సర్కారుకు ‘సోలార్‌’ షాక్‌

ABN , First Publish Date - 2021-06-18T07:48:03+05:30 IST

సర్కారు వారి ‘శ్రుతి మించిన సోలార్‌ కలల’పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నీళ్లు చల్లింది. 6400 మెగా సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు గత నవంబరులో పిలిచిన టెండర్లను రద్దు చేసింది

సర్కారుకు ‘సోలార్‌’ షాక్‌

6400 మెగావాట్ల టెండర్లు రద్దు

మళ్లీ టెండర్లు పిలవాలి.. పీపీఏ నిబంధనలూ మార్చాలి.. హైకోర్టు సంచలన తీర్పు

కేంద్ర చట్టానికి విరుద్ధంగా నిబంధనలు

హైకోర్టును ఆశ్రయించిన ‘టాటా’

సోలార్‌ పవర్‌పై ప్లేటు తిప్పిన జగన్‌ 

అంత విద్యుత్తు ఎందుకని తొలుత ప్రశ్న

పాతికేళ్లకు ఒప్పందాలపైనా ధ్వజం

తర్వాత  భారీగా సోలార్‌ పవర్‌కు టెండర్లు

పీపీఏల గడువు 30 ఏళ్లకు పొడిగింపు


  • వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు సరఫరా కోసం 6400 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్‌ పవర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని జగన్‌ ప్రభుత్వం తెలిపింది. కానీ... టెండర్లలో కేంద్ర విద్యుత్‌ చట్టాలను తోసిరాజని, సొంత నిబంధనలు పొందుపరిచారు!
  • వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి భారీ ప్రాజెక్టు ఇదే. న్యాయ సమీక్ష చేసిన తర్వాతే టెండర్లను పిలుస్తున్నామని ప్రభుత్వం పదేపదే చెప్పింది. అయినా... ఈ టెండర్లు కోర్టు పరిశీలనలో నిలవలేకపోయాయి. 
  • ‘పవన విద్యుత్తు, సోలార్‌ పవర్‌ ఇంత ఎందుకు? బుద్ధి ఉన్నవాళ్లెవరైనా పాతికేళ్లకు పీపీఏలు కుదుర్చుకుంటారా’ అని ధ్వజమెత్తిన జగన్‌, ఆ తర్వాత ఏకంగా 6400 మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. పీపీఏల గడువును 30 ఏళ్లకు పెంచారు.
  • 6400 మెగావాట్ల సామర్థ్యంలో దాదాపు 80% ప్లాంట్ల టెండర్లు అదానీ గ్రూప్‌, షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌ అనే రెండు కంపెనీలకే దక్కాయి. రాష్ట్రంలో కృష్ణపట్నం, గంగవరం పోర్టులను దక్కించుకున్న అదానీకి... సోలార్‌ పవర్‌ టెండర్ల విషయంలో ఇప్పుడు షాక్‌ తగిలింది.


అమరావతి, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): సర్కారు వారి ‘శ్రుతి మించిన సోలార్‌ కలల’పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నీళ్లు చల్లింది. 6400 మెగా సోలార్‌ పవర్‌ ప్లాంట్ల ఏర్పాటుకు గత నవంబరులో పిలిచిన టెండర్లను రద్దు చేసింది. తాజాగా టెండర్లు పిలవాలని తేల్చి చెప్పింది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను సైతం తాజాగా రూపొందించాలని ఆదేశించింది.  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు గురువారం ఈ కీలక తీర్పు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి విద్యుత్‌ అందించేందుకు 6400 మెగావాట్ల సామర్థ్యంతో  సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని గతంలో సర్కారు ప్రకటించింది. దీనికోసం ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌  టెండర్లు పిలిచింది. అయితే... ఇందులో కొన్ని కీలకమైన నిబంధనలను తమకు ‘ఇష్టం’ వచ్చినట్లుగా రూపొందించారు. ప్రభుత్వానికీ, ఉత్పత్తి సంస్థకూ మధ్య వివాదాలు తలెత్తితే... దానిని స్వయంప్రతిపత్తి ఉన్న విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ (ఈఆర్సీ) పరిష్కరించాలని కేంద్ర విద్యుత్‌ చట్టం-2003 చెబుతోంది. కానీ... రాష్ట్ర ప్రభుత్వం ఆ అధికారాన్ని తానే అట్టిపెట్టుకుంది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల నిబంధనలను కూడా మార్చేసింది. దీంతో... రిక్వెస్ట్‌ ఫర్‌ సెలక్షన్‌ (ఆర్‌ఎ్‌ఫఎస్‌), ముసాయిదా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం నిబంధనలు కేంద్ర విద్యుత్‌ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయంటూ టాటా పవర్‌ రెన్యూవబల్‌ ఎనర్జీ సంస్థ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. టెండర్లను రద్దు చేసి మళ్లీ పిలవాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాదులు డి.ప్రకాశ్‌ రెడ్డి, కిలారు నితిన్‌ కృష్ణ వాదనలు వినిపించారు. విద్యుత్‌ చట్టంలోని సెక్షన్‌ 63కు విరుద్ధమైన నిబంధనలు విధించారన్నారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల నిబంధనలు కూడా కేంద్ర ఇంధన శాఖ 2017 ఆగస్టు 3న జారీ చేసిన బిడ్డింగ్‌ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపిస్తూ...రైతుల ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందన్నారు. టెండర్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ వ్యాజ్యం దాఖలు చేయడం సరికాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జీ ఇటీవల తీర్పును రిజర్వ్‌ చేసి...గురువారం  వెల్లడించారు.


తొలుత వద్దని... ఆపై వద్దన్నా ముందుకు వెళ్లి!

ఎన్ని విమర్శలు వచ్చినా లెక్క చేయకుండా భారీగా సౌర విద్యుత్‌ ఉత్పత్తికి ముందుకు వెళ్లిన సర్కారుకు ఇప్పుడు షాక్‌ తగిలింది. సోలార్‌ పవర్‌పై జగన్‌ విపక్షంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో ప్రదర్శించిన వైఖరిని తర్వాత పక్కనపెట్టారు. గత టీడీపీ ప్రభుత్వం అనవసరంగా సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తిని ప్రోత్సహించిందని, అవసరానికి మించి వాటి ఉత్పత్తిని ఆమోదించి రాష్ట్రంపై భారం మోపిందని ముఖ్యమంత్రి అయిన కొత్తలో జగన్‌ విమర్శలు గుప్పించారు. తర్వాత ఏకంగా 6400 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించి టెండర్లు పిలిచారు. ఇందులోనే రాష్ట్ర ప్రభుత్వం మరో వెసులుబాటు కూడా కల్పించింది. టెండర్‌ దక్కించుకొన్న వారు అదే ధరకు మరో 50 శాతం అదనపు సామర్థ్యంతో ప్రాజెక్టులు పెట్టుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. అంటే, ఈ టెండర్ల ద్వారా ఏకంగా ఒకేసారి పది వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తికి తలుపులు తెరిచినట్లయింది.  దీనిపై విద్యుత్‌ ఇంజనీర్ల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో ప్రస్తుతమున్న విద్యుత్‌ వాడకానికి రెట్టింపు స్థాయిలో కొనుగోలు ఒప్పందాలు కుదిరాయని... మళ్లీ కొత్తగా 6400 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తికి అనుమతించి, కొనుగోలు చేస్తే అమితమైన భారం పడుతుందని తెలిపాయి. 


గత ప్రభుత్వం పాతికేళ్ల వ్యవధికి కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకుందంటూ తూర్పారబట్టిన జగన్‌... ఈ టెండర్లలో కొనుగోలు ఒప్పందాల వ్యవధిని ఏకంగా 30 ఏళ్లు చేశారు. టెండరుకు ప్రతిస్పందనగా ఐదు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. ఇందులో అదానీ గ్రూప్‌, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థలే దాదాపు 80 శాతం సామర్థ్యం మేరకు ప్లాంట్లను దక్కించుకున్నాయి. సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో ఏమాత్రం అనుభవం లేని షిర్డి సాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థ వేల కోట్ల మెగావాట్ల మేర సౌర విద్యుత్‌ ఉత్పత్తికి ఎంపిక కావడం పారిశ్రామికవర్గాలను విస్మయపరిచింది.

Updated Date - 2021-06-18T07:48:03+05:30 IST