సొంత డబ్బాకు.. సోషల్‌ మీడియా!

ABN , First Publish Date - 2022-09-26T08:02:30+05:30 IST

ఎన్నికల ఏడాది సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ యుద్ధానికి సిద్ధమవుతున్న పొలిటికల్‌ పార్టీలు ఆన్‌లైన్‌లో ఆధిపత్యం కోసం ఆయుధాలకు పదును పెడుతున్నాయి.

సొంత డబ్బాకు.. సోషల్‌ మీడియా!

  • విశ్వసనీయత ఉన్న యూట్యూబ్‌ చానళ్లు, వెబ్‌సైట్లే లక్ష్యం
  • రూ.లక్షలు పోసి కొనుగోలు చేస్తున్న రాజకీయ పార్టీలు
  • ఆ చానళ్లు, సైట్ల ద్వారా ప్రత్యర్థులపై వ్యతిరేక ప్రచారం
  • సొంత చానళ్లు, సైట్లను ప్రజలు నమ్మకపోవడంతో ఎత్తు
  • వార్తా సైట్ల కొనుగోళ్లలో అధికార టీఆర్‌ఎస్‌ ముందంజ
  • పలు యూట్యూబ్‌ న్యూస్‌ చానళ్లకు బీజేపీ ఆర్థిక సాయం
  • చానళ్లైతే సబ్‌స్ర్కైబర్లు.. సైట్లయితే వీక్షకుల ఆధారంగా ధర
  • కొన్నాక స్వీయ బాకా.. వాటికీ తగ్గుతున్న విశ్వసనీయత


(హైదరాబాద్‌-ఆంధ్రజ్యోతి): ఎన్నికల ఏడాది సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ యుద్ధానికి సిద్ధమవుతున్న పొలిటికల్‌ పార్టీలు ఆన్‌లైన్‌లో ఆధిపత్యం కోసం ఆయుధాలకు పదును పెడుతున్నాయి. నిజానికి రాష్ట్రంలోని రాజకీయ పార్టీల్లో కొన్నింటికి సొంతంగా ప్రధాన మీడియా విభాగాలు (సొంత పత్రిక, టీవీ చానల్‌) ఉన్నాయి! ఇప్పటికే వాటిలో తమకు అనుగుణంగా, తమకు రాజకీయంగా ఉపకరించే కథనాలను ఆయా పార్టీలు గుప్పిస్తున్నాయి. అయితే.. ఇటీవలికాలంలో ప్రధాన స్రవంతి మీడియాకు దీటుగా వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ చానళ్ల వంటివాటికి కూడా ఆదరణ పెరుగుతోంది. కొన్ని యూట్యూబ్‌ చానళ్లకు టీవీ చానళ్లకు మించిన వీక్షకులు, సబ్‌స్ర్కైబర్లు ఉండడంతో ఇవి ప్రధాన మీడియాకు పోటీగా వృద్ధి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటి ప్రాధాన్యాన్ని గుర్తించిన అన్ని పార్టీలూ ఆన్‌లైన్‌, సోషల్‌ మీడియా మీద కూడా దృష్టి సారించాయి. మరీ ముఖ్యంగా.. తటస్థంగా ఉండే చానళ్లు, సైట్లపై కన్నేశాయి. తమ సొంత మీడియాలో అయితే ప్రత్యర్థి పార్టీలను, ఆ పార్టీల నేతలను ఒక స్థాయి వరకే విమర్శించే అవకాశం ఉంటుంది. అదే ఆన్‌లైన్‌లో అయితే హద్దుల్లేకుండా విమర్శించే వీలు ఉండడం వారిని ప్రధానంగా ఆకర్షిస్తున్న అంశం. అందుకే.. రోజువారీ వీక్షణల సంఖ్య ఆధారంగా వెబ్‌సైట్లను, సబ్‌స్ర్కైబర్ల సంఖ్య ఆధారంగా యూట్యూబ్‌ చానళ్లను రూ.లక్షలు పోసి కొనుగోలు చేస్తున్నాయి. ఆరోపణలు, విమర్శల స్థాయి దాటి.. ఏ స్థాయికైనా వెళ్లి ప్రత్యర్థి పార్టీల మీద బురద జల్లేందుకు వాటిని ప్రధానంగా వాడుకుంటున్నాయి. సిద్ధాంతాలను పక్కన పెట్టి.. వాటి ద్వారా వ్యక్తిగత విమర్శలు గుప్పించి ప్రజల దృష్టిని ఆ క్షణానికి ఆకర్షించేందుకు పోటీడుతున్నాయి.


పోటాపోటీగా..

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వార్తలకు ఖ్యాతిగాంచిన ఓ వెబ్‌సైట్‌ను, యూట్యూబ్‌ చానల్‌ను అమ్మకానికి పెడుతున్నట్టు ఇటీవలే నిర్వాహకులు ప్రకటించారు. దీంతో వాటిని సొంతం చేసుకునేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ, తెలుగుదేశం పార్టీ పోటీపడ్డాయి. చివరకు రూ.40 లక్షలకు టీఆర్‌ఎస్‌ వాటిని సొంతం చేసుకుంది. అలాగే.. రెండు రాష్ట్రాల్లో పేరుగాంచిన ఓ వెబ్‌సైట్‌ను కొనుగోలు చేసేందుకు టీఆర్‌ఎస్‌, బీజేపీ, వైసీపీ పోటీపడ్డాయి. చివరకు రూ.30 లక్షలకు టీఆర్‌ఎస్‌, వైసీపీ కలిసి ఆ వెబ్‌సైట్‌ను సొంతం చేసుకున్నాయి. అంటే.. ఇప్పుడా వెబ్‌సైట్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల చెప్పుచేతల్లోకి వెళ్లింది. మొత్తంగా ఇటీవలికాలంలో ఆరు తెలుగు న్యూస్‌ వెబ్‌సైట్లను టీఆర్‌ఎస్‌ కొనుగోలు చేసింది. అలాగే.. ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న చానళ్లకూ ఆ పార్టీ నిధులు అందిస్తోంది. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తూ రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సను వ్యతిరేకించే చానళ్లకు బీజేపీ ఆర్థిక సహకారం అందిస్తోంది. 


పార్టీకి చెందిన కేంద్ర నేతలు రాష్ట్రంలో పర్యటించినప్పుడు.. వారికి లైవ్‌ కవరేజీ ఇవ్వడం, వారితో ఇంటర్వ్యూలు చేయడం, పార్టీ రాష్ట్ర నేతల ప్రకటనలను  ప్రచారం చేసే చానళ్లకు నెలవారీ నిర్వహణ ఖర్చులను అందిస్తోంది. బీజేపీ కేంద్ర నేతలు రాష్ట్ర పర్యటనల్లో మీడియా సమావేశం పెడితే..  ప్రధాన టీవీ చానళ్ల కంటే ఆ పార్టీ నిధులు పొందుతున్న యూట్యూబ్‌ చానళ్లే ఎక్కువగా ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. టీఆర్‌ఎస్‌, బీజేపీలతో పోలిస్తే కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్‌ కొంత వెనుకబడే ఉంది. కానీ.. అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే సైట్లు, చానళ్లకు హస్తం పార్టీ మద్దతు పలుకుతోంది. నియోజవర్గం పేరుతో వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా అకౌంట్లు నిర్వహిస్తున్న వారికి కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆర్థిక సహకారం అందిస్తున్నారు. ఆన్‌లైన్‌ ప్రచారం, సోషల్‌ మీడియా ఆధిపత్యం కోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎంతగా ప్రాధాన్యం ఇస్తున్నాయో తెలిపే పరిణామాలివి.


‘లెక్క’.. ఇలా!

వెబ్‌సైట్లకు రోజువారీ వీక్షణల సంఖ్య ఎంత.. యూట్యూబ్‌ చానళ్లలో సబ్‌స్ర్కైబర్లు ఎందరు.. అనే అంశం ఆధారంగా వాటికి ధరను నిర్ణయిస్తున్నారు. 10లక్షల సబ్‌స్ర్కైబర్లు కలిగి, ప్రజాదరణ పొందిన యూట్యూబ్‌ చానళ్లయితే రూ.10-20 లక్షల దాకా ఇచ్చి కొనుగోలు చేసేందుకూ పార్టీలు వెనుకాడట్లేదు.  మూడు నెలల క్రితం యూట్యూబ్‌ తెచ్చిన కొత్త ప్రకటనల విధానంతో పలు చానళ్ల ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో నిర్వహణ ఖర్చులు రాక ఇబ్బందులు పడుతున్న చాలా మంది వివిధ పార్టీలను సంప్రదిస్తున్నారు. వాటిని కొనుగోలు చేసిన పార్టీలు.. నిర్వహణ బాధ్యతలను తమ తమ సోషల్‌ మీడియా టీమ్‌లకు అప్పగిస్తున్నాయి. ప్రజాదరణ పొందిన సైట్లకు, చానళ్లకు గత శాసనసభ ఎన్నికలకు ముందు కూడా ప్రధాన పార్టీలు ఆర్థికసహాయం అందించాయి. 


వీటికోసం భారీగానే ఖర్చు చేశాయి. అయితే వాటికి అన్ని పార్టీల నుంచీ ప్రకటనలు వస్తుండటంతో.. ప్రత్యర్థులకు చాన్స్‌ లేకుండా మొత్తం తానే కొనుగోలు చేసే వ్యూహాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ దూకుడుగా అమలు చేస్తున్నట్టు సమాచారం. ఈ పరిణామాన్ని గమనించిన పలువురు ఔత్సాహికులు.. పార్టీలకు అనుకూలంగా కొత్త చానళ్లు ప్రారంభించేందుకు ఆసక్తి చూపిస్తున్నారని హైటెక్‌ సిటీ కేంద్రంగా ఉన్న ఓ వెబ్‌ డిజైనర్‌ తెలిపారు. తమ రోజువారీ కార్యక్రమాల కవరేజీ, ప్రత్యర్థులపై విమర్శలకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వ్యక్తిగతంగా ప్రత్యేక వెబ్‌సైట్‌, చానళ్లను ప్రారంభిస్తున్నారని చెప్పారు.


తగ్గుతున్న విశ్వసనీయత..

ప్రధాన ప్రతికలు, టీవీ చానళ్లతో పోటీపడుతూ గత కొన్నేళ్లుగా నెటిజన్ల ఆదరణ పొందుతున్న న్యూస్‌ వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ చానళ్లు తెలుగు రాష్ట్రాల్లో చాలానే ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీలకూ అనుబంధంగా ఉండకపోవడం వాటి బలం. అయితే.. ఇటీవల రాజకీయ పార్టీలు తమ ప్రచారం కోసం ఆయా చానళ్లను వాడుకొంటున్నట్లు వీక్షకులు ఇట్టే గుర్తిస్తుండడంతో వాటి విశ్వసనీయత క్రమంగా తగ్గుతోంది.

Updated Date - 2022-09-26T08:02:30+05:30 IST