అర్జీలు సత్వరమే పరిష్కరించండి

ABN , First Publish Date - 2022-06-28T06:37:30+05:30 IST

కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందనకు నగరంతోపాటు గాజువాక, పెందుర్తి, మధురవాడ, ఆనందపురం, భీమిలి తదితర ప్రాంతాల నుంచి పలువురు హాజరయ్యారు.

అర్జీలు సత్వరమే పరిష్కరించండి
ధర్నాలో పాల్గొన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్‌లు

స్పందనలో అర్జీదారుల వినతి

విశాఖపట్నం, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందనకు నగరంతోపాటు గాజువాక, పెందుర్తి, మధురవాడ, ఆనందపురం, భీమిలి తదితర ప్రాంతాల నుంచి పలువురు హాజరయ్యారు. వివిధ సమస్యలపై అర్జీలతో వచ్చి అధికారులకు వినతులు సమర్పించారు. జాయింట్‌ కలెక్టర్‌ కేఎస్‌ విశ్వనాథ్‌, డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఎస్డీసీలు రంగయ్య, అనిత, జీవీఎంసీ అడిషినల్‌ కమిషనర్‌ రమణి హాజరై వినతులు స్వీకరించారు. మొత్తం 190 వినతులు అందాయి. అర్జీలు సమర్పించే వారు తక్కువగా రావడంతో మధ్యాహ్నం ఒంటిగంటకు స్పందన ముగించారు. ఈ సందర్భంగా జేసీ విశ్వనాథ్‌ మాట్లాడుతూ  ప్రజల వినతులు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. పెండింగ్‌కు గల కారణాలను గుర్తించాలన్నారు. కాగా స్పందనకు వచ్చిన వాటిలో ముఖ్యమైనవి..

-- వచ్చేనెల ఒకటో తేదీ నుంచి అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం అందించనున్నందున అందుకు తగిన విధంగా పాత్రలు, గ్యాస్‌, మెనూ చార్జీలకు అడ్వాన్స్‌లు చెల్లించాలని కోరుతూ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ కలెక్టరేట్‌లో ధర్నా నిర్వహించి అనంతరం జేసీకి వినతిపత్రం అందజేశారు. గర్భిణులు, బాలింతలకు రోజుకు ఒక్కరికి 125 గ్రాముల బియ్యం, 16 గ్రాముల నూనె, 30 గ్రాముల కందిపప్పు, కాయగూరలు, పోపు సామాన్లకు రూ. 1.40 పైసలు, గ్యాస్‌కు రూ. 40 పైసలు ఇస్తున్నారని, ఈ మొత్తం సరిపోవని పేర్కొంటూ చార్జీలు పెంచాలని కోరారు. ధర్నాలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షురాలు పి.మణి, అధ్యక్షురాలు తులసి, కార్యదర్శి ఎల్‌.దేవి పాల్గొన్నారు. 

-ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా వేలాది చెట్లు కొట్టి పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని 22వ వార్డు జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ వినతిపత్రం అందజేశారు. ఇంకా ఎండాడలో హయగ్రీవా డెవలపర్స్‌లో వృద్ధాశ్రమం, అన్నదాన ఆశ్రమం ఏర్పాటులో సదరు సంస్థ విఫలమైందని జేసీకి ఫిర్యాదు చేశారు. హయగ్రీవకు ఇచ్చిన స్థలాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరారు. 

-- తగరపువలసలో తాతా థియేటర్‌పై కొందరు తప్పుడు ఫిర్యాదులు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని యజమాని పి. గోపీకిశోర్‌ ఫిర్యాదు చేశారు. తప్పుడు ఫిర్యాదులు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. 

-- ఉక్కు భూసేకరణ కార్యాలయంలో ఆర్‌ఐ రమణపై నిర్వాసితులు జేసీకి ఫిర్యాదు చేశారు. నిర్వాసితుల్లో తండ్రి నుంచి కుమారుడికి ఆర్‌.కార్డు బదలాయించేలా ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని పేర్కొంటూ ఇందుకు ఆర్‌ఐ డబ్బులు డిమాండ్‌ చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదులో ఆరోపించారు.  ఆర్‌ఐ అక్రమాలపై విచారణ జరిపి నిర్వాసితులకు న్యాయంచేయాలని కోరారు. తొలుత ఉక్కు నిర్వాసిత నిరుద్యోగుల సంఘం నేతృత్వంలో కలెక్టరేట్‌ ఆవరణలో ఆందోళన నిర్వహించారు. 


Updated Date - 2022-06-28T06:37:30+05:30 IST