సాగర్‌కు ‘సౌర’ శోభ

ABN , First Publish Date - 2021-01-24T05:33:43+05:30 IST

ప్రముఖ పర్యాటక కేంద్రం బ్రహ్మంగారిమఠంలో ఉన్న బ్రహ్మంసాగర్‌ ఇక సోలార్‌ శోభను సంతరించుకోనుంది. తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్‌లో తేలియాడే సోలార్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది.

సాగర్‌కు ‘సౌర’ శోభ
బ్రహ్మంసాగర్‌

నీటిలో తేలియాడే సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వ కృషి

మరింత  పర్యాటక ప్రాధాన్యం సంతరించుకోనున్న బ్రహ్మంసాగర్‌ 

బద్వేలు, జనవరి 23: ప్రముఖ పర్యాటక కేంద్రం బ్రహ్మంగారిమఠంలో ఉన్న బ్రహ్మంసాగర్‌ ఇక సోలార్‌ శోభను సంతరించుకోనుంది. తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్‌లో తేలియాడే సోలార్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది. భూమిపైన ఏర్పాటు చేసిన సోలార్‌ ప్లాంట్‌ కాకుండా ప్రతిష్టాత్మకమైన నీటిలో తేలియాడే ప్లాంటు ఏర్పాటుకు బ్రహ్మంసాగర్‌ను గుర్తించారు. వీటిని దేశంలో మొదటిసారి గ్రేటర్‌ విశాఖ, స్మార్ట్‌ సిటీ కార్పొరేషనలో ఉన్న మధుసార వలస రిజర్వాయర్‌లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఈ తరహా ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టిపెట్టిన ప్రభుత్వం బ్రహ్మంసాగర్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 


1206 ఎకరాలలో తేలియాడే ప్లాంటు 

బ్రహ్మంసాగర్‌ జలాశయంలో 1206 ఎకరాల విస్తీర్ణంలో తేలియాడే సోలార్‌ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రాజెక్టు  ఏర్పాటైతే పర్యాటకపరంగా బ్రహ్మంసాగర్‌ ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటుంది. నీటిలో తేలియాడే సోలార్‌ పలకలు నీటి జడులకు  మునగడం, తేలడం లాంటి పరిస్థితులకు దెబ్బతినకుండా అధునాతన సాంకేతికతతో ఏర్పాటు చేస్తున్నారు. సోలార్‌ పలకలు పక్కకు జరగకుండా సిమెంటు దిమ్మెలు ఏర్పాటు చేసి అక్కడే  అవి సంకోచం, వ్యాకోచం చెందేలా ఏర్పాటు చేస్తారు. దీంతో నీటి స్థితిని బట్టి కిందకు పైకి సంకోచం, వ్యాకోచం చెందుతూ అమర్చిన చోటే తేలియాడుతుంటాయి. దీంతో విద్యుత ఉత్పత్తి కావడమే కాకుండా జలాశయంలో నీరు ఆవిరికాకుండా ఉపయోగపడుతుంది. 1206 ఎకరాలలో ఈ ప్లాంటు ఏర్పాటు చేస్తే 252 మెగావాట్ల సోలార్‌ విద్యుత ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. కాగా మండలంలో మరోచోట 2886 ఎకరాల భూమిపై సోలార్‌ ప్లాంటు ఏర్పాటు చేయనుంది. జిల్లాలో సోలార్‌ విద్యుతకు ఎక్కువ అవకాశాలు ఉండడంతో వీటి ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం మఠం మండలంతో పాటు బద్వేలు నియోజకవర్గంలోని కలసపాడు మండలంలో 3750 ఎకరాలలో సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు సంకల్పించింది. ఈ రెండు  సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు అయితే బద్వేలు  ప్రాంతంలో సోలార్‌ వెలుగులు విరబూస్తాయి. 

Updated Date - 2021-01-24T05:33:43+05:30 IST