తవ్వేస్తున్నారు..!

ABN , First Publish Date - 2021-03-02T06:34:58+05:30 IST

అధికార పార్టీ అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.

తవ్వేస్తున్నారు..!
మట్టి తరలించిన అనంతరం చెరువులో ఉంచిన ఎక్స్‌కవేటర్‌

గణపవరంలో మట్టి అక్రమ రవాణా

మచిలీపట్నంలో బుసక మాఫియా

రాత్రికి రాత్రే పెద్ద ఎత్తున తరలింపు

సీఎం మేనత్త గ్రామంలో మట్టి దందా

కోన గ్రామంలో బుసక అక్రమ రవాణా

పట్టించుకోని అధికారులు


అధికార పార్టీ అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సహజ సంపదను నిలువునా దోచేస్తున్నారు. మైలవరంలో మట్టి మాఫియా, మచిలీపట్నంలో బుసక మాఫియా బరితెగిస్తోంది. పంచాయతీ ఎన్నికలు పూర్తవడంతో అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలు అక్రమ తరలింపునకు తెర తీశారు. 


మైలవరం రూరల్‌, మార్చి 1 : మైలవరం మండలం టి.గన్నవరం పటమట చెరువు, గణపవరం చెరువుల నుంచి పెద్ద ఎత్తున్న మట్టి తరలిపోతోంది. విషయం తెలిసినా అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.  


సీఎం మేనత్త గ్రామంలో మట్టి దందా

సీఎం జగన్‌ మేనత్త గ్రామమైన గణపవరంలో వైసీపీ నాయకులు మట్టి దందాకు తెరలేపారు. అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో తూర్పు చెరువు నుంచి అక్రమంగా మట్టిని ఇటుక బట్టీలకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. ఆదివారం రాత్రి పెద్ద ఎత్తున ట్రాక్టర్లను ఏర్పాటు చేసి రాత్రికి రాత్రే వేలాది ట్రక్కుల తూర్పు చెరువు మట్టిని ఇటుక బట్టీలకు అమ్మేసి లక్షలాది రూపాయలను తమ జేబుల్లో వేసుకున్నారు. గణపవరం తూర్పు చెరువు 166 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చెరువు భూమి కొంత ఆక్రమణకు గురైంది. చెరువులోని కొంతభాగంలో నీరు తక్కువగా ఉండటంతో మట్టి దోపిడీకి పూనుకున్నారు అధికార పార్టీ నాయకులు. రాత్రి వేళల్లో పెద్ద పెద్ద పొక్లెయినర్లను ఏర్పాటు చేసుకొని గణపవరం గ్రామంతో పాటు ఇతర గ్రామాల నుంచి ట్రాక్టర్లను రప్పించి, ఇటుక బట్టీల వ్యాపారులతో డీల్‌ మాట్లాడుకొని చెరువు మట్టిని అక్రమ రవాణా చేశారు. గణపవరం గ్రామ సమీపంలోని ఇటుక బట్టీలకే కాకుండా వెల్వడం, చిన్ననందిగామ ఏరియాల్లోని బట్టీలకు సైతం మట్టిని అమ్ముకుంటూ, ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును మింగేస్తున్నారు. ఇంత పెద్దఎత్తున మట్టి రవాణా జరుగుతున్నా పీడబ్ల్యూడీ, రెవెన్యూ అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి మట్టి అక్రమ రవాణాకు బ్రేకులు వేసి, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


మచిలీపట్నంలో బుసక మాఫియా

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : మచిలీపట్నంలో మూడు రోజులుగా రాత్రివేళల్లో యథేచ్ఛగా బుసకను టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. జాతీయ రహదారులకు బుసకను తరలిస్తున్నామని చెబుతున్నా, రహదారులకు సంబంధించి మట్టిపనులేవీ ఈ ప్రాంతంలో జరగడంలేదు. ఈ వ్యవహారం మొత్తం అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతోందని, అధికారపార్టీ నాయకులే చెప్పడం గమనార్హం. 


స్పందనలో ఫిర్యాదులు 

బందరు మండలం కోన పంచాయతీలోని ప్రభుత్వ భూముల నుంచి మూడు రోజులుగా రాత్రివేళల్లో టిప్పర్ల ద్వారా బుసకను తరలిస్తున్నారని కోన గ్రామస్థులు ఆర్డీవో ఖాజావలికి,  తహసీల్దారు సునీల్‌బాబుకు ఫిర్యాదు చేశారు. అయినా బుసక రవాణాకు అడ్డుకట్ట వేయకపోవడం గమనార్హం. తహసీల్దారు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తే, బుసక రవాణాకు భూగర్భ గనులశాఖ అనుమతులు ఇచ్చిందని చెప్పారని గ్రామస్థులు అంటున్నారు. భూగర్భ గనుల శాఖ విజయవాడ అధికారులకు ఫోన్‌ చేస్తే, ఆ గ్రామం నుంచి బుసక రవాణాకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారని, ఇదే విషయాన్ని తహసీల్దార్‌ దృష్టికి తీసుకువెళితే, ‘అనేక రకాల అనుమతులు వస్తూ ఉంటాయి, వివరాలన్నీ మీకు చెప్పాలా?’ అని మండిపడుతున్నారని చెబుతున్నారు. దీంతో గ్రామస్థులు సోమవారం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. 


రూ. కోట్లలో వ్యాపారం 

  ప్రతి వేసవిలోనూ ప్రభుత్వ భూముల నుంచి బుసకను అక్రమంగా తరలించి, కోట్లాది రూపాయలు వెనకేసుకోవడం అధికారపార్టీ నాయకులకు అలవాటుగా మారిందనే విమర్శలు బాహాటంగానే వినవస్తున్నాయి. ఒక్కో టిప్పరు బుసకనురూ.3వేలకు విక్రయిస్తున్నారని, రోజూ వందలాది టిప్పర్ల బుసకను తరలించుకు పోతున్నారని, ఇదంతా అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోందనిగ్రామస్థులు ఆరోపిస్తున్నారు.



Updated Date - 2021-03-02T06:34:58+05:30 IST