కుక్కను ఇంట్లోకి తెచ్చిన కొడుకు... కోర్టు మెట్లెక్కిన తల్లి.. కోడలికి కూడా శిక్ష... ఇంతకీ ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-07-30T15:31:19+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో ఒక విచిత్ర ఉదంతం...

కుక్కను ఇంట్లోకి తెచ్చిన కొడుకు... కోర్టు మెట్లెక్కిన తల్లి.. కోడలికి కూడా శిక్ష... ఇంతకీ ఏం జరిగిందంటే..

దేశ రాజధాని ఢిల్లీలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది.  తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఒక యువకుడు ఇంట్లోకి కుక్కను తెచ్చిన వ్యవహారం కోర్టుకు చేరింది. ఇంతేకాదు ఆ యువకుడు కుక్కను తెచ్చిన కారణంగా ఇల్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేని పక్షంలో భారీ జరిమానా లేదా శిక్షగా జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది. వివరాల్లోకి వెళితే ఈ ఉదంతంపై ఆ యవకుని తల్లే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంట్లో కుక్క ఉండడంతో శ్వాసకోశ సమస్యలు ఎదురవుతున్నాయని ఆమె ఆరోపిస్తోంది. పైగా ఆ యువకుడు తన తల్లిపై దాడి చేయడానికి కుక్కను రెచ్చగొట్టేవాడు. దీంతో ఆ తల్లి గృహ హింస చట్టం కింద పిటిషన్ దాఖలు చేసింది. దీంతో పాటు తన కుమారుడిని ఇంటి నుంచి బయటకు పంపించాలని వేడుకుంది. విచారణ సందర్భంగా అదనపు సెషన్స్ జడ్జి అరుల్ వర్మ ఫిర్యాదుదారుని కుమారుడిని, అతని భార్యను వారం రోజులలోగా తల్లిదండ్రుల ఇంటిని ఖాళీ చేయాలని ఆదేశించారు. ఆ మహిళ, ఆమె భర్త వివిధ వ్యాధులతో బాధపడుతున్నారని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంట్లో కుక్క ఉండడం వల్ల వారికి శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపింది. ఈ విషయంపై వ్యాఖ్యానించిన కోర్టు కొంతమంది జంతువుల ఉనికిని ఇష్టపడని వారు కూడా ఉంటారని పేర్కొంది. అలాంటి పరిస్థితుల్లో పూజగదిలో లేదా వంటగదిలోకి కుక్క రావడం తల్లికి చాలా ఇబ్బందిని కలిగిస్తున్నదని పేర్కొంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆ యువకుడిని, అతని భార్యను ఇంటిని ఖాళీ చేయాలని కోర్టు ఆదేశించింది. తన కొడుకు తనను భయపెట్టేందుకు కుక్కను ఉసిగొల్పుతున్నాడని ఆ యువకుని తల్లి ఆరోపించింది. వారు ఇంట్లోకి ప్రవేశించాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని కోర్టు పేర్కొంది.



Updated Date - 2022-07-30T15:31:19+05:30 IST