శక్తి వైపు సూపులు!

ABN , First Publish Date - 2020-08-01T07:39:03+05:30 IST

వెదర్‌ కూల్‌గా ఉన్నప్పుడు వేడి వేడి సూప్‌ తాగితే శరీరానికి కొత్త ఎనర్జీ వస్తుంది.

శక్తి వైపు సూపులు!

వెదర్‌ కూల్‌గా ఉన్నప్పుడు వేడి వేడి సూప్‌ తాగితే శరీరానికి కొత్త ఎనర్జీ వస్తుంది. కరోనా భయం నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్యూనిటీ పెంచుకునేందుకు కూడా సూప్స్‌ ఉపయోగపడతాయి. అలాంటి కొన్ని సూప్స్‌ ఇవి. మరి మీరూ ట్రై చేయండి.


పుదీనా - పచ్చిబఠాణీ సూప్‌

కావలసినవి:-

ఆలివ్‌ ఆయిల్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - రెండు, ఉప్పు - తగినంత, పచ్చి బఠాణీ - నాలుగు కప్పులు, వెజిటబుల్‌ స్టాక్‌ - నాలుగు కప్పులు, పుదీనా - ఒక కట్ట, లేత పాలకూర - ఒక కప్పు, మిరియాల పొడి - అర టీస్పూన్‌. 


తయారీ :-

స్టవ్‌పై పాత్ర పెట్టి ఆలివ్‌ ఆయిల్‌ వేయాలి. నూనె బాగా వేడి అయ్యాక పుదీనా, పాలకూర, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగించాలి.

పదినిమిషాల తరువాత పచ్చి బఠాణీ, వెజిటబుల్‌ స్టాక్‌ వేసి కలియబెట్టాలి. మూత పెట్టి మరో పది నిమిషాల పాటు ఉడికించి దింపాలి.

మిశ్రమం చల్లారిన తరువాత మిక్సీలో వేసి బ్లెండ్‌ చేయాలి.

మెత్తగా అయిన మిశ్రమాన్ని ఒక పాత్రలో తీసుకుని కొద్దిగా ఆలివ్‌ అయిల్‌, మిరియాల పొడి చల్లాలి. పుదీనా ఆకులతో గార్నిష్‌ 

చేసి సర్వ్‌ చేయాలి. 

ఈ సూప్‌ రుచిగా ఉండటంతో పాటు రోగనిరోధక శక్తిని ఇస్తుంది.


క్యారెట్‌ సూప్‌

కావలసినవి:-

స్టాక్‌ కోసం : క్యారెట్లు - రెండు, ఉల్లిపాయ - ఒకటి, బంగాళదుంపలు - రెండు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు.

గార్నిష్‌ కోసం : ఉల్లిపాయ - ఒకటి, పాలకూర - ఒక కట్ట, పాలు - పావు కప్పు, నూనె - కొద్దిగా, మిరియాల పొడి - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత.


తయారీ:-

క్యారెట్లు శుభ్రంగా కడిగి తురుమాలి. ఉల్లిపాయ కట్‌ చేసుకోవాలి. బంగాళదుంపలు పొట్టుతీసి చిన్నగా కట్‌ చేయాలి.

ఇప్పుడు కుక్కర్‌లో ఐదు కప్పుల నీళ్లు పోసి క్యారెట్లు, ఉల్లిపాయ, బంగాళదుంపలు, వెల్లుల్లి రెబ్బలు వేసి ఉడికించాలి.

ఆవిరి పోయిన తరువాత వాటిని బయటకు తీసి మిక్సీలో వేసి పట్టుకోవాలి.

మరొక పాత్రను స్టవ్‌పై పెట్టాలి. కాస్త నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, పాలకూర వేసి వేగించాలి.

ఇప్పుడు మిక్సీలో పట్టుకున్న స్టాక్‌ వేసి కొద్దిసేపు ఉడికించాలి.

తరువాత పాలు వేడి చేసి పోయాలి. బాగా కలపాలి.

చివరగా ఉప్పు, మిరియాల పొడి చల్లి వేడిగా అందించాలి.


అల్లం సూప్‌

కావలసినవి:-

తియ్యటి గుమ్మడికాయ - ఒకటి, అల్లం - 50 గ్రాములు, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - రెండు, వెజిటబుల్‌ స్టాక్‌ - నాలుగు కప్పులు, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - అర టీస్పూన్‌, ఆలివ్‌ ఆయిల్‌ - ఒక టేబుల్‌స్పూన్‌. 


తయారీ :-

అల్లం, వెల్లుల్లి రెబ్బలను దంచుకోవాలి. ఉల్లిపాయలు కట్‌ చేసి పెట్టుకోవాలి.

స్టవ్‌పై పాన్‌ పెట్టి ఆలివ్‌ ఆయిల్‌ వేయాలి. నూనె వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి. 

తరువాత అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి మరికాసేపు వేగించాలి.

ఇప్పుడు తియ్యటి గుమ్మడి కాయ ముక్కలు, వెజిటబుల్‌ స్టాక్‌ వేసి కలపాలి. అరగంటపాటు ఉడికించాలి.

గుమ్మడికాయ ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత స్టవ్‌పై నుంచి దింపాలి.

చల్లారిన తరువాత మిక్సీలో వేసి బ్లెండ్‌ చేస్తే అల్లం సూప్‌ రెడీ. 

వేడిగా వేడిగా సర్వ్‌ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రిజ్‌లో పెట్టుకుని తరువాత క్విక్‌ మీల్‌గా సర్వ్‌ చేయవచ్చు.


గుమ్మడికాయ సూప్‌

కావలసినవి:-

గుమ్మడికాయ - ఒకటిన్నర కిలో, ఆలివ్‌ ఆయిల్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి - రెండు, కొత్తిమీర - ఒకకట్ట, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - మూడు, వెజిటబుల్‌ స్టాక్‌ - ఒక లీటరు, ధనియాలు - ఒక టేబుల్‌స్పూన్‌, మిరియాల పొడి - అర టీస్పూన్‌, క్యారెట్‌ - ఒకటి, ఉప్పు - తగినంత.


తయారీ:-

ముందుగా ఓవెన్‌ను 170 డిగ్రీ సెల్సియస్‌ వరకు వేడి చేయాలి. 

గుమ్మడికాయను ముక్కలుగా కట్‌ చేయాలి. తరువాత ఒక బేకింగ్‌ ట్రేలోకి తీసుకొని వాటిపైన ఆలివ్‌ ఆయిల్‌ చల్లాలి. 

ఎండుమిర్చి, ధనియాలను మిక్సీలో గ్రైండ్‌ చేయాలి. ఈ పొడిని గుమ్మడికాయ ముక్కలపై చల్లాలి.

మిరియాల పొడి కూడా చల్లాలి. తరువాత ఓవెన్‌లో పెట్టి 45 నిమిషాల పాటు ఉడికించాలి.

వెడల్పాటి పాన్‌ స్టవ్‌పై పెట్టి కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ వేయాలి. నూనె వేడి అయ్యాక తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, క్యారెట్‌ తురుము, కొత్తిమీర వేసి, పావుగంటపాటు చిన్నమంటపై ఉడికించాలి.

ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలను  ఓవెన్‌లోంచి బయటకు తీసి, వెజిటబుల్‌ స్టాక్‌ కలిపి మిక్సీలో వేసి బ్లెండ్‌ చేయాలి. 

ఈ మిశ్రమాన్ని వెజిటబుల్‌ స్టాక్‌ వేగుతున్న పాన్‌లో పోయాలి. మరికాసేపు ఉడికించి దింపి, వేడి వేడిగా సర్వ్‌ చేయాలి.


నిమ్మగడ్డి - కొత్తిమీర సూప్‌


కావలసినవి:-

కొత్తిమీర - రెండు కట్టలు, పచ్చిమిర్చి - రెండు, అల్లం - చిన్నముక్క, ఉల్లిపాయ - ఒకటి, క్యారెట్‌లు - రెండు, నిమ్మకాయ - ఒకటి, కొబ్బరిపాలు - అరకప్పు, ఉప్పు - తగినంత, లెమన్‌గ్రాస్‌ స్టాక్‌ - ఒకకప్పు, ఉల్లికాడలు - అరకప్పు.


తయారీ:-

కొత్తిమీరను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్‌ చేయాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయను కట్‌ చేయాలి. క్యారెట్లను తురుముకోవాలి. ఉల్లికాడలను చిన్నగా తరగాలి.

ఒక పాత్రలో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, లెమన్‌గ్రాస్‌ స్టాక్‌ తీసుకోవాలి. అందులో కొబ్బరిపాలు, ఒక కప్పు నీళ్లు పోసి చిన్నమంటపై అరగంటపాటు మరిగించాలి.

తరువాత ఈ మిశ్రమాన్ని మరొక పాత్రలోకి వడబోయాలి. అందులో క్యారెట్‌ తురుము, ఉల్లికాడలు, తగినంత ఉప్పు వేసి మరికాసేపు మరిగించాలి.

కొత్తిమీర, నిమ్మకాయ ముక్కలతో గార్నిష్‌ చేసుకుంటే రుచిగా బాగుంటుంది. 

Updated Date - 2020-08-01T07:39:03+05:30 IST