ఈ-సమస్యలెన్నో..!

ABN , First Publish Date - 2022-08-09T06:30:51+05:30 IST

ఈ-సమస్యలెన్నో..!

ఈ-సమస్యలెన్నో..!

వాహన్‌ పరివాహన్‌ వెబ్‌ పోర్టల్‌తో అవస్థలు

కొత్త సమస్యలతో వాహనదారులు బెంబేలు



కొండ నాలుక్కి మందేస్తే.. ఉన్న నాలుక ఊడిందట. రవాణా శాఖ సేవలను తేలిగ్గా పొందాలని దేశవ్యాప్తంగా వాహన్‌ పరివాహన్‌ వెబ్‌ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తే, సాఫ్ట్‌వేర్‌ సమస్యలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : దేశవ్యాప్తంగా ఒకే వెబ్‌సైట్‌ ద్వారా రవాణా సేవలను అందించటానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం వాహన్‌ పరివాహన్‌ వెబ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ వెబ్‌సైట్‌ను ఎవరికి వారు, స్థానికంగా వారికి అనుగుణంగా డేటా అప్‌లోడ్‌ చేసుకుని, కొన్ని మార్పులు చేసి ఉపయోగించుకోవాలి. అయితే, ఆరు నెలలుగా అనేక సమస్యలు గుర్తిస్తున్నా, అవన్నీ రవాణా అధికారుల నోటీసుకు వస్తున్నా సరిదిద్దుకునే చర్యలు మాత్రం తీసుకోవట్లేదు. ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న ఎన్‌ఐసీ టీమ్‌తో సమన్వయం చేసుకుంటూ, సమస్యలు, ఇబ్బందులను సరి చేయించుకోవాలి. రవాణా శాఖ అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సీనియర్‌ అధికారులను అక్కడికి పంపి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉండగా, ఆ ప్రక్రియను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. దీంతో సాఫ్ట్‌వేర్‌ సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ట్రయల్స్‌ దశలో ఉన్న వెబ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తేవడంతో కొత్త సమస్యలు ఏర్పడుతున్నాయి. 

సమస్యలివీ..

వాహన్‌ పరివాహన్‌ వెబ్‌సైట్‌ ద్వారా కేవలం లైసెన్స్‌, రిజిస్ర్టేషన్స్‌ సేవలే అందుతున్నాయి. మొదట్లో వీటికి సంబంధించి పేమెంట్స్‌ ఎర్రర్స్‌ వచ్చేవి. వాటిని పరిష్కరించారు. లైసెన్సులు, రిజిస్ర్టేషన్ల సేవలకు సంబంధించి అనేక అనుబంధ సేవలు ఉంటాయి. ప్రస్తుతం ఇవేమీ జరగట్లేదు. ఎల్‌ఎల్‌ఆర్‌ జారీ అయ్యాక 30 రోజుల నుంచి ఆరు నెలల్లోపు డ్రైవింగ్‌ టెస్టుకు వెళ్లాల్సి ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో అలా వెళ్లలేని వారు మళ్లీ రెన్యువల్‌ చేయించుకుని నేరుగా టెస్టుకు వెళ్లొచ్చు. వాహన్‌ పరివాహన్‌ వెబ్‌సైట్‌లో ఈ ఆప్షన్‌ లేదు. మళ్లీ ఎల్‌ఎల్‌ఆర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల చాలామంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఆప్షన్‌ మొన్నటి వరకు లేదు. ఇటీవలే ఆ ఆప్షన్‌ కల్పించారు. పైగా దీనికి రూ.3,425 ఫీజు చెల్లించాలని చూపిస్తున్నారు. వాస్తవానికి ఫీజు రూ.1,625 మాత్రమే. కానీ, వెబ్‌సైట్‌లో రెట్టింపు ఫీజు చూపిస్తోంది. ఎన్‌ఐసీతో మన అధికారులు సమన్వయం చేసుకోకపోవడం వల్లే ఇలా జరుగుతోంది. ఫలితంగా ఉత్తరాది రాష్ర్టాల్లో ఫీజులే ఇక్కడా చూపిస్తున్నాయి. ఇక రిజిస్ర్టేషన్ల విషయానికొస్తే రవాణా, రవాణాయేతర వాహనాలన్నింటికీ షోరూమ్‌ల్లోనే టెంపరరీ, పర్మినెంట్‌ రిజిస్ర్టేషన్లు జరిగిపోతున్నాయి. షోరూమ్‌ల నిర్వాహకులే వాహన్‌ పరివాహన్‌కు మారిపోతున్నారు. రిజిస్ర్టేషన్లు చేస్తున్నారు కానీ, ఆ కాపీలను వాహనదారులు డౌన్‌లోడ్‌ చేసుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఆర్‌సీ కాపీని ఆన్‌లైన్‌లో పొందాలంటే రెండు నెలలు పడుతుంది. అది కూడా షోరూమ్‌ వారి వద్దే ఓపెన్‌ అవుతుంది. కానీ, వెబ్‌సైట్‌లో ఆ ఆప్షన్‌ ఓపెన్‌ కావట్లేదు. గతంలో ఈ-ప్రగతి వెబ్‌సైట్‌లో క్షణాల్లో ఆర్‌సీ కాపీని డౌన్‌లోడ్‌ చేసుకునేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. రిజిస్ర్టేషన్ల ప్రక్రియలోనే నెంబర్‌ ప్లేట్‌ రిజిస్ర్టేషన్‌ అంశం కూడా ఉంటుంది. సాధారణ నెంబర్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. చాలామంది వాహనదారులు తమకు 1, 3, 5, 6, 7, 8, 9 అంకెలను ప్రత్యేకంగా కోరుకుంటారు. ఇంకొందరు ఫ్యాన్సీ నెంబర్లను కోరుకుంటారు. ఇలాంటి వారు ఈ-బిడ్డింగ్‌ వేయాల్సి ఉంటుంది. దీనికి అనేక మంది పోటీ పడతారు. అత్యధిక బిడ్డింగ్‌ వేసిన వారికి నెంబర్‌ కేటాయిస్తారు. ఇందుకు అంతా ఆన్‌లైన్‌లోనే డబ్బు చెల్లిస్తారు. బిడ్డిం గ్‌ రాని వారికి డబ్బు వెనక్కి వచ్చేస్తుంది. పాత ఈ-ప్రగతిలో అయితే గరిష్టంగా రెండు రోజుల్లో డబ్బు వెనక్కి వచ్చేది. వాహన్‌ పరివాహన్‌లో నెలదాటినా రావట్లేదు. 

సాఫ్ట్‌వేర్‌ మార్పులు అవశ్యం

ప్రస్తుత వాహన్‌ పరివాహన్‌ సాఫ్ట్‌వేర్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటే ఎన్‌ఐసీ వద్దకు వెళ్లాలి. సమస్యలను పరిష్కరించే వరకూ ఒక బృందాన్ని ఎన్‌ఐసీతో కలిసి పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన వాహన్‌ పరివాహన్‌ వెబ్‌సైట్‌ ఆరు నెలలు గడుస్తున్నా కూడా గాడిన పడలేదంటే అధికారుల సమన్వయలోపమే కారణం.

Updated Date - 2022-08-09T06:30:51+05:30 IST