ఒక వేదిక మీదకు తెస్తోంది. ఏక కాలంలో పెద్ద సమూహానికి దగ్గరయ్యేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. నాణేనికి బొమ్మా, బొరుసు మాదిరిగా దీని వల్ల మంచి, చెడు ప్రభావాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సమాజ హితం కోరే విధంగా ఉండాల్సిన సోషల్‌ మీడియా పక్కదారు పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. 

సోషల్‌ మీడియాపై మోజెందుకంటే

పత్రికారంగం, టీవీ చానల్స్‌ ద్వారా రాజకీయ పార్టీలు, నాయకుల భావాలు ప్రచారం కావాలంటే దానికి పరిఽధులు, పరిమితులు తప్పని సరి. రాజకీయ నాయకుల చేసే వ్యాఖ్యలు కొన్ని పత్రికల్లో ప్రచురించటం కూడా సాధ్యం కాని పరిస్థితి ఉంటుంది. ఎలక్ర్టానిక్‌ మీడియాలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. దీనికి తోడు సోషల్‌ మీడియాలో తాము అనుకున్నది అనుకున్నట్టుగా వైరల్‌ చేసే అవకాశం ఉండటంతో దీనిపై నాయకులు ప్రస్తుతం ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో కొందరు రాష్ట్ర నాయకులు ఇప్పటికే సోషల్‌ మీడియాను నమ్ముకుంటున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..

ప్రస్తుతం సోషల్‌ మీడియాను వాడుకునేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు కొందరు అమితాసక్తి చూపుతున్నారు. సోషల్‌ మీడియాలో అవసరమైన పోస్టులు సమయానుకూలంగా పెట్టేందుకు ప్రత్యేకంగా ఒక సైన్యాన్ని కూడా తయారు చేసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే కొందరు రాజకీయ నాయకులు సోషల్‌ మీడియాను ఉపయోగించుకుంటూ ఉండగా మరి కొందరు నాయకులు దీనిని వేదికగా చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజుల్లో సోషల్‌ మీడియా సైన్యాన్ని తయారు చేస్తామని ఒక నాయకుడు ఇటీవల ప్రకటించిన విషయం విధితమే. కొన్ని రాజకీయ పార్టీల మధ్య సోషల్‌ మీడియా వేదికగా ప్రచ్చన్నయుద్ధం జరుగుతుండగా ఒకే పార్టీలోని వర్గాల మధ్య కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇటీవల ఒక రాజకీయ పార్టీ అంతర్గత సమావేశంలో అధినాయకుడు జిల్లా నాయకులను ఉద్దేశించి ఏమి మాట్లాడారో సమావేశంలో పాల్గొన్న నాయకులకు మాత్రమే తెలుసు. కాని సోషల్‌ మీడియాలో మాత్రం కొందరు నాయకులను మందలించినట్లు అదే పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారని ఇది సరికాదని, సోషల్‌ మీడియాలో ఇస్టానుసారం పోస్టులు పెట్టటం వల్ల పార్టీ ఇబ్బందుల్లో పడుతుందంటూ నాయకులు వ్యాఖ్యలు చేసారు. ఇదే క్రమంలో తాము కూడా సోషల్‌ మీడియా సైన్యాన్ని తయారు చేస్తామని ప్రకటించారు. సోషల్‌ మీడియా వేదికగా ఇప్పటికే జిల్లాలో కొన్ని పార్టీల మధ్య, ఒకే పార్టీలో నాయకులు, వారి అనుచరుల మధ్య సోషల్‌ మీడియా వార్‌ జరుగుతుండగా మిగిలిన నాయకులు కూడా సోషల్‌ మీడియా సైన్యం ఏర్పాటు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. 


Updated Date - 2021-01-24T04:41:21+05:30 IST