సోలో అమ్మీ’.. కమనీయం సుమీ!

ABN , First Publish Date - 2022-06-10T09:30:31+05:30 IST

పెళ్లి పీటలు.. కాదు కాదు పెళ్లిపీటే! దాని మీద వధువు. తనకు తానే మెడలో పూలదండను వేసుకొని సిగ్గుల మొగ్గయింది..

సోలో అమ్మీ’.. కమనీయం సుమీ!

ముహూర్తానికి ముందే క్షమాబిందు స్వీయ వివాహం  

అహ్మదాబాద్‌, జూన్‌ 9: పెళ్లి పీటలు.. కాదు కాదు  పెళ్లిపీటే! దాని మీద వధువు. తనకు తానే మెడలో పూలదండను వేసుకొని సిగ్గుల మొగ్గయింది.. నుదుటికి సిందూరాన్నీ తానే దిద్దుకుని మురిసిపోయింది. హోమం చుట్టు కూడా ఒక్కత్తే ఏడడుగులూ నడిచింది. ఎందుకంటే ఈ పెళ్లిలో ఆమే వధువు.. వరుడూనూ!! మనదేశంలో మునుపెన్నడూ కనీవినీ ఎరుగని స్వీయ వివాహం (సోలోగమీ) గురించే ఇదంతా. ముందుగానే చెప్పినట్లుగా క్షమాబిందు తనను తానే వివాహం చేసుకున్నారు. ఒంటరిగానే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గుజరాత్‌ వడోదరకు చెందిన ఈ 24 ఏళ్ల సోషియాలజీ గ్రాడ్యుయేట్‌ గురువారం తనను తానే పెళ్లాడారు. వరుడు తప్ప.. వివాహంలో జరగాల్సిన అన్ని కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. స్నేహితులంతా వేడుకగా ఆమెకు హల్దీ, మహందీ కార్యక్రమాలు నిర్వహించారు. వాస్తవానికి తన స్వీయ వివాహం ఓ ఆలయ వేదికగా 11న జరుగుతుందని క్షమాబిందు ప్రకటించారు. దీనిపై స్థానిక బీజేపీ నేత ఒకరు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వీయ వివాహం అనేది హిందూ సంప్రదాయానికి విరుద్ధమని, ఆమె వివాహాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో ముహూర్తానికి ముందే ఆమె ఇలా పెళ్లి చేసుకున్నారు.

Updated Date - 2022-06-10T09:30:31+05:30 IST