సోషల్ మీడియా ప్రజాస్వామ్య ప్రమాణమా?

ABN , First Publish Date - 2022-05-13T06:06:54+05:30 IST

వాతావరణ వైపరీత్యాలు మానవాళి అస్తిత్వాన్నే సంక్షోభంలోకి నెట్టివేస్తోన్న సందర్భమిది. భౌగోళిక సరిహద్దులు, సామాజిక అంతస్తులు, రాజకీయ వ్యత్యాసాలకు అతీతంగా సకల సమాజాల మధ్య...

సోషల్ మీడియా ప్రజాస్వామ్య ప్రమాణమా?

వాతావరణ వైపరీత్యాలు మానవాళి అస్తిత్వాన్నే సంక్షోభంలోకి నెట్టివేస్తోన్న సందర్భమిది. భౌగోళిక సరిహద్దులు, సామాజిక అంతస్తులు, రాజకీయ వ్యత్యాసాలకు అతీతంగా సకల సమాజాల మధ్య సహకారం అత్యవసరమైన సమయమిది. అయినా ప్రపంచ దేశాల మధ్య పరస్పరాలంబన కుప్పకూలిపోతున్నట్టు కనిపిస్తోంది!


ఇంచుమించు మూడు దశాబ్దాల క్రితం మన ప్రపంచం పరస్పరాధారిత పథంలో ఒక కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నది. దేశాల మధ్య వ్యాపార వాణిజ్యాలకు అవి కొత్త నియమాలను నిర్దేశించాయి. దరిమిలా వాతావరణ మార్పు, జీవ వైవిధ్య పరిరక్షణ, హానికర వ్యర్థాలలో ప్రపంచ వాణిజ్యం మొదలైన అంశాలలో మరిన్ని ఒడంబడికలను కుదుర్చుకున్నది. ఈ ఒప్పందాలకు రెండు లక్ష్యాలు ఉన్నాయి. అవి: పాశ్చాత్య అభివృద్ధి నమూనాను విస్తరింప చేయడం ద్వారా ప్రపంచ ఐశ్వర్యాన్ని పెంపొందించడం; దేశ దేశాల్లో పర్యావరణంపై ఆ ఆర్థికాభివృద్ధి ప్రతికూల ప్రభావాలను అదుపుచేయడం. ప్రపంచ ప్రజలందరికీ ప్రజాస్వామ్యం సమకూరుతుందనే నిశ్చిత విశ్వాసమే ఈ ఒప్పందాలకు ప్రేరణ. ప్రజలు మరింతగా సంపన్నులవుతారు. తత్ప్రభావంతో వివిధ జీవన రంగాలలో అనాగరిక ధోరణుల నుంచి బయటపడి, మానవ హక్కులను గౌరవించి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను సమృద్ధం చేసుకుంటారని భావించారు.


1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైపోయింది. యూరోపియన్ కమ్యూనిస్ట్ వ్యవస్థలు కూలిపోయాయి. ‘వాణిజ్యం ద్వారా ప్రజాస్వామ్య వికాసం’అనే పాశ్చాత్య ప్రపంచ పథకంలో జనచైనా 2001లో భాగస్వామి అయింది. ఏ స్వప్నం, ఏ సౌభాగ్యం? పాశ్చాత్య సంపన్న దేశాల పథకం ఫలించడం లేదు. పైగా దానివలన ప్రపంచ దేశాల సమస్యలు మిక్కుటమయ్యాయి. ఈ దారుణ పరిస్థితి ఎందుకు, ఎలా దాపురిల్లింది? ఉక్రెయిన్‌ను వశపరచుకోవడానికై రష్యా చేస్తోన్న అమానుష యుద్ధమే అందుకు ఏకైక కారణం కాదు. ఇంధనం నుంచి ఆహార ధాన్యాల దాకా మానవ మనుగడకు అత్యావశ్యకం, అనివార్యమైన ప్రాథమిక పదార్థాల సరఫరాల్లో అభద్రత, అనిశ్చితి ఏర్పడటం వల్ల అనేక దేశాలు ఇప్పుడు ప్రపంచ పరస్పరాలంబనను వ్యతిరేకిస్తున్నాయి స్వభద్రతకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నాయి. స్వేచ్ఛా విపణి విధానాలకు స్వస్తి చెబుతున్నాయి.


స్వేచ్ఛా విపణి విధానాలు నిరుద్యోగాన్ని తగ్గించాయా? లేదు. మరింతగా పెంచాయి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకునేందుకు సంపన్న దేశాలు ఇప్పుడు వస్తూత్పత్తి కార్యకలాపాలు దేశీయంగా జరిగేలా ప్రోత్సహిస్తున్నాయి. పేద దేశాలకు తరలించిన కార్ఖానాలను వెనక్కి తీసుకు వెళ్లుతున్నాయి. పర్యవసానమేమిటి? మనం సరిహద్దులను మూసివేస్తున్నాం. ప్రపంచ వాణిజ్యానికి వెనుకాడుతున్నాం. ఇప్పటికే ఎగుమతులు దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్నాం. మరింత ఘోరమైన విషయమేమిటంటే కొన్నిటిని మంచిదేశాలుగా, మరికొన్నిటిని హానికారక దేశాలుగా పరిగణిస్తూ ప్రపంచ పరస్పరాలంబనను శీఘ్రంగా కూల్చివేస్తున్నాం. వాతావరణ వైపరీత్యాలు తీవ్ర తరమై పోతూ ప్రపంచ దేశాలన్నీ పరస్పర సహకారంతో సమష్టి కార్యాచరణకు పూనుకోవాల్సిన తరుణంలో ఈ అనైక్యత పెచ్చరిల్లిపోతోంది! అయినా, వాతావరణ మార్పుపై పోరుకు మనం ముందుకు పోక తప్పదు. అయితే గత మూడు దశాబ్దాలుగా మనం చేసిన పొరపాట్లను విస్మరించకూడదు. వాటిని తేలిగ్గా తీసుకోవడానికి వీలులేదు. అవి అత్యంత జటిలమైనవి. వాటితో భారీ నష్టం వాటిల్లింది. ఫలితమే మానవాళి ప్రస్తుత విపత్కర పరిస్థితి. మెరుగైన కార్యాచరణ కోసం వర్తమాన దురవస్థను సాకల్యంగా సమీక్షించుకుందాం.


అసలు ప్రపంచీకరణ మౌలిక సూత్రమే మన మొదటి సమస్య. సమ్మిళిత అభివృద్ధిని సాధించేందుకు అది దోహదం చేస్తుందా? చేయదు గాక చేయదు. చౌక సరుకులు, చౌక శ్రమ ప్రాతిపదికన వాణిజ్యాన్ని అభివృద్ధి పరచుకోవడమే ప్రపంచీకరణ మౌలిక సూత్రంగా ఉంది. సాగు భూములు తక్కువగా ఉన్న చోట వరి, గోధుమ పండించడం ప్రయోజనకరం కాదని; పెద్ద వ్యవసాయ కమతాలు లేకుండా వ్యవసాయ వాణిజ్య కార్యకలాపాలు లాభదాయకంగా ఉండవని స్వేచ్ఛా వాణిజ్య ఆర్థికవేత్తలు పదే పదే చెప్పుతుంటారు. శ్రమ శక్తి విలువ ఎక్కడ తక్కువగా ఉంటుందో, మరింత స్పష్టంగా చెప్పాలంటే స్వల్ప వేతన భత్యాలకు కార్మికులు అందు బాటులో ఉన్న చోట ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహించడమే అన్ని విధాల లాభదాయకమని కూడా వారు మరీ మరీ చెప్పుతుంటారు. పర్యావరణ రక్షణకు పెద్దగా మూల్యం చెల్లించవలసిన అగత్యం లేని దేశాలలో ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహించాలనేది వారి నిర్దేశం. చౌక శ్రమతో ఉత్పత్తయిన వస్తువులు చౌక ధరలకు మన వినియోగానికి సదా సమృద్ధంగా అందుబాటులో ఉంటాయనేది వారి సిద్ధాంతం.


ఈ అర్థ నీతి ప్రపంచంలో కొన్ని దేశాలను సంపద్వంతం చేసిందనడంలో సందేహం లేదు. ఇదే ఆర్థిక చింతన మార్కెట్ల కోసం సకల దేశాల మధ్య పోటీని ముమ్మరం చేసింది. కార్మిక శ్రేయస్సును, పర్యావరణ రక్షణను పణంగా పెట్టి ఈ పోటీలో విజేతలు కావడానికి అన్ని దేశాలూ ఆరాటపడుతున్నాయి. ఈ కారణంగానే ప్రపంచం నేడు వాతావరణ మార్పు సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ఇక మనం చేసిన రెండో పొరపాటు – ఇదే అత్యంత ప్రమాదకరమైనది– సోషల్ మీడియా (సామాజిక మాధ్యమాలు) పెరుగుదలను ప్రజాస్వామ్య అభివృద్ధిగా భావించడం. సామాజిక మాధ్యమాలలో బిగ్గరగా వినిపించే గొంతులను అసలైన ప్రజా వాణిగా విశ్వసిస్తున్నాం. ఇది, పరిపాలన, ప్రజాస్వామ్య పద్ధతుల పట్ల గర్హనీయమైన నిర్లక్ష్యమే తప్ప మరేమీకాదు. 2010లో ‘అరబ్ వసంతం’లో ఇదంతా ఆరంభమయింది. సామాజిక మాధ్యమాల ప్రభావం ఎంత బలీయమైనదో ఆనాడు హఠాత్తుగా అందరికీ తెలిసివచ్చింది. వాటి ప్రభావంతోనే నియంతలు, నిరంకుశ పాలకులు కుప్పకూలారని పాశ్చాత్య ప్రజాస్వామ్య వాదులు ఘోషించారు. ప్రపంచం విశ్వసించింది. ప్రజాస్వామ్య పురోగతికి సోషల్ మీడియా ఒక ఉపకరణమయింది. అయితే నేడు ఆ ప్రజాస్వామ్య ఉపకరణాన్ని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారు. దాని ప్రభావశీలతను భ్రష్టు పట్టిస్తున్నారు. హానికారకమైన లక్ష్యాలకు అనూహ్య రీతుల్లో దాన్ని ఉపయోగిస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఎందుకిలా జరుగుతోంది? ప్రభుత్వాల స్థానాన్ని మార్కెట్లు భర్తీ చేయగలవని, ప్రజాస్వామ్యానికి పర్యాయపదం సోషల్ మీడియా అని అమాయకంగా నమ్మడం వల్లే కాదూ? మానవాళి సమష్టి భద్ర భవిష్యత్తుకు ఇది దారి కానేకాదు.


సునీతా నారాయణ్

(‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ డైరెక్టర్‌ జనరల్‌, ‘డౌన్‌ టు ఎర్త్‌’ సంపాదకురాలు)

Read more