అవిభక్త సోదరులకు విడివిడిగా ఓటు హక్కు.. ఒకరికి తెలియకుండా మరొకరు ఓటు ఎలా వేస్తారంటే..

ABN , First Publish Date - 2022-01-31T17:33:29+05:30 IST

అమృత్‌సర్‌కు చెందిన అవిభక్త సోదరులు..

అవిభక్త సోదరులకు విడివిడిగా ఓటు హక్కు.. ఒకరికి తెలియకుండా మరొకరు ఓటు ఎలా వేస్తారంటే..

అమృత్‌సర్‌కు చెందిన అవిభక్త సోదరులు సోహ్నా సింగ్, మోహ్నా సింగ్ త్వరలో తొలిసారి ఓటు వేయనున్నారు. ఫిబ్రవరి 20న పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, ఈ ఇద్దరు సోదరులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇటీవలే పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎస్ కరుణ రాజు ఈ అవిభక్త సోదరులు సోహ్నా, మోహ్నాలకు వేర్వేరుగా ఓటరు ఫోటో గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ అన్నదమ్ములిద్దరికీ గతేడాదే 18 ఏళ్లు వచ్చాయి. 


సోహ్నా, మోహ్నా అవిభక్తంగా ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం వారిని ఇద్దరు ఓటర్లుగా పరిగణించింది.  పోలింగ్ రోజున బూత్‌లోని పోలింగ్ అధికారులు.. వీరు ఓటు వేసే సమయంలో ఇద్దరూ ఒకరికొకరు కనిపించకుండా చూస్తారు. అంటే వీరిద్దరూ ఎవరెవరికి ఓటు వేస్తున్నారో ఒకరికొకరికి తెలియదు.  ఇందుకోసం వీరిద్దరి మధ్య ఒక క్లాత్ ను అడ్డుగా పెట్టనున్నారు. ఈ అవిభక్త కవల సోదరులిద్దరి గుండె వేర్వేరుగా ఉన్నప్పటికీ, పొట్ట మాత్రం ఒకటే ఉంది.  వీరి అభిరుచులు ఎంతో బిన్నంగా కనిపిస్తాయి. ఒక టీవీ షోలో వీరిలోని ఒకరు తనకు పిజ్జా ఇష్టమని, మరొకరు  తనకు దోశ ఇష్టమని తెలిపారు. సోహ్నా సింగ్, మోహ్నా సింగ్ లు ఐటీఐ చేసిన తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా కోర్సు చేసి, ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. వీరిద్దరికీ పాటలు పాడటం అంటే ఎంతో ఇష్టం.  వీరు గాయకుడు శంకర్ మహదేవన్‌ను తమ గురువుగా భావిస్తారు. వీరు జన్మించిన సమయంలో.. ఎక్కువ కాలం జీవించరని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు ఆ చిన్నారులను అమృత్‌సర్‌లోని ఒక స్వచ్ఛంద స్థంస్థలో వదిలేశారు. వారు అక్కడే ఉంటూ, తమ విద్యాభ్యాసాన్ని పూర్తిచేసి, ఉద్యోగం సంపాదించారు. 

Updated Date - 2022-01-31T17:33:29+05:30 IST