
ఏలూరు : జంగారెడ్డిగూడెంలో ఇటీవల కాలంలో కల్తీ సారా తాగి 26 మంది మరణించిన జరిగిన ఘటనపై టీడీపీ మహిళా నాయకురాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన టీడీపీ మహిళ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సౌభాగ్యవతి మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే స్పందించి కల్తీ సారా తాగి మరణించిన కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కల్తీసారా మరణాలను గురించి అసెంబ్లీలో చర్చకు వచ్చిందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తమ ఎమ్మెల్యేలను ఆక్రమంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి, ఆ మరణాలు సహజ మరణాలని అసెంబ్లీ వేదికగా చెప్పడం చాలా దురదృష్టకరమని సౌభాగ్యవతి పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కల్తీ సారా తాగి మరణించిన కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. చదువుకునే పిల్లలకు చదువులు పూర్తి అయ్యేవరకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. అదేవిధంగా మహిళలకు వితంతు పింఛను మంజూరు చేయాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అదేవిధంగా కల్తీ సారా తయారు చేసేవారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తమ టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నామని సౌభాగ్యవతి తెలిపారు.