Congress President Election: అశోక్ గెహ్లాట్‌కు కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు?

ABN , First Publish Date - 2022-08-24T18:56:08+05:30 IST

గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్థుడైన విధేయుడు అశోక్

Congress President Election: అశోక్ గెహ్లాట్‌కు కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు?

న్యూఢిల్లీ : గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్థుడైన విధేయుడు అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు కాబోతున్నారా?  మంగళవారం జరిగిన రహస్య సమావేశంలో సోనియా గాంధీ ఈ విషయం చెప్పారా? ఎన్నికల షెడ్యూలును ప్రకటించడానికి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరుగుతుందా? ఎంపిక జరుగుతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ కాకపోయినా ఓ ప్రశ్నకు సమాధానం అశోక్ గెహ్లాట్ నుంచి వచ్చింది. 


కాంగ్రెస్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, సోనియా గాంధీ (Sonia Gandhi) వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్తున్నారు. ఆమెతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా వెళ్తున్నారు. 


ఇదిలావుండగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో మంగళవారం సోనియా గాంధీ రహస్య సమావేశం నిర్వహించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టాలని గెహ్లాట్‌ను సోనియా కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గెహ్లాట్ వద్ద మీడియా బుధవారం ప్రస్తావించినపుడు ఆయన మాట్లాడుతూ, తాను మీడియా ద్వారా ఈ వార్తలను విన్నానని తెలిపారు. దీని గురించి తనకేమీ తెలియదన్నారు. ‘‘నాకు అప్పగించిన పనిని నేను నిర్వహిస్తున్నాను’’ అని చెప్పారు. 


మొదట్లో వెల్లడించిన వివరాల ప్రకారం సెప్టెంబరు 20నాటికి కాంగ్రెస్‌కు నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవలసి ఉంటుంది. అయితే రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆ పదవిని తాను మళ్లీ చేపట్టబోనని భీష్మించుకుని కూర్చున్నారు. ప్రియాంక గాంధీ కూడా అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమకు విశ్వాసపాత్రుడైన అశోక్ గెహ్లాట్‌ను ఆ పదవిలో నిలపాలని సోనియా అభిలషిస్తున్నట్లు తెలుస్తోంది. 


2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయంపాలవడంతో, రాహుల్ గాంధీ అందుకు బాధ్యత వహిస్తూ ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే విదేశాలకు వెళ్తున్న సోనియా, రాహుల్, ప్రియాంక తిరిగి సెప్టెంబరు 4నాటికి స్వదేశానికి వస్తారని తెలుస్తోంది. రాహుల్ గాంధీ సెప్టెంబరు 7 నుంచి ప్రారంభమయ్యే భారత్ జోడో ఆందోళన్‌లో పాల్గొంటారు. 


ఇటీవల అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాహుల్ గాంధీ చేపట్టాలన్నారు. ఆయన ఆ పదవిని చేపట్టకపోతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌వారంతా నిరుత్సాహానికి గురవుతారని చెప్పారు. చాలా మంది ఇళ్ళలోనే కూర్చుంటారని, తమకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. దేశంలోని సామాన్య కాంగ్రెస్‌వాదుల మనోభావాలను ఆయన అర్థం చేసుకోవాలన్నారు. 


Updated Date - 2022-08-24T18:56:08+05:30 IST