ఏదో జరిగింది.. జరగనుంది!?

ABN , First Publish Date - 2022-09-25T07:42:47+05:30 IST

చైనాలో ‘కుట్ర’ జరిగిందా? జిన్‌పింగ్‌ను పదవి నుంచి తప్పించారా? గృహ నిర్బంధంలో ఉంచారా? ఈ ప్రశ్నలకు ఎవరూ సూటిగా సమాధానం చెప్పలేరు.

ఏదో జరిగింది.. జరగనుంది!?

అంతా జిన్‌ పింగ్‌కు వ్యతిరేకంగానే!

ఉజ్బెక్‌ నుంచి హుటాహుటిన రాక

ఆ సమయంలో హడావుడి ఏమీ లేదు

సంస్కరణలు.. అంటున్న సీసీపీ


చైనాలో ‘కుట్ర’ జరిగిందా? జిన్‌పింగ్‌ను పదవి నుంచి తప్పించారా? గృహ నిర్బంధంలో ఉంచారా? ఈ ప్రశ్నలకు ఎవరూ సూటిగా సమాధానం చెప్పలేరు. ఎందుకంటే... అక్కడ ఏం జరిగినా ప్రపంచానికి అంత సులభంగా తెలియదు. కానీ... ‘పరిస్థితులు సాధారణంగా లేవు. ఏదో జరుగుతోంది. ఏదైనా జరిగి ఉండొచ్చు.. జరగొచ్చు’ అంటున్నారు జెన్నిఫర్‌ జెంగ్‌. ‘ఇన్‌కన్వీనియెంట్‌ ట్రూత్‌’ అనే యూట్యూబ్‌ చానల్‌ ద్వారా చైనాలో జరిగే విశేషాలను ఈమె వెల్లడిస్తుంటారు. తాజా వీడియోలో ఆమె ఏం చెప్పారంటే... గురువారం న్యూ హైల్యాండ్‌ విజన్‌ అనే ట్విటర్‌ ఖాతాలో జిన్‌పింగ్‌పై ‘సైనిక కుట్ర’ పోస్ట్‌ కనిపించింది. పింగ్‌ ఉజ్బెకిస్థాన్‌కు బయల్దేరగానే సీసీపీ సీనియర్లు సమావేశమై ఆయనను పక్కకు తప్పించాలని నిర్ణయించారు. ఈ విషయం ముందే ఉప్పందండంతో జిన్‌ పింగ్‌ తిరిగి చైనాకు వచ్చారు. ‘యాపిల్‌ డెయిలీ’ అనే చైనీస్‌ పత్రిక మాజీ కాలమిస్ట్‌ కూడా ఈ అంశంపై ట్విటర్‌లో స్పందించారు. ‘పింగ్‌ను తప్పించినట్లు బీజింగ్‌లోని నాకు తెలిసిన వర్గాలు చెప్పాయి’ అని చెప్పారు.


బుధవారం చైనా నేషనల్‌ డిఫెన్స్‌ అండ్‌ మిలిటరీ రిఫార్మ్‌ కమిటీ ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇది జిన్‌పింగ్‌ కచ్చితంగా హాజరు కావల్సిన భేటీ. కానీ ఆయన అక్కడ లేరు. అంతేకాదు జిన్‌పింగ్‌ ఈనెల 8న నార్తర్న్‌ వార్‌ జోన్‌ కమాండర్‌ పదవి నుంచి తప్పించిన ఒక ఉన్నత స్థాయి కమాండర్‌ ఈ సమావేశంలో పాల్గొనడం మరో విశేషం. సీసీపీ సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌కు చెందిన ఇద్దరు సీనియర్‌ సభ్యులు తమ ప్రసంగంలో అసలు జిన్‌పింగ్‌ ప్రస్తావనే తేలేదు. సాధారణంగా... సీసీపీ జనరళ్లు ఇలాంటి భేటీలలో జిన్‌పింగ్‌ పట్ల విధేయతను చాటుకుంటారు.

ఈ నెల 8వ తేదీ తెల్లవారుజామున యుహాంగ్‌లోని మిలిటరీ ఎయిర్‌పోర్టులో కాల్పులు, పేలుళ్లు, ఫైటర్‌ జెట్‌ శబ్దాలు వినిపించాయి. ఈ విమానాశ్రయం పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి చెందిన నార్తర్న్‌ వార్‌ జోన్‌ పరిధిలోకి వస్తుంది. ఆ రోజునే ఈ జోన్‌ కమాండర్‌ను జిన్‌పింగ్‌ పక్కకు తప్పించారు. (ఆయనే బుధవారం జరిగిన భేటీలో ప్రత్యక్షమయ్యారు.)

ఎస్‌సీఓ నుంచి ఈనెల 16న జిన్‌పింగ్‌ హుటాహుటిన తిరిగి వచ్చారు. అయితే, అధ్యక్షుడు తిరిగి వచ్చినట్లుగా తెలిపే ఫొటోలు కానీ, వీడియోలు కానీ లేవు. సీసీపీలోని అత్యంత సీనియర్‌ నేత సంగ్‌పింగ్‌ (105) సెప్టెంబరు 12న.. ‘సంస్కరణలు.. సడలింపులు’ మాత్రమే చైనా ముందున్న మార్గాలంటూ... జిన్‌పింగ్‌ను టార్గెట్‌ చేస్తూ మాట్లాడారు. 


అదేమీ ఉండకపోవచ్చు... ఎందుకంటే?

జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా కుట్ర జరగలేదని కూడా కొందరు అభిప్రాయ పడుతున్నారు. వారి వాదన ఏమిటంటే... నిజంగా సైనిక కుట్ర జరిగి, అది విజయవంతమైతే... దానిని చేసిన వారు మౌనంగా ఉండరు. బహిరంగ ప్రకటన చేస్తారు. అలాగైతేనే వారి లక్ష్యం నెరవేరుతుంది అని చెబుతున్నారు. జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా ‘సున్‌లీ జిన్‌’ నేతృత్వంలో ఒక బృందం పని చేస్తోంది. వీరిలో ఆరుగురికి మూడు రోజుల్లోనే కఠిన శిక్షలు పడ్డాయి. సున్‌లీజిన్‌, మరో ఇద్దరికి మరణ శిక్ష విధించారు. అంటే... చైనా ఇంకా పింగ్‌ నియంత్రణలోనే ఉందని తెలుస్తోందని వారు అంటున్నారు.

Updated Date - 2022-09-25T07:42:47+05:30 IST