Somu Veerraju: వైసీపీ ప్రభుత్వ విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలి...

ABN , First Publish Date - 2022-08-29T18:35:56+05:30 IST

వైసీపీ ప్రభుత్వ విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలని బీజేపీ నేత సోము వీర్రాజు పిలుపిచ్చారు.

Somu Veerraju: వైసీపీ ప్రభుత్వ విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలి...

విజయవాడ (Vijayawada): రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) అధ్యక్షతన సోమవారం బీజేపీ (BJP) పదాధికారుల సమావేశం జరిగింది. ముందుగా తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా బీజేపీ నేతలు గిడుగు రామమూర్తి (Gidugu Ramamurthy) చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) విధానాలపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపిచ్చారు. హిందువులు ఏ కార్యక్రమం చేపట్టినా వినాయకునికి పూజ చేస్తామన్నారు. అలాంటిది రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వినాయక ఉత్సవాలకు ఆంక్షలు విధించడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. గతంలో కోవిడ్ పేరు చెప్పి హిందువుల పండుగలకు ఆంక్షలు పెట్టిందని ఆరోపించారు. ఇతర పండుగలకు మాత్రం ఎటువంటి అనుమతి అక్కర్లేదని, వినాయక చవితికి ఫైర్, విద్యుత్, పోలీసు పర్మిషన్ తీసుకోవాలంటూ స్వయంగా డీజీపీనే ప్రకటించారని మండిపడ్డారు. ఏపీలో ఇటువంటి అంశాలను బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు.


సిఎం జగన్‌కు తాను లేఖ రాశానని, ముఖ్యమంత్రి ఈ ఉత్సవాల నిబంధనలపై ఎందుకు స్పందించరని సోము వీర్రాజు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఆలయాలు కూలకొడితే ఆనాడు కన్నా లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో వ్యతిరేకించామని, ఆనాడు‌ వెల్లంపల్లి కూడా తమ పోరాటంలో పాల్గొన్నారన్నారు. ఇప్పుడు అవన్నీ మరచి.. వైసీపీ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు.


పోలవరం విషయంలో కేంద్రం తప్పు లేదని సోమువీర్రాజు అన్నారు. అంచనాలు పెరగడానికి గత, ప్రస్తుత ప్రభుత్వాలే కారణమని విమర్శించారు. శశిభూషణ్‌ను పక్కన పెడితే.. మళ్లీ తెచ్చి పెట్టుకున్నారని, ఏపీకి రాజధాని లేకుండా చేశారని, ఒకే వేదికపై ఇరు పార్టీల నేతలతో మేము బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. మద్యం మాఫియాలో ఎవరి పాత్ర ఏంటో తమకు తెలుసన్నారు. జగన్ ప్రభుత్వం వైఫల్యాలపై అనేక ఉద్యమాలు  చేశామన్నారు. రామతీర్థం నుంచి కపిల తీర్థం వరకు ర్యాలీ చేశామని, తమ పోరాటాలవల్లే హిందూ ఆలయాలపై దాడులు ఆగాయన్నారు.


ఏపీలో ప్రభుత్వ విధానాలను బీజేపీ మొదటి నుంచి తప్పు పడుతోందని సోము వీర్రాజు అన్నారు. తెలుగు భాషపై జగన్ ప్రభుత్వానికి కనీస గౌరవం లేదని విమర్శించారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని భావి తరాలకు తెలియజేస్తామన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్‌కు ఐదు కిలోమీటర్లు రోడ్టు  వేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము ఒక్క బీజేపీకే ఉందన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మత్స్యకారులకు మంచి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి వారిని మోసం చేశారని ఆరోపించారు. ఏపీలో మత్స్యకారుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. జగన్ ప్రభుత్వంలో ఇన్సూరెన్స్, రవాణా చార్జీల పేరుతో రైతులను దోపిడీ చేస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఏపీలో బలీయమైన శక్తిగా బీజేపీ ఎదుగుతోందన్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ అధికారమే లక్యంగా పని చేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ నేతలు శివప్రకాష్ జీ,  జీవియల్, సునీల్ దేవ్ ధర్,  కన్నా లక్ష్మీనారాయణ, సత్యకుమార్, వాకాటి నారాయణ రెడ్డి, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-29T18:35:56+05:30 IST