నిఘా వర్గాల కన్నుగప్పి పాకిస్థాన్ పారిపోయిన దావూద్ ఇబ్రహీం మేనల్లుడు

ABN , First Publish Date - 2022-01-13T22:35:22+05:30 IST

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మేనల్లుడు సొహయిల్ కస్కర్ భారత

నిఘా వర్గాల కన్నుగప్పి పాకిస్థాన్ పారిపోయిన దావూద్ ఇబ్రహీం మేనల్లుడు

న్యూఢిల్లీ : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మేనల్లుడు సొహయిల్ కస్కర్ భారత నిఘా వర్గాల కన్నుగప్పి, పాకిస్థాన్ చేరుకున్నాడు. కస్కర్‌ను భారత దేశానికి రప్పించేందుకు చాలా కాలం నుంచి నిఘా వర్గాలు కృషి చేస్తున్నాయి. ఇతను దుబాయ్ నుంచి పాకిస్థాన్ చేరుకున్నట్లు ముంబై పోలీసు వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. 


కస్కర్ నార్కో టెర్రరిజానికి పాల్పడుతున్నట్లు అమెరికన్ ఏజెన్సీస్ ఇటీవల ఆరోపించాయి. భారతీయ నిఘా వర్గాలు ఇటీవల ఓ ఫోన్‌ కాల్‌ను విన్నపుడు అది కస్కర్ చేసినదేనని వెల్లడైంది. అనంతరం నిర్వహించిన దర్యాప్తులో అతను దుబాయ్ గుండా పాకిస్థాన్ చేరుకున్నట్లు తెలిసింది. అతను చాలా కాలం క్రితమే అమెరికా నుంచి బయటకు వచ్చేసినట్లు వెల్లడైంది. అతనిని అమెరికా ఎలా వదిలిపెట్టింది? భారత దేశానికి అతనిని ఎందుకు అప్పగించలేదు? అనే విషయాలపై భారతీయ ఏజెన్సీలకు సమాచారం లేదు. 


2001లో దుబాయ్‌లో డానిష్ అలీ, కస్కర్ కలుసుకున్నారు. వీరిద్దరూ మూడేళ్ళపాటు కలిసి ఉన్నారు. డానిష్‌ను వజ్రాల అక్రమ రవాణాలోకి కస్కర్ దించినట్లు, అనంతరం అతనిని రష్యాకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. డానిష్ 2003లో స్టూడెంట్ వీసాపై రష్యా వెళ్ళాడు. అదే సమయంలో సొహయిల్  దక్షిణాఫ్రికాలో వజ్రాల అక్రమ రవాణా కేసులో అరెస్టయి, ఓ ఏడాదిపాటు జైలు జీవితం గడిపాడు. అనంతరం వీరిద్దరూ కలిసి ఆయుధాల అక్రమ రవాణా ప్రారంభించారు. 


మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా కేసులో వీరిద్దరినీ అమెరికన్ దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. సొహయిల్‌ దోషి అని అమెరికన్ కోర్టు 2018 సెప్టెంబరు 12న తీర్పు చెప్పింది. అతనిని భారత దేశానికి రప్పించడానికి ఇండియన్ ఏజెన్సీస్ తీవ్రంగా ప్రయత్నించాయి. 


Updated Date - 2022-01-13T22:35:22+05:30 IST