కాంగ్రెస్‌లోకి సోనూ సూద్ సోదరి

ABN , First Publish Date - 2022-01-10T22:05:58+05:30 IST

తన సోదరి మాల్విక సూద్ రాజకీయాల్లోకి రానున్నారని నవంబర్‌లో సోనూ సూద్ ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరుతన్నారని విలేకరులు ప్రశ్నించగా ఆ విషయం సమయం వచ్చినప్పుడు చెప్తానని అప్పట్లో సోనూసూద్ అన్నారు..

కాంగ్రెస్‌లోకి సోనూ సూద్ సోదరి

చండీగఢ్: రాజకీయ ప్రవేశం గురించి ప్రకటించి రెండు నెలలు అవుతున్నప్పటికీ ఏ పార్టీలో చేరతారా అనే విషయమైన స్తబ్దతకు తెర దించుతూ తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు స్వయంగా ప్రకటించారు సోనూ సూద్ సోదరి మాల్విక సూద్ సచార్. అంతే కాకుండా తన స్వస్థలమైన మోగా నుంచి ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు కూడా ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పంజాబ్‌లోని మోగాలో ఉన్న సోనూ నివాసానికి స్వయంగా వెళ్లిన పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధినేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. సోనూతో పాటు ఆయన సోదరితో కాసేపు చర్చించారు.


తన సోదరి మాల్విక సూద్ రాజకీయాల్లోకి రానున్నారని నవంబర్‌లో సోనూ సూద్ ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరుతన్నారని విలేకరులు ప్రశ్నించగా ఆ విషయం సమయం వచ్చినప్పుడు చెప్తానని అప్పట్లో సోనూసూద్ అన్నారు. మాల్విక కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు అప్పట్లోనే అనేక వార్తలు వచ్చాయి. మాల్విక రాజకీయ ఆరంగేట్ర ప్రకటనకు కొద్ది రోజుల ముందే పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని సోనూ సూద్ కలుసుకోవడం ఈ వార్తలకు బలాన్ని ఇచ్చింది. నవజ్యోత్‌సింగ్ సిద్ధూతో సోనూ ఎప్పటి నుంచో టచ్‌లో ఉన్నారని, అయితే ఎన్నికల సమయం వరకు వేచి ఉండాలని పార్టీ తీర్థం ఇప్పటి వరకు పుచ్చుకోలేదని అంటున్నారు. గతంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ను సైతం సోనూ కలుసుకున్నప్పటికీ కాంగ్రెస్‌వైపే మొగ్గు చూపినట్లు సమాచారం.

Updated Date - 2022-01-10T22:05:58+05:30 IST