క‌రోనా తో మేలు కూడా జరిగిందా ?

ABN , First Publish Date - 2020-08-02T22:00:42+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా నేపథ్యంలో ముఖానికి మాస్కులు ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవటం వంటి జాగ్రత్తలు, భౌతిక దూరం వంటి నియమాలను పాటించడం స‌ర్వ‌సాధారణమయ్యాయి. ఈ క్రమంలోనే... కొంత మేలు కూడా జరుగుతోంద‌న్న ఓ కొత్త కోణం వెలుగు చూసింది.

క‌రోనా తో మేలు కూడా జరిగిందా ?

వాంకూవర్ : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా నేపథ్యంలో ముఖానికి మాస్కులు ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవటం వంటి జాగ్రత్తలు, భౌతిక దూరం వంటి నియమాలను పాటించడం స‌ర్వ‌సాధారణమయ్యాయి.  ఈ క్రమంలోనే... కొంత మేలు కూడా జరుగుతోంద‌న్న దిశగా... ఓ కొత్త కోణం వెలుగు చూసింది. 


కరోనా కట్టడికి తీసుకున్న జాగ్రత్తల నేపధ్యంలో... ఇన్‌ఫ్ల్యూయెంజా కేసులు గణనీయంగా తగ్గాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సీజనల్‌గా వచ్చే ఇన్‌ఫ్ల్యూయెంజాతో ఏటా ఐదు లక్షల మంది వరకు మరణిస్తుండగా, 30-50 లక్షల మంది వ్యాధి ప్రభావానికి తీవ్రంగా లోనవుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసింది.


ప్రత్యేకించి... క‌రోనా పుట్టినిల్లైన చైనాలో ఈ విష‌యం స్ప‌ష్ట‌మైంది. క‌రోనా వైరస్‌ తొలిసారిగా వెలుగుచూసిన చైనాలో లాక్‌డౌన్‌ చర్యలు చేపట్టక ముందు నెలకు సగటున 2.9 లక్షల అంటువ్యాధుల కేసులు రికార్డయ్యేవని, లాక్‌డౌన్‌ తదనంతర కాలంలో వీటి సంఖ్య 23 వేలకు పడిపోయిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తంగా చూస్తే అంటువ్యాధులు 90 శాతం కంటే ఎక్కువగానే తగ్గుముఖం పట్టినట్లు నివేదించింది. 


ప్ర‌పంచ‌వ్యాప్తంగా కూడా ఈ మ‌హ‌మ్మారి నేపధ్యంలో ఇదే పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా కట్టడికి తీసుకున్న జాగ్రత్తలతో ఇన్‌ఫ్ల్యూయెంజా కేసులు గణనీయంగా తగ్గాయని కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలు కూడా పేర్కొన్నాయి.


దక్షిణ కొరియాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అంటువ్యాధులు 83 శాతం మేర తగ్గినట్టు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ఇక భార‌త‌దేశం విష‌యానికి వ‌స్తే... ఎండాకాలం(ఫిబ్రవరి-మే)తో పోలిస్తే వర్షాకాలం (జూన్‌-సెప్టెంబర్‌)లో అంటువ్యాధుల విజృంభణ ఎక్కువగా ఉంటుంది. అయితే, కరోనా నేపథ్యంలో ప్రజలు ముఖానికి మాస్కులు ధరించడం, భౌతిక దూరం తదితర నియమాలను పాటిస్తూ వచ్చిన నేపధ్యంలో... ఫ్లూ, శ్వాసకోశకు సంబంధించిన వ్యాధులు భారత్‌తో పాటు దక్షిణార్ధ గోళంలోని పలు దేశాల్లో తక్కువగా ప్రబలవచ్చని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్ అంచ‌నా. మొత్తంమీద... వణికిస్తుండడమే కాదు... కరోనా ఒకింత మేలు కూడా చేసినట్లే కదా..!

Updated Date - 2020-08-02T22:00:42+05:30 IST