గ్రామాల్లో సమస్యలను పరిష్కరించరా?

ABN , First Publish Date - 2022-06-28T04:55:48+05:30 IST

గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని మండల సభలో సభ్యులు మండిపడ్డారు

గ్రామాల్లో సమస్యలను పరిష్కరించరా?
మాట్లాడుతున్న జడ్పీ వైస్‌ చైర్మన్‌ రాజారెడ్డి

  అధికారులపై మండిపడిన సభ్యులు

 సమన్వయంతో పనిచేయాలి: జడ్పీ వైస్‌ చైర్మన్‌ 

 వాడీవేడిగా హుస్నాబాద్‌ మండల సమావేశం


హుస్నాబాద్‌రూరల్‌, జూన్‌ 27: గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని మండల సభలో సభ్యులు మండిపడ్డారు. ఎంపీపీ లకావత్‌ మానస అధ్యక్షతన సోమవారం మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్‌లు తమ సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. తహసీల్దార్‌ కార్యాలయంలో సర్పంచ్‌లకు గౌరవం లేకుండా పోతుందన్నారు. గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కరించడం లేదని రాములపల్లి సర్పంచ్‌ మదన్‌మోహన్‌రెడ్డి, నాగారం సర్పంచ్‌ సుగుణ ఆందోళన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా పింఛన్లు, కొత్త రేషన్‌ కార్డులు మంజూరు కావడం లేదని పందిల్ల సర్పంచ్‌ తొడేటి రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్‌ మంజూరు రాష్ట్రవ్యాప్త సమస్య అని, పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని ఎంపీపీ మానస చెప్పారు. ఐసీడీఎస్‌ ప్రాజెక్టులో జరిగే కార్యక్రమాలు మూడు సంవత్సరాలుగా తమ దృష్టికి ఎందుకు రావడం లేదని ఎంపీపీ మానస ఐసీడీఎస్‌ అధికారిని ప్రశ్నించారు. ప్రభుత్వం అందించే పౌష్ఠికాహారం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన తదితర కార్యక్రమాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాప్రతినిధులకు ఎందుకు చెప్పడం లేదని జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ రాయిరెడ్డి రాజారెడ్డి ప్రశ్నించగా.. ఇకమీదట తెలియజేస్తామని సీడీపీవో జయ పేర్కొన్నారు. పల్లెప్రగతిలో లూజ్‌ వైర్లు ఉన్న చోట అదనంగా విద్యుత్‌ స్తంభాలు వేస్తామని చెప్పిన అధికారులు ఇప్పటి వరకు వాటి గురించి పట్టించుకోవడం లేదని, అడిగితే బడ్జెట్‌ రాలేదంటున్నారని పందిల్ల సర్పంచ్‌ రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ రాయిరెడ్డి రాజారెడ్డి సూచించారు. సమావేశంలో వైస్‌ ఎంపీపీ దేవసాని నిర్మల, ఎంపీడీవో అనిత, తహసీల్దార్‌ మహేష్‌, వంగరామయ్యపల్లి సర్పంచ్‌ వంగ విజయ, అధికారులు పాల్గొన్నారు.


 

Updated Date - 2022-06-28T04:55:48+05:30 IST