జగన్ సొంత ఆస్తులను ఎందుకు తాకట్టు పెట్టరు?: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2021-06-22T20:26:59+05:30 IST

జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ రాష్ట్రంలో దుమారం రేపిందని సోము వీర్రాజు అన్నారు.

జగన్ సొంత ఆస్తులను ఎందుకు తాకట్టు పెట్టరు?: సోము వీర్రాజు

విశాఖ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ రాష్ట్రంలో దుమారం రేపిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, నిరసనలు తెలుపుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ప్రాజెక్టులు ద్వారా రాష్ట్రంలో ఉపాధి వస్తుందంటే అందుకు సహకరించడం లేదని, అన్నీ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. విశాఖలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెస్తారా?.. జగన్ సొంత ఆస్తులను ఎందుకు తాకట్టు పెట్టరని ప్రశ్నించారు.


ముఖ్యమంత్రి జగన్  పరిపాలన అంటే కానుకలు ఇవ్వడం.. అప్పులు తేవడమేనని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కొత్త అప్పులు కోసం విశాఖను తాకట్టు పెడుతున్నారని, దేశంలో ఎక్కడ ఇటువంటి పరిపాలన చూడలేదన్నారు.


టీడీపీ నేత అశోక్ గజపతిరాజును విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదని సోమువీర్రాజు అన్నారు. అశోక్ గజపతిరాజు కుటుంబస్యభ్యులు అనేక దానధర్మాలు చేశారన్నారు. ఆయనపై విమర్శలు చేసినప్పుడు వారి స్థాయిని దృష్టిలో  పెట్టుకొని విమర్శలు చేయాలన్నారు. పరిపాలన చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. రాష్ట్రంలో నడుస్తున్న అస్తవ్యస్థ పరిపాలనను సరి చేయాలన్నారు. టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలండర్‌పై భారతీయ యువమోర్చా అధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. విశాఖలో భూ కబ్జాలుపై హైకోర్టు సిటింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-06-22T20:26:59+05:30 IST