
న్యూఢిల్లీ: ఉదయపూర్ నవ్ సంకల్ప శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) 2024 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా 3 కమిటీలను ప్రకటించారు. రాజకీయ వ్యవహారాల బృందం (Political Affairs Group) , టాస్క్ ఫోర్స్-2024 (Task force-2024), 'భారత్ జోడో యాత్ర'ను సమన్వయం చేయడానికి సెంట్రల్ ప్లానింగ్ గ్రూప్‌ను పార్టీ సిద్ధం చేసింది. పార్టీ ఎక్స్-అఫిషియో మెంబర్లను కూడా ప్రకటించింది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన బృందంలో గతంలో పనిచేసిన సునీల్ కనుగోలు (Sunil kanugolu)కు టాస్క్‌ఫోర్స్-2024లో చోటు దక్కగా, ఇదే గ్రూపులో ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)కి కూడా స్థానం కల్పించారు.
ఇవి కూడా చదవండి
పొలిటికల్ అఫైర్స్ గ్రూపులో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, గులాం నబీ ఆజాద్, అంబికా సోని, దిగ్విజయ్ సింగ్, ఆనంద్ శర్మ, కె.సి.వేణుగోపాల్, జితేంద్ర సింగ్ ఉన్నారు. టాస్క్ ఫోర్స్-2024లో పి.చిదంబరం, ముకుల్ వాస్నిక్, జైరామ్ రమేష్, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకన్, ప్రియాంక గాంధీ వాద్రా, రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, సునీల్ కనుగోలు ఉన్నారు. టాస్క్‌ఫోర్స్‌లోని ప్రతి ఒక్కరికి ఆర్గనేజేషన్, కమ్యూనికేషన్, మీడియా, ఔట్‌రీచ్, ఫైనాన్స్, ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన నిర్దిష్టమైన టాస్క్‌లు ఇవ్వనున్నారు.
కాగా, భారత్ జోడో యాత్రను సమన్వయం చేయడానికి ఏర్పాటు చేసన సెంట్రల్ ప్లానింగ్ గ్రూపులో దిగ్విజయ్ సింగ్, సచిన్ పైలట్, శశిథరూర్, రవ్‌నీత్ సింగ్ బిట్టూ, కేసీ జార్జి, జోతి మణి, ప్రద్యుత్ బోర్డోలోయ్, జితు పట్వారి, సలీం అహ్మద్ ఉన్నారు. ఎక్స్ అఫీసియో మెంబర్లుగా టాస్క్ ఫోర్స్ సభ్యులు, ఆల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధిపతులు వ్యవహరిస్తారు.