సమస్యలివే... పరిష్కారం చూపండి

ABN , First Publish Date - 2022-06-27T05:30:00+05:30 IST

కలెక్టరేట్‌లో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బాధితుల నుంచి జేసీ వెంకటేశ్వర్‌ వినతిపత్రాలు స్వీకరించారు

సమస్యలివే... పరిష్కారం చూపండి
బాధితులిచ్చిన వినతిపత్రాన్ని పరిశీలిస్తున్న జేసీ వెంకటేశ్వర్‌

చిత్తూరు, జూన్‌ 27: కలెక్టరేట్‌లో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బాధితుల నుంచి జేసీ వెంకటేశ్వర్‌ వినతిపత్రాలు స్వీకరించారు. సమస్యలను ఓపిగ్గా విన్న ఆయన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారుల దృష్టికి వచ్చిన అర్జీల్లో కొన్ని....


జంగం కులధ్రువీకరణ పత్రంలో భిక్షాటన ట్యాగ్‌లైన్‌ తొలగించాలి

రెవెన్యూ అధికారులు మంజూరు చేసే జంగం కుల ధ్రువీకరణ పత్రంలో భిక్షాటన అనే ట్యాగ్‌లైన్‌ తొలగించాలని ఏపీ జంగం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాటి గంగాధర్‌, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, ఇతర నేతలు కోరారు. కుల ధ్రువీకరణ పత్రం వృత్తి అనే కాలంలో భిక్షాటన అని రావడం వల్ల విద్యార్థులు ఆత్మన్యూనతాభావానికి గురువుతన్నారన్నారు. తోటి విద్యార్థులు వారిని అవహేళనగా మాట్లాడుతున్నారని తెలిపారు. అందుకే ఆ పదాన్ని తొలగించాలని కోరారు.


దురాక్రమణను తొలగించాలి

కాలువ భూమి ఆక్రమణను తొలగించి, పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని వెదురుకుప్పం మండలం బోడబండ గ్రామస్తులు కోరారు. ఇందిరాగాంధీ హయాంలో తమకు కాలనీ ఇండ్లు మంజూరయ్యాయని, అదే సమయంలో మురుగునీరు వెళ్లడానికి కాలువ ఏర్పాటు చేశారని తెలిపారు. అగ్రవర్ణాల వారు దాన్ని ఆక్రమించుకోవడం వల్ల మురుగునీరు వీఽధుల్లోకి వస్తోందని, తద్వారా పారిశుధ్యం లోపిస్తోందని వివరించారు. మండల స్థాయి అధికారులకు చెప్పినా ఫలితం లేకపోయిందన్నారు. ఈ మేరకు జేసీ వెంకటేశ్వర్‌కు వినతిపత్రం ఇచ్చారు.


చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే బాధిత రైతులకు న్యాయం చేయాలి

చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే బాధితులమైన తమకు న్యాయం చేయాలని పలువురు రైతులు డిమాండ్‌ చేశారు. హైవే నిర్మాణంలో తమ భూములు, బోర్లు, బావులు, మామిడి, టెంకాయ, ఇతర చెట్లన్నీ పోయాయన్నారు. ఆయా పంచాయతీల్లో రిజిస్ర్టేషన్‌ ధరను బట్టి డబ్బులు వేశారని, బోర్లు, బావులు, చెట్లకు తక్కువ పరిహారం ఇచ్చారని పేర్కొన్నారు. మామిడి, టెంకాయ చెట్లకు మూడువేలు మాత్రమే ఇచ్చారని, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల్లో రూ.60వేలు ఇచ్చారని పేర్కొన్నారు. బావులకు లోతును బట్టి రూ.60 నుంచి రూ.70 లక్షల వరకు ఇచ్చారని, బోర్లకు రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఇచ్చారన్నారు. అదే తరహాలో తమకూ పరిహారం ఇవ్వాలని కోరారు.

స్పందనకు 171 అర్జీలు

స్పందనకు వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలని జేసీ వెంకటేశ్వర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందనలో ఆయన డీఆర్వో రాజశేఖర్‌తో కలిసి వినతిపత్రాలు స్వీకరించారు. మొత్తం 172 అర్జీలు రాగా రెవెన్యూ శాఖకు 132, డీఆర్‌డీఎకు 4, హౌసింగ్‌కు 9, డీసీహెచ్‌ఎ్‌సకు 4, మున్సిపాలిటీలకు 3, పోలీ్‌సశాఖకు 6, ఇతర శాఖలకు 14 అందాయి.



Updated Date - 2022-06-27T05:30:00+05:30 IST