భూసారం తెలిసేదెలా?

ABN , First Publish Date - 2022-05-17T05:09:32+05:30 IST

పంటమార్పిడి విధానంతో రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వంతో పాటు నిపుణులు సూచిస్తుంటారు.

భూసారం తెలిసేదెలా?

అటకెక్కిన భూసార పరీక్షలు

రెండేళ్లుగా విస్మరించిన ప్రభుత్వం

కేంద్రాలకు నిధుల కొరత, సిబ్బంది లేమి

నేలల తీరు తెలియక నష్టపోతున్న రైతన్నలు

రైతుభరోసా కేంద్రాల్లో పరీక్షలంటూ హడావిడి


 భూసార పరీక్షలు.. రైతులకు ఎంతో అవసరం. భూముల తీరు తెలుసుకుని వాటికి అనుగుణంగా పంటలు సాగు వేసుకునే అవకాశం ఈ పరీక్షల ద్వారా రైతులకు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో ఎక్కడికక్కడ భూసార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటికి లక్ష్యాలను నిర్దేశించి రైతుల వారీగా భూసార పరీక్షలు చేసి వాటి ఫలితాలను అందజేసేవారు.  అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ కేంద్రాలకు నిధుల విడుదలను విస్మరించింది. సిబ్బందిని డిప్యూటేషన్‌పై పంపేసింది. దీంతో ఆయా కేంద్రాలు అలంకారప్రాయంగా మిగలగా పరీక్షా ఫలితలు దుమ్ముకొట్టుకుపోతున్నాయి. ఇక ఆర్బీకేల్లోనే భూసార పరీక్షలంటూ చేసిన ప్రచారం ప్రకటలనకే పరిమితమైంది. దీంతో రైతులకు భూసారం గురించి తెలియక ఏ పోషకాలు వాడాలో.. ఏ పంటలు వేయాలో అర్థంకాక నష్టపోతున్నారు. 


బాపట్ల, మే 16 (ఆంధ్రజ్యోతి): పంటమార్పిడి విధానంతో రైతులకు మేలు జరుగుతుందని ప్రభుత్వంతో పాటు నిపుణులు సూచిస్తుంటారు.  అయితే ఏ నేలకు ఏది అనుకూలమో తెలిస్తేనే రైతులు ఆ బాటపడతారు. ఇందుకు మట్టి పరీక్షలు జరిపి వాటి ఫలితాలు అవసరం. ఇంతటి కీలకమైన భూసార పరీక్షలను ప్రభుత్వం అటకెక్కించింది. దాదాపు రెండేళ్ల నుంచి ప్రభుత్వం భూసార పరీక్షా కేంద్రాల నిర్వహణకు కనీస నిధులు కూడా ఇవ్వడంలేదు. మరోవైపు ఉన్న సిబ్బందిని డిప్యుటేషన్‌పై వేరే విభాగాలకు పంపించింది. దీంతో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఆయా కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. ఆయా కేంద్రాల్లో ఉన్న విలువైన పరికరాలు సైతం దుమ్ము కొట్టుకుపోయి నిరుపయోగంగా మారిపోతున్నాయి. రైతులు మట్టి నమూనాలు తీసుకుని జిల్లా కేంద్రానికి వచ్చినా అక్కడ పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. దీంతో రైతులు మట్టికి సరిపడని పంట వైపు మొగ్గి ఆశించిన దిగుబడి రాక ఆర్థికంగా కుదేలైపోతున్నాడు. వేలకోట్లను రైతుల సంక్షేమానికి ఖర్చు పెడుతున్నామని చెప్పుకునే ప్రభుత్వం కనీసం భూసార పరీక్షలను కూడా చేయకపోవడం రైతుల పట్ల నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


గత ప్రభుత్వంలో విధిగా పరీక్షలు

గత ప్రభుత్వం భూసార పరీక్షలకు అధిక ప్రాధాన్యమిచ్చేది. ఏప్రిల్‌ 15లోగా సిబ్బంది మట్టి నమూనాలు సేకరించి ప్రయోగశాలలకు పంపి మే 15లోగా ఫలితాలను రైతులకు వివరించేవారు. ల్యాబ్‌కు ఇన్ని పరీక్షలు చేయాలనే లక్ష్యాన్ని సైతం గతంలో నిర్దేశించేవారు. ఆ ప్రకారం రైతులకు సకాలంలో పరీక్షా ఫలితాలు చేతికొచ్చేవి. వాటికి అనుగుణంగా ఖరీఫ్‌ సాగు ప్రణాళికలు రచించుకునేవారు. ఇంతటి ప్రాధాన్య అంశానికి సంబంధించిన పరీక్షలపై ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. కనీస నిధులు కూడా భూసార పరీక్ష కేంద్రాలకు ప్రభుత్వం విడుదల చేయడంలేదు. దీంతో ఈ కేంద్రాలు కునారిల్లుతున్నాయి. వాటిల్లో సిబ్బందే అంతంతమాత్రంగా ఉన్నారు. ఉన్నవారిని కూడా డిప్యుటేషన్‌పై వేరే విభాగానికి పంపడంతో అవి అలంకారప్రాయంగా మారిపోయాయి. రైతుభరోసా కేంద్రాల్లో పరీక్షలంటూ ప్రభుత్వం చేస్తున్న హడివిడి ప్రకటనలకే పరిమితం తప్ప క్షేత్రస్థాయిలో అవి జరుగుతన్న దాఖలాలే లేవు.


పరీక్షలు ప్రయోజనాలు 

పరీక్షల ద్వారా ఆయా నేలల తత్వం తెలుస్తుంది. ఏ పంటలకు సానుకూలం అనే విషయం ఆయా పరీక్షల ద్వారా తెలిసేది. పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్‌ ఇతరత్రా ఆ భూమిలో ఎంత మోతాదులో ఉన్న విషయం రైతులకు తెలిసేది. తద్వారా భూమిలో లోపించిన పోషకాలను రైతు వాడి దిగుబడులు పెంచుకోవడానికి అవకాశం కలిగేది. ఏ పంటలు వేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయో కూడా తెలిసేది. కొన్ని పంటలకు కొన్ని నేలలు స్వర్గధామంగా ఉంటాయి. అలాంటి విషయాలు కూడా పరీక్షల ద్వారా బహిర్గతమై రైతులకు ఉపయుక్తంగా ఉండేది.


ఏజీ కళాశాలలో భూసార పరీక్ష కేంద్రం

బాపట్లలోని ఏజీ కళాశాలలో భూసార పరీక్ష కేంద్రం ఉంది. దాని ఆలనాపాలనా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. పరీక్షల సంగతి దేవుడెరుగు అసలు ఆ కార్యాలయం మనుగడలో  లేనట్టు  దాని పరిసర ప్రాంతాలు ఉన్నాయి. ఇదే విషయమై ఏడీఏను వివరణ కోరగా సాంకేతిక సిబ్బంది త్వరలోనే వస్తారని పరీక్షలు మొదలవుతాయని తెలిపారు.


 

Updated Date - 2022-05-17T05:09:32+05:30 IST