
న్యూఢిల్లీ : విద్యార్థినీ, విద్యార్థులు ప్రత్యక్షంగా తరగతులకు హాజరవడం ప్రారంభమైనందువల్ల పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని మళ్ళీ ప్రారంభించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రభుత్వాన్ని కోరారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో దాదాపు రెండేళ్ళపాటు ప్రత్యక్ష తరగతులను నిర్వహించలేదన్న సంగతి తెలిసిందే.
సోనియా గాంధీ బుధవారం లోక్‌సభలో మాట్లాడుతూ, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించడం వల్ల అర్థాంతరంగా బడి మానేసినవారిని మళ్ళీ విద్య వైపునకు ఆకర్షించవచ్చునని తెలిపారు. బాలలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందజేయడం గురించి మాట్లాడిన సందర్భంగా ఆమె ఈ విజ్ఞప్తి చేశారు. కోవిడ్ మహమ్మారి వల్ల బాలలు తీవ్రంగా ప్రభావితులయ్యారని తెలిపారు. ఈ మహమ్మారి వచ్చిన తర్వాత మొట్టమొదట మూసివేతకు గురైనవి, చిట్టచివరిగా తెరిచినవి పాఠశాలలేనన్నారు. పాఠశాలలను మూసేయడం వల్ల మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా నిలిపేశారన్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రజలకు రేషన్ సరుకులను ఇచ్చారన్నారు. బాలలకు వండిన ఆహారాన్ని అందజేయడానికి ప్రత్యామ్నాయం లేదని తెలిపారు. బాలల తల్లిదండ్రులు జీవనోపాధిని సంపాదించడం కోసం చాలా కష్టాలు అనుభవించారనే విషయం నిజమని చెప్పారు. ఇటువంటి సంక్షోభం గతంలో ఎన్నడూ రాలేదన్నారు. బాలలు తిరిగి పాఠశాలలకు వస్తున్నందువల్ల వారికి మంచి పోషకాహారం అవసరమని చెప్పారు. సమగ్ర శిశు అభివృద్ధి సేవలను పటిష్టపరచి, మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని తెలిపారు.
ఇదిలావుండగా, కేంద్ర ప్రభుత్వం గత సెప్టెంబరు 29న ప్రధాన మంత్రి పోషణ్ స్కీమ్‌కు ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందుతున్న దాదాపు 11 లక్షల పాఠశాలలకు ఈ పథకం వర్తిస్తుంది. దీనిలో మధ్యాహ్న భోజన పథకం కూడా ఉంది. 2022నాటికి బాలల్లో పోషకాహార లోపాలను నిర్మూలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇవి కూడా చదవండి