సొంతిల్లు కలే..

ABN , First Publish Date - 2022-05-29T07:01:32+05:30 IST

ఇల్లు కట్టుకుంటావా? లేక పట్టా రద్దు చేయమంటావా? అంటూ గృహనిర్మాణ పథకం కింద ఇల్లు పొందిన లబ్ధిదారులను అధికారులు బెదిరిస్తున్నారు.

సొంతిల్లు కలే..
బుక్కరాయసముద్రంలోని జగనన్న కాలనీ

ఇల్లు కట్టు.. లేకుంటే పట్టా రద్దు చేస్తాం

బెదిరిస్తున్న అధికార యంత్రాంగం

చాలని రూ.1.80 లక్షల ప్రభుత్వ సాయం

అయోమయంలో లబ్ధిదారులు


ఇల్లు కట్టుకుంటావా? లేక పట్టా రద్దు చేయమంటావా? అంటూ గృహనిర్మాణ పథకం కింద ఇల్లు పొందిన లబ్ధిదారులను అధికారులు బెదిరిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ సైతం ఇటీవల జరిగిన సమావేశంలో ఈ నెలాఖరులోగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించకపోతే పట్టా రద్దు చేస్తామని హెచ్చరించాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం అందించే రూ. 1.80 లక్షలతో ఇల్లు నిర్మించుకోలేమని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నవరత్నాలు- పేదలందరికి ఇల్లు పథకం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

 అనంతపురం సిటీ 

 

ఎటూచాలని ప్రభుత్వ సాయం...

ప్రభుత్వ ఇల్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు ఎంతో సంబరపడిపోయారు. ఇల్లు నిర్మాణం చేపట్టేలోగా నిర్మాణానికి అవసరమయ్యే సామగ్రి ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ప్రభుత్వం ఒక్కొక్క ఇంటికి అందించే రూ. 1.80 లక్షలు ఏమాత్రం సరిపోవడం లేదు. కొన్ని ప్రాంతాలలో బేస్‌మెంట్‌ లెవల్‌కే సరిపోతోందని బాధిత వర్గాలు వాపోతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం సిమెంట్‌, ఇనుము, ఇసుక, కంకర, ఇటుకలు తదితర సామగ్రి ధరలు గతం కంటే రెట్టింపయ్యాయి. బేల్దారి, కార్మికుల కూలి పెరగడం మరింత భారంగా మారింది. మొత్తంగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఇల్లు నిర్మించుకోవాలంటే కనీసం రూ. 5లక్షలు కావాల్సిన పరిస్థితి ఉంది. 


ఇష్టారాజ్యంగా  బెదిరింపులు

జిల్లాలో లబ్ధిదారులకు ఇంటి పట్టాలు ఇచ్చి దాదాపు రెండేళ్లు కావస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో నిర్మాణాలు సాగలేదనేదీ అందరికి తెలిసిన విషయమే. కొన్ని ప్రాంతాల్లో అరకొరగా సాగాయు. చాలా ప్రాంతాలలో సకాలంలో బిల్లులు రాక.. పెరిగిన ధరలతో ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. పలు కారణాలతో ఎక్కడికక్కడ నిర్మాణాలు ఆగిపోవడంతో రాష్ట్ర స్థాయిలో జిల్లా ఏడో స్ధానంలో ఉంది. దీంతో జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఇటీవల రెవెన్యూ, హౌసింగ్‌ అధికారుల పనితీరుపై మండిపడ్డారు.  ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం.  ఇంటి నిర్మాణం ప్రారంభించకపోతే ప ట్టా రద్దు చేసి, మరొకరికి పట్టా ఇస్తామని బెదిరించి ఇళ్ల నిర్మాణ పురోగతి పెంచాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఇటు రెవెన్యూ, అటు హౌసింగ్‌, సచివాలయ ఉద్యోగులు ఎక్కడికక్కడ ఎవరికి వారు వారి స్థాయిలలో ఇష్టారాజ్యంగా బెదిరిస్తునట్లు లబ్ధిదారులు వాపోతున్నారు. 


 అయోమయంలో లబ్ధిదారులు

జిల్లా వ్యాప్తంగా నవరత్నాలు- పేదలందరికి ఇల్లు పథకం కింద 67,772 మందికి ప్రభుత్వ ఇళ్లు మంజూర య్యాయి. రెండేళ్ల నుంచి ఇప్పటిదాకా 452 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఒక్కో లబ్ధిదారుడికి 50 బస్తాలు సిమెంట్‌, బ్యాంకు, డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించే ప్రక్రియకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఈ ప్రక్రియ కూడా ఆశించిన స్థాయిలో ఫలించలేదు. మొత్తం గా ఇళ్ల నిర్మాణం పూర్తిగా నత్తనడకన సాగుతుండటంతో  లబ్ధిదారులపై అధికార యంత్రాంగం చేస్తున్న హెచ్చరికలు, బెదిరింపులతో ఇళ్ల నిర్మాణం చేయడానికి నానా తిప్పలు పడుతున్నారు. మరికొందరు ఒత్తిడి తాళలేక ఇల్లే వదులుకునేందుకు సిద్ధమయ్యారు.


ఒత్తిడి చేయడం లేదు: రాజశేఖర్‌, గృహనిర్మాణశాఖ పీడీ 

నవరత్నాలు- పేదలందరికి ఇల్లు పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. కానీ లబ్ధిదారులను బెదిరించమని చెప్పలేదు. సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. క్షేత్రస్ధాయిలో ఏమైనా సమస్యలు ఉంటే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. లబ్ధిదారులు కూడా తమ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి. బిల్లులు కూడా సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకుంటాం. పెరిగిన ధరలు విషయం వాస్తవమే. ఎక్కడైనా లబ్ధిదారులకు సమస్యలుంటే సంబంధిత ఉన్నతాధికారులకు నివేదించాలి. పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. 

Updated Date - 2022-05-29T07:01:32+05:30 IST