గులాబీలో ముళ్లు.. ఆవిర్భావ దినోత్సవంలో బయటపడ్డ అసమ్మతి

ABN , First Publish Date - 2022-04-28T12:57:48+05:30 IST

టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు, పార్టీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎవరికి

గులాబీలో ముళ్లు.. ఆవిర్భావ దినోత్సవంలో బయటపడ్డ అసమ్మతి

హైదరాబాద్‌ సిటీ : టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలు, పార్టీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. కొందరు స్థానిక ఎమ్మెల్యేలపై అసమ్మతి వెళ్లగక్కారు. ఫ్లెక్సీలలోనూ స్థానిక నేతలు, ఎమ్మెల్యేల ఫొటోలు లేకుండా పెట్టారు.


- ముషీరాబాద్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోపాల్‌కు వ్యతిరేకంగా నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివా్‌సరెడ్డి మామ పేరుతో ఉన్న ఫౌండేషన్‌ ద్వారా పార్టీ జెండాల ఆవిష్కరణ, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ అధ్యక్షులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. 


- అంబర్‌పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో సంబంధం లేకుండా కొందరు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు జెండా ఆవిష్కరణలు చేశారు. 


- అసమ్మతి నేతల చర్యలను ఖండిస్తూ బాగ్‌ అంబర్‌పేటలోని త్రిశూల్‌ కన్వెన్షన్‌లో ఎమ్మెల్యే అనుచరగణం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. 


- సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుపై కొందరు కార్పొరేటర్లకు అంతర్గతంగా విభేదాలు ఉన్నాయి. అన్ని డివిజన్లకు పద్మారావు తనయులు ఇన్‌చార్జీలుగా ఉంటూ, అంతా తామై వ్యవహరిస్తుండడమే అందుకు కారణంగా తెలిసింది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విభేదాలు వెలుగులోకి వచ్చాయి.


- కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సాయన్న లేకుండానే పలు కార్పొరేషన్ల చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, గజ్జల నాగేష్‌, మన్నె క్రిశాంక్‌ పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు.

Updated Date - 2022-04-28T12:57:48+05:30 IST