
అతడు మద్యం సేవించి అర్ధరాత్రి ఇంటికి వెళ్లి భార్యతో గొడవకు దిగాడు.. ఆమెను చితక్కొట్టాడు.. కోడలిని కొడుతున్న కొడుకును తండ్రి మందలించాడు.. తర్వాతి రోజు ఉదయం కోడలిని పుట్టింటికి పంపేశాడు.. విషయం తెలుసుకున్న కొడుకు తండ్రిపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.. కర్రతో తీవ్రంగా కొట్టాడు.. దెబ్బలు బాగా తగలడంతో వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.. ఎవరికీ తెలియకుండా అంత్యక్రియలు చేసెయ్యాలని కొడుకు భావించాడు.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కటకటాల పాలయ్యాడు.
మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలోని మగర్దా గ్రామానికి చెందిన బాబూలాల్ అనే వృద్ధుడు శనివారం రాత్రి ఇంట్లో నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి ఇంట్లోకి ప్రవేశించిన బాబూలాల్ కొడుకు అలజడి సృష్టించాడు. భార్యను కొట్టడం ప్రారంభించాడు. దాంతో బాబూలాల్.. కొడుకును మందలించి కోడలిని కాపాడాడు. తర్వాతి రోజు ఉదయం కొడుక్కి తెలియకుండా కోడలిని పుట్టింటికి పంపేశాడు. దీంతో బాబూలాల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.
ఓ పెద్ద కర్ర తీసుకుని తండ్రిని చితకబాదాడు. తీవ్ర గాయాలు కావడంతో బాబూలాల్ అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితుడు తన సోదరికి ఫోన్ చేసి, తండ్రి చనిపోయాడని, ఎవరికీ చెప్పకుండా అంత్యక్రియలు చేసెద్దామని చెప్పాడు. ఆమె కుటుంబ సభ్యులందరికీ విషయం చెప్పింది. కొడుకు చేతిలోనే బాబూలాల్ మరణించాడనే సంగతి తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాబూలాల్ కొడుకును అరెస్ట్ చేశారు.