
న్యూఢిల్లీ: కరోనా కాలంలో ప్రజలను ఆదుకున్న నటుడు సోనూసూద్ ఇంటిపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఉదంతం ఇప్పుడు రాజకీయరంగు పులుముకుంది. ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ సోనూసూద్‌కు మద్దతు పలుకుతుండగా యూపీకి చెందిన మహాన్ దళ్ పార్టీ సోనూసూద్‌పై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది.

మహాన్ దళ్, సమాజ్ వాదీ పార్టీ సంయుక్తంగా బదాంయూలో ఏర్పాటు చేసిన ర్యాలీలో మహన్ దళ్ జాతీయ అధ్యక్షుడు కేశవదేవ్ మౌర్య మాట్లాడుతూ సోనూసూద్ పంపిన బస్సుల కారణంగా కరోనా వ్యాప్తి చెందిందని ఆరోపించారు. ప్రస్తుతం సోనూసూద్ ఇంటిపై రైడ్ జరుగుతోందని, ఇకపై అతను కూడా బీజేపీ తరపున ప్రచారం చేయాల్సివుంటుందన్నారు. కరోనా కాలంలో సోనూసూద్ పంపిన బస్సులకు పర్మిషన్ ఇచ్చారని, ప్రభుత్వ బస్సులను నడపలేదన్నారు. సోనూసూద్ ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన వ్యక్తి అన్ని అన్నారు. బీజేపీకి ఎన్నికల్లో మద్దతు పలికినపుడే అతను ఐటీ దాడుల నుంచి బయటపడగలడన్నారు.