భద్రాద్రి రామాలయానికి సోలార్‌ వెలుగులు

ABN , First Publish Date - 2021-01-22T05:19:44+05:30 IST

భద్రాద్రి రామాలయానికి సోలార్‌ వెలుగుల కోసం దశాబ్ధకాలనికి పైగా ఎదురుచూస్తున్న తరుణం త్వరలో అది సాకారమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రి దేవస్థానం, కాటేజీలు, సత్రాలకు సోలార్‌ సొబగులు సమకూరేందుకు రంగం సిద్ధమవుతోంది.

భద్రాద్రి రామాలయానికి సోలార్‌ వెలుగులు
విద్యుత్‌ దీపాల వెలుగులో భద్రాద్రి రామాలయం(ఫైల్‌)

దేవదాయశాఖ కమిషనర్‌కు చేరిన ప్రతిపాదనలు 

ప్రభుత్వ ఆమోదమే తరువాయి 

భద్రాచలం, జనవరి 21: భద్రాద్రి రామాలయానికి సోలార్‌ వెలుగుల కోసం దశాబ్ధకాలనికి పైగా ఎదురుచూస్తున్న తరుణం త్వరలో అది సాకారమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రి దేవస్థానం, కాటేజీలు, సత్రాలకు సోలార్‌ సొబగులు సమకూరేందుకు రంగం సిద్ధమవుతోంది. దేవస్థానానికి విద్యుత్‌ బిల్లులు ఆర్థికభారంగా మారిన  నేపధ్యంలో రెండు నెలల క్రితం దేవస్థానం అధికారులు సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌కు పంపారు. 400 కిలోవాట్స్‌ సామర్ధ్యంతో రామాలయం దేవస్థానం కాటేజీలు, సత్రాలు అన్నింటికి సరిపోయేలా సోలార్‌ వెలుగులను ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులు సంకల్పించారు. అయితే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కమిషనర్‌కు చేరడం ఆయన సానుకూలంగా స్పందించడంతో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కమిషనర్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వద్దకు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. దేవాదాయ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ సైతం ఈ ప్రతిపాదనలు ప్రభుత్వం ఆమోదించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. దేవస్థానం ప్రతిపాదనలు ప్రభుత్వ ఆమోదం పొందితే దేవస్థానానికి విద్యుత్‌ బిల్లుల భారం తప్పే అవకాశముంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం కనీసం ఈ ప్రతిపాదనలైనా సాధ్యమైనంత త్వరగా ఆమోదించాలని భక్తులు కోరుతున్నారు.  

ఏటా రూ.కోటి మాటే 

భద్రాద్రి దేవస్థానానికి ప్రతి ఏటా విద్యుత్‌ బిల్లుల రూపేణ రూ.కోటి వరకు ఖర్చవుతోందని దేవస్థానం అధికారులు పేర్కొంటున్నారు. భద్రాద్రి రామాలయం కేటగిరీ-2లో ఉండగా దీంతో రూ.4 నుంచి రూ.5 మధ్య యూనిట్‌కు చెల్లించాల్సి వస్తోంది. అయితే దేవస్థానానికి చెందిన కాటేజీలు, సత్రాలు కమర్షిల్‌ కేటగిరీలో ఉండటంతో యూనిట్‌కు రూ.9వరకు చెల్లించాల్సి వస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో విద్యుత్‌ బిల్లులు భారీగా వస్తుండడంతో దేవస్థానానికి ఆర్థిక భారం పడుతోంది.  

రూ.30 లక్షల వరకు ఆదా అయ్యే అవకాశం

సోలార్‌ ప్రతిపాదన ఆమోదం పొందితే భద్రాద్రి దేవస్థానానికి ఏటా రూ.30 లక్షల వరకు విద్యుత్‌ బిల్లు ఆదా అయ్యేఅవకాశం ఉందని

తెలుస్తోంది. సోలార్‌ యూనిట్‌కు రూ.5.20 చొప్పున పడే అవకాశం ఉండటంతో విద్యుత్‌ భారం చాలా వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్తులో నిర్మించే కాటేజీలు, సత్రాలకు సైతం ఇదే రీతిలో సోలార్‌ విద్యుత్‌ను వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు.  

ప్రభుత్వ ఆమోదంకోసం ఎదురుచూస్తున్నాం

బి.శివాజీ, భద్రాద్రి దేవస్థానం ఈవో 

భద్రాద్రి దేవస్థానం అధికారులు సోలార్‌ విద్యుత్‌ను వినియోగించేందుకు చేపట్టిన ప్రతిపాదనలు రెండు నెలల క్రితం కమిషనర్‌కు పంపాం. అక్కడినుంచి ఆ ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే దేవస్థానానికి ఆర్థికభారం చాలా వరకు తగ్గుతుంది. నేను బాధ్యతలు చేపట్టిన అనంతరం విద్యుత్‌ వృథాను ఎంతగానో నియంత్రించాం.  


Updated Date - 2021-01-22T05:19:44+05:30 IST