కరోనా లక్షణాలు ఉన్నా కొందరికి టెస్టుల్లో ‘నెగిటివ్’ రిజల్ట్.. అసలు కారణమేంటంటే..

ABN , First Publish Date - 2021-05-05T19:12:57+05:30 IST

భారత్‌లో కరోనా కేసులు భయంకరంగా..

కరోనా లక్షణాలు ఉన్నా కొందరికి టెస్టుల్లో ‘నెగిటివ్’ రిజల్ట్.. అసలు కారణమేంటంటే..

భారత్‌లో కరోనా కేసులు భయంకరంగా పెరిగిపోతున్నాయి. సెకండ్ వేవ్ ధాటికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అయితే చాలామంది ప్రజలకు కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ టెస్టు ఫలితం మాత్రం నెగిటివ్ వస్తోంది. ఇంతకు ముందు ఇలా తప్పుగా రావడం చాలా అరుదుగా జరిగేది. కానీ ఇప్పుడు ఇలాంటి ఘటనల సంఖ్య పెరిగింది. దీంతో ఇటు ప్రజలు, అటు వైద్యుల్లో ఆందోళన కనబడుతోంది. ఇలాంటి సమయంలో అసలు ఇలా కరోనా ఉన్నవారికి నెగిటివ్ ఫలితం ఎందుకొస్తుంది? ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షను ఎంత వరకూ నమొచ్చు? ఇలాంటి పరిస్థితులకు కారణాలేంటి? అనే అంశాలను ఒకసారి పరిశీలిస్తే అనేక విషయాలు తేటతెల్లమవుతాయి.


భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్‌టీ-పీసీర్ టెస్టుల డిమాండ్ కూడా విపరీతంగా పెరుగుతోంది. అయితే వీటిలో 20శాతంపైగా టెస్టుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తున్య వ్యక్తులకు కూడా నెగిటివ్ ఫలితమే వస్తున్నట్లు సమాచారం. ఇలా జరగడం వల్ల కరోనాతో తీవ్రంగా బాధపడే వారికి కూడా ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితులు ఎదురుకావొచ్చు. అదే సమయంలో అసింప్టమాటిక్(వైరస్ సోకినా కరోనా లక్షణాలు కనిపించని) వారికి నెగిటివ్ ఫలితం వస్తే.. వారు అందరితో కలిసి తిరగడం వల్ల మిగతా వారికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఈ తప్పుడు ఫలితాలు దేశంలో ఎంతటి సీరియస్ సమస్యగా మారాయంటే.. కరోనా టెస్టు ఫలితంతో సంబంధం లేకుండా ఈ వైరస్ లక్షణాలు కనిపించన వారందరికీ కొవిడ్-19 ట్రీట్‌మెంట్ ఇవ్వాలని సాక్షాత్తు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియానే సూచించారు. ఆయన మాటలు వింటేనే దేశంలో ఈ దొంగ ఫలితాల రేటు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.


కరోనాను గుర్తించడానికి ఆర్‌టీ-పీసీఆర్ టెస్టును కచ్చితమైన ప్రమాణంగా భావిస్తారు. అయితే ఈ టెస్టులు కూడా పర్‌ఫెక్ట్ కాదు. ఆర్‌టీ-పీసీఆర్ టెస్టుల్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎమ్ఆర్) డిమాండ్ చేసే సెన్సిటివిటీ 95శాతమే. అంటే 5శాతం తప్పుడు నెగిటివ్ ఫలితాలకు ఇక్కడే అవకాశం దొరికినట్లు. ప్రస్తుతం దేశంలో ఇలాంటి తప్పుడు ఫలితాలు ఎక్కువగా వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నా, వీటికి సంబంధించిన ఆధారాలు మాత్రం ఇంకా ఎవరిదగ్గరా లేవు. ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలో ఒక వ్యక్తికి కరోనా ఉందా? లేదా? అని తెలుసుకోవాలంటే నాలుగు అంశాలను పరిశీలిస్తారు. అవి సదరు వ్యక్తిలోని వైరల్ లోడ్, సేకరించిన శాంపిల్ నాణ్యత మరియు ప్రాసెసింగ్, పరీక్ష చేసే కిట్ సమర్థత, పరీక్షను అర్థం చేసుకునే విధానం.


సాధారణంగా కరోనా వైరస్ శరీరంలో అభివృద్ధి చెండానికి ఐదురోజులు పడుతుంది. అంటే అంతకన్నా ముందు పరీక్ష చేయించుకుంటే నెగటివ్ ఫలితం రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ దానర్థం అతనికి వైరస్ సోకలేదని కాదు.  అయితే ప్రస్తుతం దేశంలో ఈ పరిస్థితి ఎదురవడానికి అవకాశాలు తక్కువ. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ మ్యూటెంట్లు చాలా వేగంగా శరీరంలో అభివృద్ధి చెందుతున్నాయి. ఆర్‌టీ-పీసీఆర్ టెస్టుల్లో నెగిటివ్ ఫలితం వచ్చిన చాలా మంది పేషెంట్లకు బీఏఎల్(బ్రాంకోల్వియోలర్ లావేజ్) టెస్టులో పాజిటివ్ ఫలితం వచ్చిందట. ఈ పరీక్షలో శాంపిల్స్‌ను బ్రాంకోస్కోప్ సాయంతో సేకరిస్తారు.



ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు కిట్ ధర ఒక్క ఏడాదిలో రూ.1100 నుంచి రూ.40కి పడిపోయింది. దిగుమతులపై వేసే సుంకం నుంచి ఇచ్చిన మినహాయింపులను 2020 అక్టోబరులో భారత ప్రభుత్వం తొలగించింది. దీంతో విదేశాల నుంచి వచ్చే టెస్టు కిట్లపై 15శాతం అదనపు భారం పడింది. ఈ కారణంగా చాలా విదేశీ కంపెనీలు భారత మార్కెట్ నుంచి వెళ్లిపోయాయి. చాలా భారతీయ బ్రాండ్లు కూడా రూ.100 కన్నా తక్కువకు కిట్లను అమ్మడానికి నిరాకరిస్తున్నాయి. అయితే తక్కువ ధరకు లభించే టెస్టు కిట్ల నాణ్యతపై కొందరు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అయితే మార్కట్లో లభించే ఆర్‌టీ-పీసీఆర్ కిట్లన్నీ ఐసీఎమ్ఆర్ ప్రమాణాలను పాటిస్తున్నాయని, ధరల యుద్ధం ఎంత జరిగినా చివరకు లాభం మాత్రం వినియోగదారుడికే అనేది కొందరి వాదన. అయితే ఈ టెస్టు కిట్ల ధర తగ్గడంతో ల్యాబు్లో టెస్టుల ఫీజు కూడా తగ్గిపోయింది. గతంలో రూ.4,500గా ఉన్న ఫీజు ప్రస్తుతం రూ.800కు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా టెస్టు చేయించుకున్న ల్యాబు ఎంత ఖరీదున్న కిట్ ఉపయోగిస్తుందో ఎలా తెలుస్తుంది? రూ.40తో పోతున్నప్పుడు ఎన్ని ల్యాబులు రూ.100 ఖర్చు పెడతాయి? అని దేశంలో కొవిడ్ పీసీఆర్ కిట్ల ఉత్పత్తిదారుల్లో ఒకరు ప్రశ్నించారు.


కరోనా టెస్టులు తప్పుడు ఫలితాలు చూపించడానికి మరో అరుదైన కారణం సీటీ విలువ. సీటీ అంటే సైకిల్స్ త్రెషోల్డ్. వైరల్ లోడ్‌ ఎంత ఉందో తెలుసుకోవడానికి శాంపిల్‌ను ఎన్నిసార్లు చెక్ చేస్తే అన్ని సైకిల్స్ పూర్తయినట్లు. శాంపిల్లో ఎక్కువ వైరల్ లోడ్ ఉంటే తక్కువ సైకిల్స్ (సీటీ)లోనే వైరస్ దొరికిపోతుంది. ఒకవేళ వైరల్ లోడ్ తక్కువగా ఉంటే ఎక్కువ సైకిల్స్ అవసరం అవుతాయి. నెగిటివ్ ఫలితం ఇవ్వాలంటే శాంపిల్స్‌కు సీటీ వేల్యూ కనీసం 35 ఉండాలని చెప్పింది. అయితే మహరాష్ట్ర వంటి రాష్ట్రాలు ఈ విలువ 24 ఉన్నా సరిపోతుందని సూచించాయి. ఇలా చేయడం వల్ల క్లినికల్‌గా చెప్పుకోదగ్గ వైరల్ లోడ్ ఉండి, పరిమాణాత్మకంగా తక్కువ లోడ్ ఉన్న వారిని వేరు చేస్తుందనేది ఆ రాష్ట్రాల వాదన. అయితే ఐసీఎమ్ఆర్ మాత్రం ఈ విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి అంగీకరించలేదు. అయితే ఎన్ని రాష్ట్రాల్లో ఈ సీటీ నియమాలను అనుసరిస్తున్నారనేది తెలియాల్సి ఉంది. చాలాసార్లు సీటీ వేల్యూ వంటి అంశాల విషయంలో మౌఖిక సూచనలు అందుతున్నాయని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ ల్యాబుల సీనియర్ ఉద్యోగులు కొందరు చెప్పారు. అంటే ఇలాంటి టెస్టులు కూడా వివక్షకు గురవుతున్నాయన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో గబగబా టెస్టు పూర్తి చేసి నెగిటివ్ ఫలితం వచ్చినా ఉపయోగం ఉండదనేది నిపుణులమాట.



తప్పుడు ఫలితాలు రావడానికి మరో కారణం ఉన్నట్లుండి ఈ టెస్టు చేసే ల్యాబుల సంఖ్య పెరగడం. గతేడాది ఫిబ్రవరిలో ఈ టెస్టులు చేసే ల్యాబులు దేశవ్యాప్తంగా కేవలం 14 మాత్రమే ఉన్నాయి. అదే ఈ ఏడాది ఏప్రిల్ నాటికి వీటి సంఖ్య 2,400కు పెరిగింది. దీనికోసం చాలా వేగంగా వందలాది ల్యాబులకు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ ల్యాబుల నాణ్యతను పరిశీలించేందుకు ఐసీఎమ్ఆర్ 30 క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత వీటి సంఖ్యను మరో 8 పెంచింది. అయితే ఈ క్వాలిటీ కంట్రోల్ ల్యాబులు చేసిన తనిఖీలు చాలా తక్కువని కొందరు అంటున్నారు. దేశంలోని ల్యాబులన్నిటి నుంచి ర్యాండమ్‌గా కొన్ని శాంపిల్స్ తీసుకెళ్లి వాటిని మరోసారి టెస్టు చేయాల్సిన బాధ్యత ఈ క్వాలిటీ కంట్రోల్ ల్యాబులకు ఉంది. ఇలా జరిగిందా అంటే జరిగింది. కానీ ఇలా రెగ్యులర్‌గా చేస్తున్నారా? అంటే లేదు అని ఐసీఎమ్ఆర్‌కే చెందిన ఒక శాస్త్రవేత్త చెప్పారు. జూలై 2020 నుంచి ఎన్ని ల్యాబులను మానిటర్ చేశారు? ఎన్నిచోట్ల నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారు? అనే వివరాలు కోరగా క్వాలిటీ కంట్రోల్ ల్యాబులు మౌనంగానే ఉండిపోయినట్లు సమాచారం.


కరోనా టెస్టులు వివిధ దశల్లో విఫలం అవ్వొచ్చు. సేకరించిన శాంపిల్ బాగలేకపోవడం, దాన్ని సరిగా నిల్వ చేయకపోవడం కూడా దీనికి కారణమే. అలాగే అన్ని ఆర్‌టీ-పీసీఆర్ కిట్లలో ఇంటర్నల్ కంట్రోల్(ఐసీ) ఉంటుంది. శాంపిల్‌లో ఆర్ఎన్ఏ ఎక్స్‌ట్రాక్షన్ లేక యాంప్లిఫికేషన్ జరగనప్పుడు నెగిటిఫ్ ఫలితం వస్తుంది. అలాగే ఆర్ఎన్ఏ ఎక్స్‌ట్రాక్షన్ చేయడానికి ముందుగా శాంపిల్‌కు ఒక కృత్రిమ ఆర్‌ఎన్ఏ టెంప్లేట్ మూలకాలను చేర్చినప్పుడు ఈ టెస్టును ఎక్సోజీనస్ అంటారు. ఆ తర్వాత ఆర్ఎన్ఏ ఎక్స్‌ట్రాక్షన్ చేశాక దానిలో ఈ సింథటిక్ ఆర్‌ఎన్‌ఏ కనిపించకపోతే ఈ పరీక్ష చెల్లదు. మరోసారి టెస్ట్ చేయించుకోవాలని నిపుణులు చెప్తున్నారు. అలాగే ఎండోజీనస్ కంట్రోల్‌లో శాంపిల్‌లో ఒక మానవ ‘హౌస్ కీపింగ్’ జీన్ ఉంటుంది. ఆర్‌ఎన్ఏ ఎక్స్‌ట్రాక్షన్ అనంతరం ఈ జీన్ కనిపించకపోతే టెస్టు చెల్లదు.


తప్పుడు ఫలితాలు రావడానికి వైరస్ మ్యూటేషన్ కూడా ఒక కారణమే. ఆర్‌టీ-పీసీఆర్ టెస్టు వైరల్ జీన్స్‌లోని కొన్ని ప్రత్యేక ప్రాంతాలను టార్గెట్ చేస్తుంది. ఆ ప్రాంతాల్లో వైరస్ మ్యూటేషన్ జరిగి ఇది టెస్టు చూపు దాటిపోయే ప్రమాదం ఉంది. అలా జరిగినప్పుడు టెస్టు ఫలితం నెగిటివ్‌గానే వస్తుంది. అయితే భారత్‌లో వాడే టెస్టులు ఒకేసారి వేరువేరే జెనెటిక్ లక్ష్యాలను టార్గెట్ చేస్తాయి. కాబట్టి ఈ పరీక్షలు మ్యూటేషన్ కారణంగా తప్పుడు ఫలితాలు ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. అమెరికాలో ఈ మ్యూటేషన్లపై ఎఫ్డీయే ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఆర్‌‌టీ-పీసీఆర్ టెస్టులపై మ్యూటేషన్ల ప్రభావం ఎలా ఉందో ఎప్పటికప్పుడు మోనిటరింగ్  చేస్తోంది. భారత్‌లో కూడా ఇలానే చేయాలని కొందరు నిపుణులు సలహాలిస్తున్నారు.


Updated Date - 2021-05-05T19:12:57+05:30 IST