రూ.అర కోటి స్థలాన్ని అమ్మేశారు

ABN , First Publish Date - 2022-10-04T04:40:01+05:30 IST

అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు రూ.అర కోటి విలువైన స్థలాన్ని కాజేశారు.

రూ.అర కోటి స్థలాన్ని అమ్మేశారు
మాయ చేసి అమ్మిన స్థలం

స్థల యజమాని పేరిట ఆధార్‌ సృష్టించి తతంగం

అనుచరుడి పేరిట రిజిస్ట్రేషన.. మరొకరికి విక్రయం

అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల మోసం

రిజిస్ట్రేషన ప్రక్రియలో రూ.3 లక్షల లంచం..?

పోలీసులను ఆశ్రయించిన బాధితులు

 అనంతపురం రూరల్‌, అక్టోబరు 3: అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు రూ.అర కోటి విలువైన స్థలాన్ని కాజేశారు. స్థల యజమానికి తెలియకుండా.. అదే పేరుతో ఉన్న వ్యక్తి ఆధార్‌ కార్డును ఉపయోగించి.. రిజిస్ట్రేషన తతంగం ముగించారు. ఆ తరువాత మరొకరికి అమ్మేశారు. రిజిస్టర్డ్‌ స్థలం కదా.. ఎక్కడికి పోతుందిలే అని అటువైపు చూడని స్థల యజమానికి విషయం తెలిసి.. పోలీసులను ఆశ్రయించాడు. స్పందనలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ ఘరానా మోసం చేసిన ఆ ఇద్దరు, సహకరించినవారు తప్పించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని తెలిసింది.


ఎవరూ రాలేదని..


అనంతపురం రూరల్‌ మండలం రాచానపల్లి పొలం సర్వే నెంబరు 196లో కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన బి. వెంకటేశులు అనే వ్యక్తి 1989లో, నాటి మార్కెట్‌ విలువ ప్రకారం నాలుగు సెంట్ల స్థలం కొనుగోలు చేశాడు. ఆ స్థలం పత్రాలను అనంతపురం పాతూరులోని సమీప బంధువు ఇంట్లోనే భద్రపరిచాడు. రిజిస్ట్రేషన అయినందున, ఎవరొస్తారులే అనుకుని, ఏళ్ల తరబడి ఆ స్థలంలోకి వెళ్లలేదు. దీంతో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల కన్ను ఆ స్థలంపై పడింది. గుట్టుచప్పుడు కాకుండా, అదేపేరుతో ఆధార్‌ సృష్టించి, స్థలాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నారు. కొనుగోలు చేసిన వ్యక్తి, ఆ స్థలానికి ప్రహారీ ఏర్పాటు చేసి, షెడ్డు కూడా నిర్మించాడు. 


ఇలా బయట పడింది..


విలువైన స్థలాన్ని కాజేసిన విషయం అక్కంపల్లికి చెందిన ఓ వ్యక్తికి తెలిసింది. ఆ తరువాత ఆ నోటా.. ఈ నోట కళ్యాణదుర్గం రోడ్డులోని రియల్‌ వ్యాపారులకు చేరింది. చివరకు కళ్యాణదుర్గంలో ఉంటున్న స్థల యజమానికి చెవిన పడింది. దీంతో బాధితుడు వెంటనే స్థానిక ఆర్యవైశ్య సంఘం నాయకులను ఆశ్రయించాడు. నగరంలోని తన సమీప బంధువు, సంఘం నాయకులతో కలసి స్పందనలో పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలిసింది. 


బేరం కుదిర్చిన కార్పొరేటర్‌ భర్త?


స్థలం రిజిస్ట్రేషన వ్యవహారం సాఫీగా సాగేందుకు నగరానికి చెందిన ఓ కార్పొరేటర్‌ భర్త ‘సాయం’ చేసినట్లు తెలిసింది. రిజిస్ట్రేషన ప్రక్రియలో పీట్ల వెంకటేశులు ఈకేవైసీ మ్యాచ అయినా, ఫొటో నాట్‌ అవైలబుల్‌ అని రావడంతో రిజిస్ట్రేషనకు అడ్డంకులు ఎదురైనట్లు తెలిసింది. దీంతో అధికారులకు, ఆ నాయకులకు కార్పొరేటర్‌ భర్త బేరం కుదిర్చి, రిజిస్ట్రేషన ప్రక్రియను పూర్తి చేయించారని తెలిసింది. ఇందుకు రిజిస్ట్రేషన శాఖ అధికారులకు రూ.3 లక్షలకు పైగానే ముట్టచెప్పిట్లు సమాచారం. 


సెటిల్‌మెంట్‌ దిశగా..


   ఘరానా మోసం వ్యవహారం పోలీసుల దృష్టికి వెళ్లడంతో, ఇద్దరు నాయకులు సెటిల్‌మెంట్‌కు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులలో ఒకరి వద్దకు వెళ్లి, విషయాన్ని తెలియజేశారని సమాచారం. దీంతో ‘సామరస్యంగా సెటిల్‌ చేయండి..’ అని ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు పోలీసులకు సూచించినట్లు రియల్‌ వ్యాపారుల్లో చర్చ జరుగుతోంది. పోలీసులు కూడా చడీచప్పుడు కాకుండా స్థల యజమానిని స్టేషనకు రమన్నట్లు తెలుస్తోంది. స్థల యజమానికి స్థానికంగా ఓ మాజీ కౌన్సిలర్‌ అండగా నిలిచారని సమాచారం. స్థల యజమాని ఒంటరిగా రారనీ, తాను వస్తేనే అతను వస్తాడని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. దసరా ఉత్సవాల్లో ఉన్నామని, పండుగ తరువాత కలుస్తామని పోలీసులకు చెప్పినట్లు రియల్‌ వ్యాపారులు అంటున్నారు.


ఆధార్‌ సృష్టించి.. 


  స్థల యజమాని పేరు బి. వెంకటేశులు, తండ్రిపేరు సీతారాములు. విషయం తెలుసుకున్న కక్కలపల్లి కాలనీ పంచాయతీ పరిధిలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు, అక్కంపల్లి పంచాయతీలోని ఓ గ్రామ ప్రజాప్రతినిధి భర్త స్థలాన్ని కాజేసేందుకు కుట్రపన్నారు. వీరిలో ఒకరు అదే పేరు (ఇంటి పేరు వేరు) గల తన సమీప బంధువు వేంకటేశులు పేరిట ఆధార్‌ సృష్టించారు. పేరు, ప్రాంతం ఒక్కటే కావడంతో పని సులువుగా కానిచేశ్చారు. ఈ ఏడాది మార్చి 21న ఆ ఇద్దరు నాయకుల్లో ఒకరు.. తన అనుచరుడికి స్థలాన్ని విక్రయించినట్లు రిజిస్ట్రేషన చేయించారు. ఆ తరువాత తమ అనుచరుడి ద్వారా పామిడి మండలం తంబళ్ళపల్లి గ్రామానికి చెందిన మరో వ్యక్తికి  జూన 4న విక్రయించి, రిజిస్ట్రేషన చేయించారు. సుమారు రూ.53 లక్షలకు అమ్మేశారని, ఈ వ్యవహారంలో పావులుగా మారిన ఇద్దరికీ చెరో రూ.లక్ష ఇచ్చారని సమాచారం. రెండోసారి రిజిస్ట్రేషన చేసిన సమయంలో, ఆ ఇద్దరు నాయకులు సాక్షులుగా వ్యవహరించడం గమనార్హం. 





Updated Date - 2022-10-04T04:40:01+05:30 IST