BJP నుంచి Suspend అయిన Nupur Sharma గురించి ఈ విషయాలు తెలుసా?

ABN , First Publish Date - 2022-06-06T21:42:00+05:30 IST

వృత్తిపరంగా న్యాయవాది అయిన నుపుర్.. భారతీయ జనతా పార్టీకి ఉన్న ప్రముఖ అధికార ప్రతినిధుల్లో ఒకరు. అఖిల భారత విద్యార్థి పరిషద్(Akhil Bharatiya Vidyarthi Parishad) టికెట్ పై ఢిల్లీ యూనివర్సిటీ

BJP నుంచి Suspend అయిన Nupur Sharma గురించి ఈ విషయాలు తెలుసా?

న్యూఢిల్లీ: రెండు రోజులుగా సోషల్ మీడియాలో నుపుర్ శర్మ(Nupur Sharma) గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ఒక టీవీ డిబేట్లో ఆమె మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్త(Prophet Muhammad)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గల్ఫ్ దేశాల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) ఆదివారం ప్రకటించింది. బీజేపీలో క్రియాశీలకంగా పని చేస్తూ వస్తోన్న నుపుర్ గురించి కొన్ని సంగతులు తెలుసుకుందాం.


వృత్తిపరంగా న్యాయవాది అయిన నుపుర్.. భారతీయ జనతా పార్టీకి ఉన్న ప్రముఖ అధికార ప్రతినిధుల్లో ఒకరు. అఖిల భారత విద్యార్థి పరిషద్(Akhil Bharatiya Vidyarthi Parishad) టికెట్ పై ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి విభాగం అధ్యక్షులుగా ఎన్నికైన ఆమె అదే యూనివర్సిటీలోని హిందూ కాలేజీ నుంచి ఆర్థశాస్త్రం, న్యాయశాస్త్రాల్లో డిగ్రీ చేశారు. అనంతరం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. విద్యార్ధి దశ నుంచే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న నుపుర్.. బీజేపీ యూత్ వింగ్ అయిన బీజేవైఎంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో పని చేశారు. అనంతరం బీజేవైఎం నేషనల్ మీడియా కోఇంచార్జ్, బీజేపీ యువ వర్కింగ్ కమిటీ మెంబర్, ఢిల్లీ బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పని చేశారు.


బీజేపీ తరపున అనేక విషయాల్లో టీవీ డిబేట్లలో నుపుర్ పాల్గొన్నారు. బీజేపీకి చెందిన ప్రముఖ అధికార ప్రతినిధుల్లో నుపుర్ ఒకరు. అలాగే టెక్ ఫర్ ఇండియా యూత్ అంబాసిడర్ గా గతంలో కొనసాగారు. ఇక ఎన్నికల బరిలో కూడా నుపుర్ నిలిచారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.


ఆదివారం నుపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన బీజేపీ.. దానికి సంబంధించిన ఒక లేఖను మీడియాకు విడుదల చేసింది. అందులో.. ‘‘మీ అభిప్రాయాలు పార్టీ వైఖరికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇది పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి మిమ్మల్ని తక్షణమే తొలగిస్తున్నాం’’ అని పార్టీ క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. ఢిల్లీ బీజేపీ మీడియా విభాగం అధ్యక్షుడు నవీన్‌కుమార్‌ జిందాల్‌ను కూడా పార్టీ బహిష్కరించింది. సోషల్‌ మీడియాలో ఆయన పెట్టిన పోస్టులు మత సామరస్యానికి విఘాతం కలిగించాయని పేర్కొంది.

Updated Date - 2022-06-06T21:42:00+05:30 IST