సోనూసూద్ మళ్ళీ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ప్రతీసారీ ఆపదలో ఉన్నవారికో, అవసరంలో ఉన్నవారికో సాయం అందిస్తూ పతాకశీర్షికలకెక్కిన సోనూ ఈసారి మోసగాళ్ళకి వార్నింగ్ ఇస్తూ వార్తల్లోకి వచ్చాడు. అసలు కథేంటంటే…..ఎవరో కొందరు మోసగాళ్ళు సోనూసూద్ ఫౌండేషన్ పేరు మీద అక్రమంగా డబ్బు సంపాదించడానికి పాల్పడ్డారు. సోనూ సూద్ ఫౌండేషన్ పేరు మీద మోసగాళ్ళు ప్రచారంలోకి తెచ్చి అమాయకులనుంచి డబ్బు దోచుకుంటున్న లెటర్ హెడ్‌ని సోనూ తన ఇన్స్టాగ్రామ్ హేండిల్ ద్వారా పబ్లిక్ చేశాడు. ఈ లెటర్ హెడ్ ద్వారా 60నెలల వాయిదాల చొప్పున, 5 లక్షల లోన్ తీసుకునే విధంగా సోనూసూద్ ఫౌండేషన్ సౌకర్యం కలుగ చేస్తోందని అమాయకుల దగ్గరనుంచి కొందరు అక్రమార్కులు డబ్బు దోచుకుంటున్నారు. ఆ లెటర్‌హెడ్ లోను మంజూరు కావడానికి ముందుగా 3,500రూపాయలు చెల్లించాలని కూడా కండీషన్ పెట్టారు. ముందుగా ఈ మొత్తం చెల్లించినవారికి వెంటనే లోను క్షణాలమీద శాంక్షన్ అయిపోతుందన్నది గమనిక. ప్రతీ నెలా చెల్లించాల్సిన వాయిదా మొత్తం దాదాపు 8వేలు ఉంటుందని కూడా చాలా నమ్మకంగా మాయగాళ్లు నమ్మబలికారు.
ఈ విషయాన్ని సోనూసూద్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా బేషరతుగా ఖండించాడు. ఇటువంటి ఋణాలను ఏర్పాటు చేస్తానని ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదని నిర్ధారించాడు. ఇటువంటివారితో జాగ్రత్తగా ఉండమని కూడా గట్టిగా సూచించాడు. ఈ కాల్స్ వచ్చే నెంబరు 9007224111 అని తెలియజేశాడు. దీనికి సంబంధించి సోనూ ఉత్తరప్రదేశ్, ముంబయి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఇటీవలే సోనూసూద్ తాను ప్రారంభించబోతున్న ఇండియాలోనే అతి పెద్ద బ్లడ్‌బ్యాంక్ గురించిన వీడియో షేర్ చేశాడు. ఇండియాలో డొనేటడ్ బ్లడ్ లేని కారణంగా రోజుకి 12, 000 మంది ప్రాణాలను కోల్పోతున్నారని, మనుషుల ప్రాణాలను కాపాడాలంటే కేవలం డాక్టర్లే కానక్కర్లేదని, బ్లడ్ డొనేటర్స్ అయినా చాలని, ఒక్క ఇరవై నిమిషాలు వెచ్చిస్తే ఒక నిండు ప్రాణం బ్రతుకుందని సోనూ అందరికి సందేశమిచ్చాడు.